Home జాతీయ వార్తలు వితంతువులు, డైవోర్సీలే ఆ మోసగాడి టార్గెట్ !

వితంతువులు, డైవోర్సీలే ఆ మోసగాడి టార్గెట్ !

maoist arrestedబెంగళూరు: పెళ్లి చేసుకుంటానని నమ్మించి దాదాపు 16 మంది వితంతువులను, విడాకులు తీసుకుని ఒంటరిగా జీవిస్తున్న మహిళలను శారీరకంగా లోబరుచుకోవడమేగాక వారి నుంచి డబ్బులు కూడా వసూలు చేసిన ఒక మోసగాడిని కర్నాటక పోలీసులు అరెస్టు చేశారు. డిఎం రామకృష్ణ అనే 46 ఏళ్ల ఈ మోసగాడు మైసూరు జిల్లాలోని టి నరసిపూర్ తాలూకా దొడ్డములగోడు గ్రామానికి చెందిన వాడు. ఎస్‌ఎస్‌ఎల్‌సి పాసైన ఇతగాడు కొంత కాలం వ్యవసాయం చేశాడు. ఆ తర్వాత శివమొగ్గలోని ఒక కాలేజీలో క్లర్కుగా పనిచేశాడు. ఆ తర్వాత భార్యాపిల్లలతో మైసూరుకు మకాం మార్చి మోసాలు చేయడం మొదలుపెట్టాడు. ఆ క్రమంలో జైలుకు వెళ్లాడు. విలాసవంత జీవితం గడపాలన్న కాంక్షతో అతను పెళ్లయి విడాకులు తీసుకున్న మహిళలను, వితంతువులను పావుగా వాడుకోవడం ప్రారంభించాడు.

తనకు పెళ్లి కాలేదని, వితంతువులు, విడాకులు తీసుకున్న మహిళలు ఎవరైనా తనను సంప్రదించవచ్చని పత్రికలలో ప్రకటనలు ఇచ్చేవాడు. బెంగళూరు, చిక్కమగళూరు, హుబ్బలి-ధార్వాడ్, మైసూరుకు చెందిన మహిళలు దాదాపు 16 మంది మహిళలు అతని చేతిలో మోసపోయినట్లు పోలీసులు గుర్తించారు. తాను ప్రభుత్వ ఆరోగ్య శాఖకు చెందిన ఉద్యోగ నియామకాల విభాగంలో సీనియర్ అధికారిగా పనిచేస్తున్నానని, తాను ఉద్యోగాలు ఇప్పించగలనంటూ కోరమంగళకు చెందిన ఒక మహిళను రామకృష్ణ ప్రలోభ పెట్టి ఆమె వద్ద నుంచి రూ. 3.9 లక్షలు వసూలు చేయడమే గాక ఆమెకు చెందిన వ్యక్తుల నుంచి రూ.22 లక్షలు వసూలు చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందడంతో అతని అసలు గుట్టు బయటపడింది. తన భార్య చనిపోయిందని చెప్పి ఒక మహిళకు పెళ్లి ఆశ చూపడమే గాక ఆమెను ఒక హోటల్ గదిలోకి రప్పించి ఆమెకు మత్తు మందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడినట్లు కూడా రామకృష్ణపైన మరో కేసు నమోదైంది. కర్నాటక వ్యాప్తంగా రామకృష్ణపైన ఏఏ పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయో పరిశీలిస్తున్నామని, అతని చేతిలో ఎంతమంది మోసపోయారో, ఎంత డబ్బు పోగొట్టుకున్నారో కచ్ఛితమైన వివరాలు ఇంకా రావలసి ఉందని పోలీసులు చెబుతున్నారు.

Man arrested for Cheating women, As many as 16 widows and divorcees were cheated by one Ramakrishna.