Home తాజా వార్తలు పెండ్లింట విషాదం..

పెండ్లింట విషాదం..

Husband Got Suicide Due to Wife in Hyderabad

తిమ్మాజిపేట: నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం కోడుపర్తి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన డీలర్ కౌకుంట్ల శ్రీనివాస్‌రెడ్డి (50), రాత్రి  గ్రామ సమీపంలోని ఒక రైతు పొలంలోని చింత చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్దకొడుకు రాందేవ్‌రెడ్డి వివాహం రాధికతో నిర్వహించిన అనంతరం అదే రాత్రి కోడుపర్తిలో కొత్త జంటతో ఊరేగింపు నిర్వహించారు. ఉదయం బంధువులకు చెందిన సుమారు 23.5 గ్రాముల బంగారు నగలు కనిపించకుండా పోవడంతో అందరిలో ఆందోళన నెలకొన్నది. సంబరంగా జరగాల్సిన వివాహ వేడుకల్లో పోలీసులు, ఎంక్వైరీలు జరగడంతో మనస్తాపానికి గురైన శ్రీనివాస్‌రెడ్డి రాత్రి భోజనాలు అయిన తర్వాత 11.30కు ఇంట్లోంచి వెళ్లినట్లు పెళ్లికొడుకు రాందేవ్‌రెడ్డి తెలిపారు. అనంతరం 10 నిమిషాల తర్వాత తనకు ఫోన్ చేశాడని, పెండ్లింట ఇలా జరగడంతో తన పరువు పోయిందని, తాను ఇక బతకనని చనిపోతున్నట్లు చెప్పి ఫోన్ కట్ చేశాడని రాందేవ్‌రెడ్డి తెలిపాడు.

వెంటనే కుటుంబ సభ్యులతో కలిసి వెతకడంతో తెల్లవారుజామున గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలం దగ్గర ఉన్న చెట్టుకు ఉరి వేసుకుని కనిపించాడు. ఇదిలా ఉండగా ఉదయం గ్రామ సమీపంలోని ఒక ఇంటి వద్ద మూట గమనించిన కలమ్మ అనే మహిళ మూటలో బంగారు నగలు ఉండటంతో పెండ్లింట్లో అందించగా, అవి చోరీకి గురైనవేనని నిర్దారించారు. సమాచారం తెలసుకున్న నాగర్‌కర్నూల్ సీఐ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌ఐ శ్రీనివాసులు గ్రామానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జడ్చర్ల దవాఖానకు తరలించారు.