Home ఎడిటోరియల్ ప్రతిపక్ష ఐక్యతకు వారధి మమతా బెనర్జీ

ప్రతిపక్ష ఐక్యతకు వారధి మమతా బెనర్జీ

 Mamata Banerjee is on a three-day visit to Delhi

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ మూడు రోజుల ఢిల్లీ పర్యటన ఆమెను వార్తల్లో వ్యక్తిని చేసింది. అసోంలో పౌరసత్వ రిజిస్టర్ తయారీ తీరుపై ఆమె ఆగ్రహం, హెచ్చరికలు ఒక ఎత్తుకాగా, 2019 లోక్‌సభ ఎన్నికల్లో బిజెపిని అధికారం నుంచి తొలగించేందుకై ఐక్యప్రతిపక్ష కూటమికై వివిధ పార్టీల నేతలతో ఆమె చర్చలు మరో ఎత్తు. జులై 21న కోల్‌కతాలో అమరవీరుల దినోత్సవ ర్యాలీలో ఆమె వచ్చే ఎన్నికల్లో బిజెపికి వ్యతిరేకంగా ప్రతిపక్షాల ఐక్యతకు పిలుపుఇచ్చారు. మోడీ ప్రభుత్వాన్ని ఓడించాలని దేశ ప్రజలకు పిలుపు ఇచ్చేందుకు వచ్చే జనవరి 19న బ్రిగేడ్ పెరేడ్ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించ తలపెట్టారు. కాషాయ శక్తులకు వ్యతిరేకంగా దృఢమైన ప్రతిపక్ష ఐక్యతకు దోహదం చేసేందుకై ఆ సభకు సిపిఐ(ఎం), కాంగ్రెస్ సహా బిజెపి వ్యతిరేక పార్టీలను ఆహ్వానించనున్నట్లు ఆమె ప్రకటించారు. ఆ ప్రయత్నానికి ఆరంభంగానే మమతా బెనర్జీ ఢిల్లీలో సోనియా గాంధి, రాహుల్ గాంధితోపాటు పలువురు ప్రతిపక్ష నేతలను కలిశారు. ఆమె ప్రధానమంత్రి కావాలనుకుంటున్నారని, రాహుల్ గాంధి నాయకత్వాన్ని అంగీకరించేందుకు సిద్ధంగాలేరని వార్తలు ప్రచారంలో ఉన్న నేపధ్యంలో ఆమె ఆ విషయాన్ని తోసిపుచ్చారు. ‘బిజెపిని ఓడించటం తక్షణ కర్తవ్యం. నాయకత్వం సమస్య ఫలితాల అనంతరం చర్చల ద్వారా నిర్ణయమవుతుంది’ అంటూ, ఆ అంశాన్ని వివాదం చేయదలుచుకున్నవారి నోళ్లకు తాళం వేశా రు.

సాధారణ షెడ్యూల్ ప్రకారం లోక్‌సభ ఎన్నికలు 9 మాసాల లోపే ఉన్నాయి. ఎన్నికలకు వెళ్లటానికి ఏది సరైన సమయమని బిజెపి మేధావులు, ప్రధాని సలహాదారులు నిరంతరం మదింపు చేస్తున్నారు. నరేంద్ర మోడీ ఆకర్షక శక్తి 2014 నాటి కన్నా బాగా బలహీనపడిందని ఆర్‌ఎస్‌ఎస్ నాయకత్వానికి, బిజెపి సీనియర్ నాయకులకు తెలుసు. గత నాలుగేళ్ల ఎన్‌డిఎ పాలన కూడా సామాన్యులకు ఎటువంటి ఉపశమనం చేకూర్చలేదు. వారిలో చాలా మంది గత ఎన్నికల్లో బిజెపికి ఓటు చేశారు. బిజెపి కార్యకర్తల పాత్రతో మత కలహాల ఘటనలు పెచ్చు పెరిగాయి. దేశంలో మొత్తం మీద అసహనం, అభద్రత సర్వవ్యాప్తంగా కనిపిస్తున్నది.

