Home ఎడిటోరియల్ కోల్‌కతాలో పంజరపు చిలుక

కోల్‌కతాలో పంజరపు చిలుక

 

జనవరి 19వ తేదీన దాదాపు 20 పార్టీలు కోల్ కతాలో జరిగిన బ్రిగేడ్ ర్యాలీలో పాల్గొన్నాయి. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి వేదికపై స్వయంగా నడిపించిన మహాసభలో ఈ పార్టీలన్నీ చేతులు కలిపి మోడీ సర్కారును కూల్చుతామన్నాయి. ఆ తర్వాత వివిధ పార్టీల నాయకులకు మమతా బెనర్జీ సౌజన్య పూర్వక విందు ఇచ్చారు. అందులో ఆమె స్వయంగా వివిధ నాయకులకు పశ్చిమబెంగాల్ ఆహార పదార్థాలను వడ్డిస్తూ కనిపించారు. ప్రధాని పదవికి పోటీపడే అనేకమంది నేతలు అక్కడ మనకు కనిపించారు. కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలోని, బిజెపి సారథ్యంలోని ఎన్‌డిఎ ప్రభుత్వాన్ని కుప్పకూల్చడమే ధ్యేయంగా ఈ పార్టీలన్నీ కలిసి పనిచేస్తామన్నాయి.
నెల రోజులు కూడా గడవకముందే, మమతా బెనర్జీ కోల్‌కతాలో ధర్నా చేయవలసిన అవసరం వచ్చింది. ముఖ్యమంత్రి అయినా సరే అవసరమైతే ధర్నాకు కూర్చోవడం తప్పుకాదని, అలా చేయడం అవసరమేనని ఇంతకు ముందు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చాటి చెప్పిన సంగతి బహుశా ఆమెకు గుర్తుండి ఉంటుంది. త్వరలోనే ఒక మహాయుద్ధానికి సిద్ధం కావలసి ఉందని ఆమెకు తెలుసు. ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఆయుధాలు పదును పెట్టుకుంటోంది.
మమతాబెనర్జీ ఎందుకు ధర్నా చేస్తున్నారన్న ప్రశ్నకు జవాబు, అంతకు ముందు రోజు సిబిఐ అధికారులకు, కోల్ కతా పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణ. పాంజీ స్కీముల కుంభకోణానికి సంబంధించిన కోల్ కతా పోలీసు కమిషనర్ రాజీవ్ కుమార్‌ను ప్రశ్నించాలని సిబిఐ అధికారులు కోల్‌కతా వచ్చారు. కాని కోల్‌కతా వచ్చిన ఈ సిబిఐ అధికారులను కోల్‌కతా పోలీసులు నిర్బంధంలోకి తీసుకుని పోలీసు స్టేషనుకు తరలించారు. రాజీవ్ కుమార్‌కు ఈ కుంభకోణంలో ప్రమే యం ఉందని సిబిఐ ఆరోపణ. కాని మమతాబెనర్జీ మాత్రం ఆయన నిజాయితీపరుడైన, సమర్థుడైన పోలీ సు అధికారి అని కితాబు ఇచ్చారు. విశ్వసనీయతలేని, పంజరంలో చిలక వంటి సిబిఐ నుంచి తన అధికారులను కాపాడుకుంటున్న నాయకురాలిగా ఆమె ఈ ధర్నాతో ప్రజలకు పరిచయమయ్యారు. ఒక కుంభకోణంలో విచారణను అడ్డుకునే ప్రయత్నంగా ఇది కనిపిస్తున్నప్పటికీ రాజకీయంగా ఇది గొప్ప ఎత్తుగడ కాదనలేం. మమతా బెనర్జీ ఇలా తిరగబడతారని బహుశా బిజెపి ఊహించలేదు.
ఇప్పుడేం జరిగింది. వివిధ పార్టీలు మమతాబెనర్జీకి మద్దతుగా ముందుకు వచ్చాయి. సిబిఐ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పంజరంలో చిలక అని కోర్టు స్వయంగా వ్యాఖ్యానించింది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం చేతిలో కీలు బొమ్మగా వ్యవహరిస్తుందన్న అనుమానాలు బలంగా ఉన్నాయి. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెసుకు అనుకూలంగా రాజకీయ ప్రత్యర్థులపై ఉపయోగించారన్న ఆరోపణలు వినిపించాయి. ఇప్పుడు బిజెపి అధికారంలో ఉన్నప్పుడు బిజెపి ప్రత్యర్థులపై ఉపయోగిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల సిబిఐలో జరిగిన రచ్చ కూడా అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల అకస్మాత్తుగా పాత కేసులపై అనేక కేంద్ర సంస్థలు చురుకుగా పని చేస్తుండడం, రాజకీయ ప్రత్యర్థులే లక్ష్యంగా ఐబి, ఆదాయపు పన్ను శాఖల దాడులు జరుగుతుండడం ఇవన్నీ ప్రజలు గమనించడం లేదనుకుంటే పొరబాటు. సిబిఐ కూడా పాత కేసుల విచారణ విషయంలో ఒక్కసారి చురుకుగా చర్యలు తీసుకోవడం, అది కూడా ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ పరిణామాలను ప్రజలు కూడా నిశితంగా గమనిస్తున్నారు. సిబిఐ పని తీరును ప్రజలు గమనించడం లేదనుకోవడం పాలకుల భ్రమ.
