Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

విలేకరి ముసుగులో అక్రమ దందాలు…!

Police

* అమాయక జనానికి కుచ్చు టోపీ
* వ్యాపారులకు, అధికారులకూ తప్పని బ్లాక్ మెయిలింగ్
* కోరుట్లలో రద్దైన నోట్లతో పట్టుబడ్డ ఓ నకిలీ

జగిత్యాల: విలేకరి ముసుగులో అక్రమ దందాలు కొనసాగిస్తున్న సంఘటనలు జిల్లాలో రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. తాము ఓ ప్రముఖ న్యూస్ ఛానల్‌కు, దినపత్రికకు జిల్లా, డివిజన్ స్థాయి విలేకరులమని చెప్పుకుంటూ జనానికి కుచ్చు టోపి పెడుతున్నారు. ఏ పనైనా చిటికెలో చేయిస్తామంటూ అమాయక జనం వద్ద అందిన కాడికి దండుకోవడం రివాజుగా మారింది. కొందరు ఉదయం లేచింది మొదలు రాత్రి వరకు కార్యాలయాల వెంబడి తిరుగుతూ ఆ రోజు కోటా పూర్తి చేసుకోనిదే ఇళ్లు చేరరని తెలుస్తోంది. విలేకర్లమంటూ వ్యాపారులను, కార్యాలయాల్లో అధికారులను బ్లాక్ మెయి ల్ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారనే తీవ్ర ఆరో పణలున్నాయి. గతంలో ఒక సారి అక్రమ బాగోతాలు బయ టపడ్డాయి. పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బాధితులు సిద్దపడగా కాళ్లబేరానికి వచ్చి తప్పయింది అని ఒప్పు కోవడంతో వదిలిపెట్టారు.

తాజాగా కోరుట్లకు చెందిన ఓ వ్యక్తి తాను విలేకరినని చెప్పుకుంటూ అక్రమ బాగోతాలు నడిపించడంతో పాటు రద్దైన పాత నోట్లు మార్పిడి చేస్తూ పోలీసులకు చిక్కాడు. వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న పత్రికలు, న్యూస్ ఛానళ్లతో విలేకర్ల సంఖ్య పెరుగుతుండగా అదే స్థాయిలో నకిలీ విలేకర్లు పుట్టుకొస్తున్నారు. అక్రమ దందాలు కొన సాగించే వ్యాపారుల అడ్డాలు తెలుసుకుని ఫోటోలు, వీడి యోలు తీసినట్లు నటించి భారీగా డబ్బులు గుంజుతున్న వారు కొందరైతే, కలప, బొగ్గు, ఇసుక, రద్దైన నోట్ల మార్పిడి మాఫియాలో అందెవేసిన చేయి మరి కొందరిది. ద్విచక్ర వాహనాలకు ,కార్లకు ‘ప్రెస్’ స్టిక్కర్లు అంటించుకుని, నకిలీ ఐడి కార్డులు తయారు చేసుకుని అక్రమ దందాలు కొనసాగిస్తున్నారు. ప్రముఖ దినపత్రికల్లో, న్యూస్ ఛానళ ్లలో పనిచేసే పాత్రికేయులతో సన్నిహితంగా మెలుగుతూ వారి పేరు వాడుకుంటూ వసూ ళ్ల బాగోతానికి పాల్పడు తున్నట్లు తెలుస్తోంది.

గతంలో జగిత్యాలకు చెందిన ఓ వ్యక్తి ధర్మపురి మండలానికి పంచాయతీ పెద్దగా వెళ్లి తాను ఓ ప్రముఖ న్యూస్ ఛానల్‌కు జిల్లా రిపోర్టర్‌నని అక్కడి వారికి పరిచయం చేసుకున్నాడు. దాంతో అతడి మాటలు నమ్మిన కొందరు రైతులు తమ భూములకు సంబంధించిన వివరాలు రెవెన్యూ రికార్డుల్లో లేవని, వాటిని సరిచేయాలని సదరు వ్యక్తిని కోరగా రెండు మూడు రోజుల్లో చేయిస్తానని నమ్మబలికి ఖర్చుల కింద ముందుగా రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దాంతో రైతులు అప్పటికప్పుడు రూ.10 వేలు జమ చేసి ఇచ్చారు. ఆ తర్వాత ఎప్పుడు అడిగినా రేపు మాపు అంటూ కాలం వెల్లదీస్తూ తప్పించుకోవడంతో అనుమానం వచ్చిన రైతులు సదరు వ్యక్తిని నిలదీసి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తామనడంతో కాళ్లబేరానికి వచ్చి తాను తీసుకున్న రూ.10 వేలు అప్పటికప్పుడు తిరిగి ఇచ్చేశాడు.

ఇద్దరు ఇసుక దందా చేస్తున్న వారి వద్ద డబ్బులు డిమాండ్ చేయగా సదరు వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వారిని స్టేషన్‌కు పిలిపించి మందలించి వదిలేశారు. తాజాగా కోరుట్లకు చెందిన అజీజ్ అనే వ్యక్తి తాను ఓ దినపత్రికకు క్రైమ్ రిపోర్టర్‌గా పనిచేస్తున్నానంటూ ఐడి కార్డు చూపిస్తూ అక్రమ బాగోతాలు సాగిస్తున్నాడు. రద్దైన పాత రూ.500,1000 నోట్లను మార్పిడి చేయడం పనిగా పెట్టుకోగా పోలీసులు సోమవారం రాత్రి అతడిని వలపన్ని పట్టకున్నారు. అతడి కారును సోదా చేయగా రూ.73.20 లక్షల పాత కరెన్సీ నోట్లు, తల్వార్, గొడ్డలి, నిఖేల్ పంచ్, ఓ ప్రధాన పత్రికకు చెందిన ఐడికార్డు, బాండ్ పేపర్లు లభించాయి.

అజీజ్‌పై గతంలో కోరుట్ల పోలీస్ స్టేషన్‌లో మూడు భూ ఆక్రమణ కేసులతో పాటు చీటింగ్ కేసులు, మేడిపెల్లి ఠాణాలో భార్యను వేధించిన ఒక కేసు ఉందని పోలీసులు తెలిపారు. నిందితుడు భూ దందాలు, సెటిల్‌మెంట్లు చేయడంలో సిద్దహస్తుడని, అతడి వద్ద లభిం చిన డాక్యుమెంట్లు తేటతెల్లం చేస్తున్నాయన్నారు. అజీజ్‌పై మారణాయుధాల చట్టం, చీటింగ్ కేసుతో పాటు స్పెసిఫైడ్ బ్యాంక్ నోట్స్ సెన్సేషన్ ఆఫ్ లయాబిలిటి యాక్ట్ 2017 కింద కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఎస్‌పి అనంతశర్మ వివరించారు. విలేకర్లుగా చెప్పుకుంటున్న కొందరు స.హ. కార్యకర్తలమంటూ పలు చోట్ల బెదిరింపులకు కూడా పాల్పడినట్లు తమకు సమాచారం ఉందని, పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నామని ఎస్‌పి తెలిపారు.

Comments

comments