ఈ సంవత్సరం నవంబర్, డిసెంబర్ మాసాల్లో జరిగే మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి పెద్దగా నష్టపోతుందని అన్ని సూచనలు, ఆ పార్టీ అంతర్గత నివేదికలు తెలియజేస్తున్నాయి. సడలిన ప్రజావిశ్వాసాన్ని పునరుద్ధ్దరించుకునే నిమిత్తం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజె అప్పుడే బస్సు రథ యాత్రలు మొదలుపెట్టారు. ఈ మూడు రాష్ట్రాల్లో బిజెపి అధికారాన్ని నిలుపుకోలేకపోతే కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు నవోత్తేజం పొందుతాయి, 2019 ఏప్రిల్/ మే లోక్‌సభ ఎన్నికల్లో కాషాయ శక్తులను ఓడించటానికి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. బిజెపి నాయకత్వం ప్రతిపక్షానికి ఆ అవకాశమిస్తుందా? అందువల్లనే, ఎన్నికల సమయంపై బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ నాయకత్వంలో పెద్ద చర్చ జరుగుతోంది. లోక్‌సభ ఎన్నికలను అసెంబ్లీ ఎన్నికలతో నిర్వహించేందుకుగాను వాటిని ముందుకు తీసుకురావాలన్నది ఒక అభిప్రాయం. అదే అంతిమంగా జరిగితే ప్రస్తుత లోక్‌సభకు ఈ వర్షాకాల సమావేశమే ఆఖరుదవుతుంది.

బిజెపిని ఓడించే నిమిత్తం కాంగ్రెస్‌తో కలిసి పనిచేయటానికి అనేక కాంగ్రెసేతర ప్రతిపక్ష పార్టీలు సిద్ధమవుతున్నందున సైద్ధాంతికంగా బిజెపిని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలకు ఇదొక మంచి అవకాశం. పునర్వవస్థీకరించబడిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తొలి సమావేశం 2019లో అధికారంలోకి రాకుండా బిజెపిని నిరోధించటమే ప్రథమ కర్తవ్యంగా ప్రకటించటం, అలయెన్స్‌లు కూర్చే అధికారాన్ని రాహుల్ గాంధికి అప్పగించటం గమనార్హం. ప్రతిపక్ష కూటమి ప్రధానమంత్రి అభ్యర్థి రాహుల్ గాంధీయేనని కొందరు సభ్యులు వక్కాణించినప్పటికీ, ఎన్నికల ఫలితాలనుబట్టి ఆ అంశాన్ని అప్పుడు నిర్ణయించవచ్చునన్నది స్థూల అభిప్రాయం. కాంగ్రెస్ ఏకైక పెద్ద పార్టీగా అవతరిస్తుందని, అప్పుడు నాయకత్వం సహజంగా దానికి దక్కుతుందని, ఒకవేళ కర్నాటకలాంటి పరిస్థితి తలెత్తితే ప్రధాని పదవి వదులుకోవటానికి సిద్ధంగా ఉండాలని వర్కింగ్ కమిటీ వెసులుబాటుతో కూడిన నిర్ణయం తీసుకుంది.