బ్రిగేడ్ ర్యాలీ తర్వాత ప్రతిపక్ష ఐక్యత స్పష్టంగా ముందుకు వచ్చిన నేపథ్యంలో మమతాబెనర్జీని ఇబ్బంది పెట్టేలా సిబిఐని కేంద్రమే ప్రయోగించి ఉంటే ఎన్నికలకు ముందు ఇది రాజకీయ తప్పిదమే. అలాగే, ఈ నేపథ్యంలో ధర్నాకు దిగడం ద్వారా పరిస్థితిని తనకు అనుకూలంగా వాడుకోవడం మమతాబెనర్జీ రాజకీయ చాకచక్యానికి నిదర్శనం. మోడీతో ప్రత్యక్షంగా తలపడుతున్న నేతగా ఆమె గుర్తింపు ఈ చర్యతో ఎక్కువైంది. బలమైన సంకల్పం ఉన్న నాయకులనే ప్రజలు ఆదరిస్తారన్నది కూడా ఆమెకు తెలుసు. ప్రతిపక్ష ఐక్యత సందర్భంగా తలెత్తిన మరో ప్రశ్న, తదుపరి ప్రధాని అభ్యర్థి ఎవరన్నది. ప్రతిపక్ష నాయకుల్లో చాలా మంది పోటీపడుతున్నారు. కాని రాజకీయ చర్చ తమ చుట్టు తిప్పుకున్నవారికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మమతాబెనర్జీ చుట్టే ఇప్పుడు చర్చ తిరుగుతోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మమతాబెనర్జీకి ఇది ఎంతో ఉపయోగపడే సానుకూలాంశం.
ఇటీవల అఖిలేష్ యాదవ్‌కు కూడా సిబిఐ నుంచి హెచ్చరికల వంటి సందేశాలు వెళ్ళాయి. అఖిలేష్ యాదవ్ కూడా సిబిఐని కేంద్రం వాడుకుంటుందని విమర్శించారు. కాని మమతాబెనర్జీ తనపై సిబిఐని ప్రయోగించి దెబ్బతీయాలని చూస్తున్నారని చెప్పడమే కాదు, ఇలాంటి ప్రయత్నాలు సహించేది లేదన్న రీతిలో పోరాటానికి సిద్ధమయ్యారు. మోడీపై మమతాబెనర్జీ పోరాటం ఇప్పుడు మిగిలిన నాయకులను మరుగుజ్జులుగా మార్చేసింది. రాఫెల్ పై రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటం కాని, ప్రియాంక గాంధీ రాజకీయాల్లోకి వచ్చి సృష్టించిన సంచలనం కాని అన్నీ ఇప్పుడు వెనక్కు వెళ్ళి పోయాయి. కనిపిస్తున్నది కేవలం మమతా బెనర్జీ మాత్రమే.
పశ్చిమ బెంగాల్లో బలపడడానికి బిజెపి చేస్తున్న ప్రయత్నాలు బెడిసి కొడుతున్నాయా? పశ్చిమబెంగాల్ రాజకీయాల్లో ఎన్నికలు ఎలా గెలవాలన్నది మమతాబెనర్జీకి బాగా తెలిసిన విద్య. ఇప్పుడు ఆమె కోల్‌కతా వేదికగా జాతీయ రాజకీయాల్లో ప్రకాశించే అవకాశం దొరికింది. ప్రజలు ఈ పరిణామాలన్నింటిని గమనిస్తున్నారు. ఇప్పుడు ప్రతిపక్ష ఐక్యతను నిరూపించాలంటే, ఇంతకు ముందు ఫ్రంట్ గురించి మాట్లాడిన ప్రతి నాయకుడు మమతా బెనర్జీకి మద్దతివ్వక తప్పని పరిస్థితి ఆమె సృష్టించారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆమెకు మద్దతుగా మాట్లాడారు. జెడి (యస్) నాయకుడు దేవెగౌడ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిఎంకె నాయకుడు స్టాలిన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఉమర్ అబ్దుల్లా, ఆర్‌జెడి నాయకుడు తేజస్వీ యాదవ్, రాష్ట్రీయ లోక్ దళ్ నాయకుడు జయంత్ చౌదరీ, కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, సమాజవాది పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్, మాజీ కేంద్రమంత్రి యశ్వంత్ సిన్హా, కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పిడిపి పార్టీ నాయకురాలు మహబూబా ముఫ్తీ, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శరద్ పవార్ మాత్రమే కాదు, బిజెపికి సన్నిహితంగా ఉండే శివసేన కూడా మమతాబెనర్జీ వైపే నిలిచాయి. జాతీయ రాజకీయాల్లో మోడీ వ్యతిరేక ఫ్రంటుకు కావలసిన సువర్ణావకాశం, ప్రధాని పదవికి అభ్యర్థిగా మమతా బెనర్జీ బలపడే అవకాశం ఇప్పుడు లభించాయి.

Mamata Benarjee sensational comments on Modi