Home తాజా వార్తలు ప్రేమ బ్లాక్ మెయిల్

ప్రేమ బ్లాక్ మెయిల్

Man held for blackmailing woman into relationship

సంపన్న కుటుంబ యువతితో మూడేళ్లుగా ప్రేమ నటన
ఆమె తండ్రిని బెదిరించి రూ.5 కోట్లు డిమాండ్ చేసిన మోసగాడు
పాతిక లక్షలు తీసుకుంటుండగా పట్టివేత 

మన తెలంగాణ/ హైదరాబాద్ : ప్రేమ పేరుతో నమ్మించి, ఆపై నటించిన నయవంచకుడిని పోలీసులు శనివారం నాడు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్‌కు చెందిన వినీత్ అనే యువకుడు నగరంలో ఈవెంట్ మేనేజ్ మెంట్ కోర్సు చేస్తున్నాడు. అదే ఇనిస్టిట్యూట్‌లో విద్యనభ్యసిస్తున్న ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ఆ యువతి నగరంలో బడా వ్యాపారవేత్త కుమార్తె కావడంతో ఎలాగైనా వారి నుంచి డబ్బు గుంజాలని కుట్రలు పన్నుతూ వచ్చాడు. ఇందు కోసం మూడేళ్లపాటు ఎదురు చూశాడు. మూడేళ్ల పాటు ఉన్న సాన్నిహిత్యం వల్ల తన వద్ద ఉన్న ఫొటోలను అశ్లీల వెబ్‌సైట్‌లో పెడతానని సదరు యువతి తండ్రిని బెదిరించి రూ.5 కోట్లు డిమాండ్ చేశాడు. యువతి పోటోలను మార్ఫిం గ్ చేసి నెట్‌లో ఫోటోలు పెడతానని బెదిరించాడు.

అంతటితో ఆగకుండా తన స్నేహితులైన మంచిర్యాల జిల్లాకు చెం దిన గణేష్, కరీంనగర్‌కు చెందిన మహేశ్ లను రంగంలోకి దించి ప్రియురాలి తండ్రికి ఫోన్ చేయించాడు. వినీత్ స్నేహితులు సైతం తమకు ఫొటో, వీడియో గ్రఫీలో మీ కూతురి ఫోటోలను మార్ఫింగ్ చేసి పోర్న్‌సైట్లలో అప్‌లోడ్ చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డారు.తన కుటుంబం పరువు బజారున పడుతున్న భయంతో వినీత్‌తో సదరు యువతి తండ్రి కోటి రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. తొలుత కోటి రూపాయలను ఆ యువతి తండ్రి నుంచి వసూలు చేసుకోవాలని వినీత్ పథకం రచించాడు. వినీత్ వ్యవహారం గమనించిన యువతి తండ్రి రూ. కోటి తీసుకున్నాక కూడ మళ్లీ బెదిరింపులకు పాల్పడే అవకాశం ఉందని భావించాడు. ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశాడు. తనకు వస్తున్న బెదిరింపు కాల్స్‌కు సంబంధించిన డేటాను పోలీసులకు అందజేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను టవర్ లొకేషన్ ఆధారంగా గాలింపు చేపట్టారు. అయితే ముగ్గురు నిందితులు ఒక్కొక్కరూ ఒక్కో ప్రాంతంలో ఉన్నట్లు తెలియడంతో కొంత నిరుత్సాహానికి గురయ్యారు.

ఈ కేసులో నిందితులందరినీ ఏకకాలంలోనే పట్టుకోవాలని నిర్ణయించుకున్నారు.దీంతో ప్రధాన నిందితుడు వినీత్ డిమాండ్ మేరకు కోటి రూపాయలకు గాను తొలి విడతగా రూ.25లక్షలు చెల్లిస్తానని యువతి తండ్రితో చెప్పించారు. వినీత్‌కు నమ్మకం కుదరడంతో అతనితో పాటు స్నేహితులు ఇద్దరు వచ్చారు. ఈ నేపథ్యంలో వినీత్ సదరు వ్యాపార వేత్త నుంచి రూ.25లక్షలు తీసుకున్న వెంటనే సిసిఎస్ పోలీసులు వారిని పట్టుకునే యత్నం చేశారు. విషయం గ్రహించిన వినీత్ అతని స్నేహితులు అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నించారు. ఈక్రమంలో పోలీసులు హైదరాబాద్ నుంచి నిజామాబాద్ హైవే వరకు వెంటాడి వారిని పట్టుకుని రూ.25లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈక్రమంలో నిందితులను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు సినీ ఫక్కీలో 8 గంటల పాటు ఛేజింగ్ చేయాల్సి వచ్చింది.

ఇదిలావుండగా తన కూతురు ఫోటోలను మార్ఫింగ్ చేసి నెట్‌లో పెడతానని బెదిరింపులు వస్తున్నాయని తమకు ఆత్మహత్యే శరణ్యమని యువతి తండ్రి ఆగస్టు 9న తమకు ఫిర్యాదు చేశాడని సిసిఎస్ డిసిపి అవినీష్ మహంతి మీడియాకు తెలిపారు. దీంతో ఓ పథకం ప్రకారం యువతి తండ్రి సహకారంతో నిందితులను పట్టుకోగలిగామని తెలిపారు. 3సెల్ ఫోన్లు, 2 బైక్‌లు స్వాధీనం చేసుకున్నామన్నారు. పర్సనల్ ఫోటోలు, డేటాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని , ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే వెంటనే పోలీసులను ఆశ్రయించాలని డిసిపి విలేకరుల సమావేశంలో సూచించారు. నిందితుల వేటలో మారువేషాలేసి కేసును ఛేదించిన సిఐ చాంద్‌బాషా, ఎస్‌ఐలు మదన్,మహిపాల్ తోపాటు పోలీసు అధికారులు మహేశ్వర్‌రెడ్డి, శ్రీధరాచారీలకు డిసిపి అభినందించారు.