ఇప్పుడున్న పరిస్థితి బట్టి కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలు అన్ని రాష్ట్రాల్లో బిజెపి వ్యతిరేక ఫ్రంట్ నిర్మించటం సాధ్యపడదు. అందువల్ల, బిజెపికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రధానమైన పార్టీగా ఉన్న రాష్ట్రాల్లో దాని ఆధిక్య పాత్రను అనుమతించటం సరైన మార్గమవుతుంది. అటువంటి రాష్ట్రాలు 12 ఉన్నాయి. ఆ రాష్ట్రాల్లో బిజెపి వ్యతిరేక ఓట్లలో చీలికను నివారించే నిమిత్తం కాంగ్రెస్ పార్టీ ఇతర చిన్న పార్టీలతో సీట్ల సర్దుబాటు చేసుకోవచ్చు. స్వల్ప ఓటు తేడా ఉన్న సీట్లలో ఇదెంతో మేలు చేస్తుంది. కాంగ్రెస్‌పార్టీ అతి సాధారణ పార్టీగా ఉన్న ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల్లో అది ఇతర బిజెపియేతర ప్రతిపక్ష పార్టీల కూటమిలో జూనియర్ భాగస్వామి కావచ్చు. ప్రాంతీయ పార్టీలు ఆధిక్య స్థానంలో ఉండి, అవి రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్, బిజెపి రెండింటికీ వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రాష్ట్రాలు మరో కేటగిరీ.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిసా, పశ్చిమ బెంగాల్ ఈ కేటగిరిలో ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికలకు సీట్ల సర్దుబాటు సాధ్యంకాదు. కొత్త లోక్‌సభలో మెజారిటీ సాధనలో ఎన్‌డిఎ విఫలమైతే, బిజెపియేతర ప్రభుత్వం ఏర్పాటుకు ఆ పార్టీల సహాయ సహకారాలను అప్పుడు కోరి పొందవచ్చు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ పాత్ర ఇక్కడ వస్తుంది. ఆమెకు కాంగ్రెస్‌తో, ప్రాంతీయ పార్టీలతో స్నేహం ఉంది. బిజెపికి వ్యతిరేకంగా ఒక నియోజకవర్గంలో ప్రతిపక్షం ఒకే అభ్యర్థిని నిలబెట్టాలని, ఏ రాష్ట్రంలో ఏ పార్టీ ఆధిక్యంలో ఉంటే సీట్ల కేటాయింపు బాధ్యతను ఆ పార్టీకి అప్పగించాలని ఆమె కొంతకాలంక్రితం ప్రకటించారు. ప్రాంతీయ పార్టీలతో కూడిన ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ఆమె లక్షం. సీనియర్ నాయకురాలిగా ఆమెను ప్రధానమంత్రి అభ్యర్థిగా ముందుకు తేవాలన్నది టిఎంసి నేతల అభిలాష. ఆమెకు కూడా ఆకోర్కె ఉండవచ్చు. ఆమె ఇప్పుడు విజ్ఞత ప్రదర్శించి, ప్రధానమంత్రి అభ్యర్థి ఎన్నికల అనంతరం చర్చల ద్వారా నిర్ణయించటం జరుగుతుందన్నారు. ఆ విధంగా ఆ అంశంపై కాంగ్రెస్‌తో ఘర్షణను వాయిదా వేశారు. కాంగ్రెస్ కూడా అదే వైఖరితో ఉంది.

ఆ విధంగా రెండు ఫ్రంట్‌లు రాహుల్ గాంధి నాయకత్వంలో యుపిఎ, ప్రాంతీయ పార్టీల నేషనల్ ఫ్రంట్ ఉండవచ్చు. అదే సమయంలో వామపక్షాలకు కేరళలో కాంగ్రెస్ నాయకత్వంలోని యుడిఎఫ్, పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థులు. కొన్ని రాష్ట్రాల్లో బిజెపియేతర పక్షాలతో లేదా కూటములతో సీట్ల సర్దుబాటు ఉండవచ్చు. ప్రభుత్వం ఏర్పాటు అవకాశాలు ఆవిష్కృతమైతే దాని తో పనిచేయటానికి అవి సిద్ధంగా ఉంటాయి. బిజెపి మత, కుల విభజనవాద రాజకీయాలపై, కార్పొరేట్ అనుకూల ఆర్థిక విధానాలపై నికరంగా తమ శక్తి మేరకు పోరాటాలు చేస్తున్నది వామపక్షాలే. ఈ మూడు స్రవంతుల ఉమ్మడి లక్షం నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి/ఆర్‌ఎస్‌ఎస్ ప్రభుత్వాన్ని అధికారానికి దూరం చేయటమే. జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఇటీవల కోల్‌కతాలో మమతా బెనర్జీతో చర్చల అనంతరం చెప్పినట్లు, బిజెపి తర్వాత దేశవ్యాప్త పార్టీ అయిన కాంగ్రెస్ భాగస్వామ్యం లేకుండా ఏ ప్రతిపక్ష కూటమి సఫలం కాజాలదు. మమతా బెనర్జీ అంతిమంగా సారథి అయినా, కాకపోయినా, కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీ ల మధ్య వారధిగా వ్యవహరించగల స్థితిలో ఉన్నారు. కాంగ్రె స్, ప్రాంతీయ పార్టీల ఐక్యత మాత్రమే బిజెపిని అధికారంనుంచి తొలగించగలదు. * నిత్యా చక్రవర్తి