Home జాతీయ వార్తలు ప్రతిపక్ష ఐక్యతతో బిజెపిలో ఓటమి భయం

ప్రతిపక్ష ఐక్యతతో బిజెపిలో ఓటమి భయం

sonia

టిఎంసి అధినేత్రి మమత వెల్లడి

 సోనియా, రాహుల్‌తో కీలక చర్చలు

 బిజెపి నేత అద్వానీతో భేటీ 

న్యూఢిల్లీ : బిజెపికి ఇప్పుడు 2019 లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కోవాంటే భయంగా ఉందని, ఏమవుతుందో అనే ఆందోళన పట్టుకుందని బంగ్లా ముఖ్యమంత్రి మమత బెనర్జీ చెప్పారు. ప్రతిపక్షాలను ఒక్కతాటిపైకి తేవడమే తమ ధ్యేయమని, ఇదే తమ ప్రాధాన్యతాక్రమం అని ఆమె బుధవారం ఇక్కడ తేల్చిచెప్పారు. గత రెండు రోజులుగా దేశరాజధానిలో మమత మకాం వేశారు. వివిధ పార్టీల ప్రతిపక్ష నేతలను కలుసుకునేపనిలో పడ్డారు. బుధవారం ఆమె యుపిఎ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్‌గాంధీని విడిగా కలిశారు. అంతకు ముం దు బిజెపి సీనియర్ నేత ఎల్‌కె అద్వానీని కూడా కలిశా రు. ఆలూ వేరు సమోసా వేరు అని అంటూ బిజెపిలో అంతా ఒకే రకం వారు లేరని, బిజెపిలో కూడా రాజ్‌నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్ వంటి వారు ఉన్నారని తెలిపారు. కోల్‌కతాలో జనవరి 19వ తేదీన ప్రతిపక్షాల ర్యాలీ జరుగుతుందని ఆమె చెప్పారు. ఇది ఫెడరల్ ఫ్రంట్ శంఖారావ సభగా ఉంటుందని చెప్పారు. దీనికి వివిధ ప్రతిపక్ష పార్టీల నేతలను ఆహ్వానించినట్లు వెల్లడించారు. ప్రతిపక్షం సంఘితం అయిందని, ఇక బిజెపి పని అయిపోయినట్లే అని ప్రకటించారు. ప్రతిపక్ష నేతలతో సమావేశాల నేపథ్యంలోనే ఆమె తమ టిఎంసి పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రతిపక్షాల ర్యాలీకి శివసేన అధినేత ఉద్దవ్ థాకరేను కూడా పిలిచినట్లు ఆమె తెలిపారు. కోల్‌కతా సభ కేవలం ప్రతిపక్షాల ఐక్యతకు వేదికగానే కాకుండా మమత ప్రతిపక్షాల కేంద్ర బిందువు అయ్యేందుకు ఒక కీలక మైలురాయి అని భావిస్తున్నారు. తాము అందరి కోసం అని, సమిష్టి నాయకత్వంపై కలిసికట్టుగా నిర్ణయం తీసుకుంటామని మమత వివరించారు. ప్రతిపక్షాలు అన్నీ కలిసి, పార్లమెంట్‌లో ఉమ్మడిగా వ్యవహరించడం జరుగుతోందని, ఇక బయట కూడా సమిష్టిగా పనిచేసేందుకు ఇబ్బంది ఏమీ ఉండదని తేల్చివేశారు. అంతకు ముందు సోనియా గాంధీతో టిఎంసి అధినేత్రి దాదాపు అరగంట సేపు సమావేశం అయ్యారు. 10 జన్‌పథ్ లోని సోనియా నివాసంలో వీరి భేటీ జరిగింది. ప్రతిపక్షాల ఉమ్మడి ప్రధాని అభ్యర్థి ఎవరు ఉంటారు? కాంగ్రెస్ ఇందుకు సముఖత ప్రదర్శిస్తోందా? అనే ప్రశ్నలకు మమత బదులిచ్చారు. తనకు పదవి అవసరం లేదని, బిజెపిని ఓడించడమే తమ లక్షమని ఆమె చెప్పా రు. బిజెపికి వ్యతిరేకంగా ఉమ్మడిగా వ్యవహరించేందుకు దాదాపు అన్ని ఇతర పార్టీలూ ప్రాధమిక చర్చలు జరుపుతున్నాయని వివరించారు. తాను సోనియా, రాహుల్‌లను కలిసినట్లు, ఎన్‌ఆర్‌సి అంశంపై మాట్లాడినట్లు ఆమె వివరించారు. దీనితోపాటు రాజకీయ పరిస్థితి గురించి కూడా మాట్లాడినట్లు తెలిపారు.తిరిగి అధికారంలోకి వస్తామనే నమ్మకం బిజెపికి లేదని, ఈ దశలో ప్రతిపక్షాలన్నీ కలిసి పోరాడటమే కీలకం అని తాము భావిస్తున్నట్లు మమత తెలిపారు. ప్రధాని అభ్యర్థి ఎవరవుతారు అనేది తరువాత ఖరారు అవుతుందని తెలిపారు. దీనిపై చర్చ జరుగుతుందని, తొలి ప్రాధాన్యత కేవలం బిజెపి ఓటమి అని, దీనిని మించిందేమీ లేదని తెలిపారు. ఎన్‌ఆర్‌సిపై బిజెపి అధ్యక్షులు అమిత్ షా వ్యాఖ్యలపై స్పందనకు నిరాకరించారు. తాను ఆయన బంటును కాదని, ఆయన చెప్పినదానికి తానేమి చెపుతానని ప్రశ్నించారు. ప్రతిపక్షాల ఐక్యతతో బిజెపికి భయం పట్టుకుందని మమత చెప్పారు.
