Home జాతీయ వార్తలు దీదీ జోస్యం… బిజెపి 100కి పడిపోతది

దీదీ జోస్యం… బిజెపి 100కి పడిపోతది

Mamatha-benargi-image

కోల్‌కతా: వచ్చే ఎన్నికల్లో బిజెపి సంఖ్యాబలం 100 సీట్లకు పడిపోనున్నట్టు పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ జోస్యం చెప్పారు. శుక్రవారం అవిశ్వాస తీర్మానం సందర్భంగా ఎన్ డిఎ 325 ఓట్లను కలిగి ఉందని తెలియజేశారు. కానీ ఈ సంఖ్యాబలం వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 100 స్థానాలకు పడిపోనుందని ఆమె వ్యాఖ్యానించారు. శనివారం జరిగిన టిఎంసి అమరుల వార్షిక ర్యాలీలో మమతా బెనర్జీ పాల్గొని మాట్లాడారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో తృణముల్ కాంగ్రెస్ రాష్ట్రంలోని మొత్తం 42 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దేశాన్ని రక్షించడానికి తాము బిజెపిని తరిమి కొడతామని ఆమె ప్రతిజ్ఞ చేశారు. బిజెపిని ఓడించడానికి ఫెడరల్ ఫ్రంట్ మార్గాన్ని అనుసరించబోతున్నట్టు చెప్పారు. సిఎం కూర్చీ గురించి తమకేం బాధలేదని తమ ఆలోచనంతా దేశం, దేశ ప్రజల గురించేనని మమతా పేర్కొన్నారు. లోక్‌సభలో బిజెపి సంఖ్యాబలం తగ్గుతూ వస్తుందని ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, బిహార్, ఒడిశా, పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ర్టాలే దీనికి ఉదాహరణ అని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు.