Home కలం సహస్రాబ్దుల సాహితీ సుగంధాల కొండ

సహస్రాబ్దుల సాహితీ సుగంధాల కొండ

Mana-Nalgonda

“గుండె గుండెల్లో రగిలిన కసి ఎగిసిన జ్వాలలై క్రూర నిజాము రక్కసి మూకల భూస్వామ్య వ్యవస్థను భూస్థాపితం చేసి ప్రపంచ పతాక శీర్షికై నిలిచినట్టి ఎర్రగొండ… మన నల్లగొండ. మనిషి మూలాలు మూట గట్టుకొని నదీ జలాలు నెత్తి నెత్తుకొని గర్భాన సిరులెన్నో దాచుకున్న నిండుకుండ నా తల్లి నల్లగొండ” అంటూ నల్లగొండ జిల్లా చరిత్ర, సంస్కృతి, చారిత్రక వైభవాన్ని తెలిపే సంఘటనలు కోకొల్లలు. చరిత్ర పుటల్లో చెరగని స్థానం నల్లగొండ కుంది. ఇక్కడి సాహితీ వారసత్వం అమోఘం. కళ్యాణి చాళుక్య, కందూరి చీడ, పద్మనాయక, శాతవాహన, కాకతీయ, అసఫ్‌జాహిలు, నిజాం రాజులు ఇలా ఎన్నో రాజ వంశాలకు ఈ ప్రాంతం ప్రసిద్ధి. రెండు కొండల నడుమనున్న పట్టణం నల్లగొండ. ఒక కొండపై మహమ్మదీయుల దర్గా రెండవ కొండపై (కాపురాల గుట్ట) శత్రు దుర్భేద్యమైన కోట నిర్మించబడింది. ఇది ‘నీలగిరి’ కోటగా నిలిచింది. ఆది మానవుడి కాలపు ఆనవాళ్లు సైతం ఇక్కడ బయల్పడ్డాయి. జైన, బౌద్ధ మతాలకు చెందిన అవశేషాలు నేటికి సజీవంగా ఉన్నాయి. జిల్లాలో లభించిన తొలి శాసనం ఏలేశ్వరం నందు 3, 4 శతాబ్దాల నాటి బ్రాహ్మీ శాసనం ఉంది.

సహస్రాబ్దుల సాహితీ సుగంధాలు పరిమళించిన నేల ఇది. రాచకొండ రాజధానిగా రాజ్యమేలిన పద్మనాయక ప్రభువు సర్వజ్ఞ సింగ భూపాలుడు గొప్ప రాజ కవి. వీరి ఆస్థానం కవులకు నిలయమై అలరారింది. కవి సార్వభౌమ శ్రీనాథుడు కనకాభిషేకం పొందింది ఇక్కడే. ఆంధ్ర భాగవతాన్ని అందించిన పోతనా మాత్యుడు పుట్టిన బమ్మెర గ్రామం పూర్వం నల్లగొండ జిల్లాలోనిదే కావడం విశేషం. ‘వాణి – నా రాణి’ అన్న పిల్లల మర్రి పినవీరభద్రుడు ఈ జిల్లా వాసే. నేడు తన రచనలతో రాష్ట్ర, జాతీయ స్థాయి కెదిగిన ఆచార్య ఎన్.గోపి, నిఖిలేశ్వర్, పెన్నా శివరామ కృష్ణ, ముదిగంటి సుజాతరెడ్డి, జూలూరు గౌరీశంకర్, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, డా॥ తిరునగరి, బోయ జంగయ్య మొదలైన ఎందరో కవి పండితులు తెలుగు భాషను సుసంపన్నం చేయడం, వారందరూ ఈ గడ్డ వాసులు కావడం మనందరికీ గర్వకారణం. సాహిత్యపు పంట పండించడంలో నల్లగొండ కవులు, రచయితలు ముందున్నారనడంలో అతిశయోక్తి కాదు.