మమత రెండో రోజు క్యాంప్
దేశ రాజధాని ఢిల్లీలో మమత రెండు రోజులుగా క్యాంప్ వేశారు. జనవరి 19వ తేదీన జరిగే ప్రతిపక్షాల ర్యాలీ విజయవంతానికి ఆమె ఇప్పటినుంచే జోరుగా ప్రయత్నాలకు దిగారు. దీనిని ఫెడరల్ ఫ్రంట్ ర్యాలీగా నిర్వహించాలని ఆమె తలపెట్టారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలోనే ఆమె వివిధ జాతీయ స్థాయి పార్టీల నేతలతో సమావేశం కావడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. బిజెపి వ్యతిరేక పార్టీల నేతలతోపాటు, ఎన్‌డిఎ భాగస్వామ్యపక్ష నేతలలో కొందరితో ఆమె భేటీ జరిపారు. అత్యంత విస్మయకరంగా ఆమె బుధవారం బిజెపి సీనియర్ నేత ఎల్‌కె అద్వానీని పార్లమెంట్‌లోని ఆయన ఛాంబర్‌లో కలిశారు. ఇందులో ప్రత్యేకత ఏదీ లేదని, కేవలం మర్యాదపూర్వకంగా సీనియర్ నేతను కలిశామని మమత విలేకరులకు తెలిపారు. ఇరువురు దాదాపు 20 నిమిషాల పాటు భేటీ అయ్యారు. తనకు చాలా కాలంగా అద్వానీజీతో పరిచయం ఉందని, ఆయన ఆరోగ్యం వాకబు చేశాను. అంతే ఇంతకు మించి ఏమీ లేదని మమత తెలిపారు. పార్లమెంట్ ఆవరణలోనే మమత సీనియర్ బిజెపి నేతతో భేటీ కావడంపై పలు రకాలుగా ఊహాగానాలు వెలువడ్డాయి. ఢిల్లీలో రాజకీయ సుడిగాలిని సృష్టించే రీతిలో ఆమె వెంటవెంటనే కాంగ్రెస్ , టిడిపి, వైఎస్‌ఆర్‌సిపి, డిఎంకె, ఆర్జేడీ, ఎస్‌పి, జెడిఎస్ నేతలను కలుసుకున్నారు. కొందరు నేతలతో సుదీర్ఘ చర్చలు జరిపారు. కోల్‌కతాలో జనవరి 19వ తేదీన జరిగే తమ ర్యాలీకి రావల్సిందని నేతలను ఆహ్వానించారు. ప్రధాని పదవిపై తనకు ఆశలేదని, ప్రతిపక్షాలను ఏకం చేయడమే తమ ముందున్న కర్తవ్యం అని మమత స్పష్టం చేశారు. ప్రధాని పదవికి ఎవరిని నిలపాలనేది ఇప్పటి అంశం కాదని, తరువాత అన్ని పార్టీల వారూ కూర్చుని ఒక నిర్ణయానికి వస్తారని మమత స్పష్టం చేశారు. పార్లమెంట్ ఆవరణలోని టిఎంసి కార్యాలయం మమత రాక, ప్రతిపక్ష నేతల రాకపోకలతో సందడిగా మారింది. సస్పెండ్ అయిన బిజెపి ఎంపి కీర్తి ఆజాద్ బుధవారమే పార్లమెంట్ ఆవరణలోని టిఎంసి ఆఫీసుకు వెళ్లి మమతా బెనర్జీతో సమావేశం అయ్యారు. ఎన్‌డిఎ భాగస్వామ్యపక్షంగానే ఉన్న శివసేన నేత సంజయ్‌రౌత్ తరువాత కాంగ్రెస్ నేతలు గులాం నబీ ఆజాద్, అహ్మద్ పటేల్, సమాజ్‌వాదీ పార్టీ నేత రామ్‌గోపాల్ యాదవ్ కూడా మమతను కలిశారు. కోల్‌కతా ర్యాలీకి శివసేన నేత ఉద్దవ్‌థాకరేను ఆహ్వా నిస్తునట్లు రౌత్‌కు మమత తెలిపారు. ప్రతిపక్ష నేత ల మధ్య ఐక్యతకు ఆమె చేస్తున్న యత్నాలు అభినందనీ యం అని ఆజాద్ తరువాత విలేకరుల వద్ద పేర్కొన్నారు.
ఇవిఎంలు వద్దు బ్యాలెట్ పత్రాలతో ఎన్నికలు
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలతో ఫలితాల తారుమారుకు దారితీస్తోందని,దీనిని నిరోధించాల్సి ఉందని మమత తెలి పారు. ప్రతిపక్ష పార్టీల నేతలంతా దీనిపై స్పందించాల్సి ఉందని, ఎన్నికల సంఘం అధికారుల వద్దకు సంయుక్త ప్రతినిధి బృందంగా వెళ్లాలని మమత సూచించారు. ఇవిఎంల ట్యాంపరింగ్ జరుగుతోందని, బ్యాలెట్ ద్వారానే పోలింగ్‌కు పట్టుపట్టాల్సి ఉందని ఆమె స్పష్టం చేశారు. ఇసికి తక్షణం దీనిపై తెలియచేయకపోతే ట్యాంపరింగ్‌లు తప్పుడు ఫలితాలు తప్పవని మమత హెచ్చరించారు.