ఈ గడ్డలో అనేక మంది కవులు, రచయితలు చెలిమెలా ఊరుతునే ఉన్నరు. మరీ ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ సందర్భముగా ఈ జిల్లాలో అనేక మంది వర్ధమాన కవులుద్భవించినారు. ఉద్యమ సమయంలో అనేక మంది తమ భావాలను కవితల రూపంలో తెలియజేయగా వాటన్నింటిని ‘ఢమరుకం’ పుస్తక రూపంలో నల్లగొండలో రావడం విశేషం. ఇదే విధంగా నల్లగొండ యొక్క ప్రశస్తి తెలియజేసే ‘మన నల్లగొండ’ కవితా సంకలనం పున్నమి అంజయ్య సంపాదకత్వంలో దుర్ముఖి ఉగాది సందర్భంగా వెలువడింది. గత రెండు సంవత్సరాల క్రితం జయ నామ ఉగాది సందర్భముగా జిల్లాకి చెందిన అనేక మంది రాసిన కవితలను పున్నమి పుస్తక రూపంలో తీసుకొచ్చిండు. దీనిలో 50 కిపైగా కవితలు, ఓ నాలుగు పాటలు, మరో నాలుగు నానీల రూపంలో ఉన్నాయి. ఇవన్నీ నల్లగొండ జిల్లా గొప్పతనం గురించి తెలుపుతున్నయ్.

“గత కాలపు ఘనకీర్తి నేడు సకల కళలకు దీప్తి భిన్న సంస్కృతుల విరిదండ నవ్య చరితుల నల్లగొండ” అంటూ పున్నమి ముందు మాటలో తెలిపిండు. అదే విధంగా “నల్లగొండ అనగానే ఉల్లం ఉప్పొంగి పోవు జన్మభూమి అంటే ఏ జనుడు పరవశించిపోడు? ఎందరెందరో ప్రభువులు ఏలిన పురి నల్లగొండ ‘నీలగిరి’గా చరిత్రలో నిలిచింది” అంటూ ‘ఇదిరా మన పానగల్లు’ అనే కవితలో డాక్టరు తిరునగరి పానగల్లు – నల్లగొండ యొక్క చారిత్రక ప్రాధాన్యత తెలియజేసిండు. నా నల్లగొండ సుద్దాల గొంతు, యాదగిరిపాట నిశీధ రాత్రుల దాటి సుప్రభాత వేళ మేల్కొలుపు గీతం నా నల్లగొండ అని పలస అనంత్ తెలుపుతూ బందగీ, ఐలమ్మ, దొడ్డి కొమురయ్య బి.యన్.ల శౌర్యం యీ నేలకే సొంతం అని నొక్కి చెప్పిండు. జిల్లాకు చెందిన గింజల నర్సింహ్మారెడ్డి అనే మరో కవి జిల్లా గురించి తెలుగు నాట సౌరభాలు విరజిమ్మి దుండగలను చీల్చిన యుద్ధభూమి నల్లగొండ అంటూ ‘నీలగిరి’ అనే కవితలో తన అక్షరాలు ఎక్కుపెట్టిండు. ‘సాహితీ కేదారం నల్లగొండ సాహిత్య భాండారం నల్లగొండ’ ‘ఇదిగో నల్లగొండ’అనే కవితలో తిరునగరి మరోసారి ఉగ్ర రూపమై తెలిపిండు.

“నన్నుగన్న పల్లెతల్లి నా జిల్లా నల్లగొండ… యాదగిరి లక్ష్మీనరసింహ్మా నీ గర్భాన వెలసినాడమ్మ…’ అంటూ జిల్లా వైభవాన్ని ‘నా నల్లగొండ’ అనే పాటలో అంబటి వెంకన్న తన గొంతుక వినిపించిండు. అదే విధంగా “రాజకీయ నాయకులకు, విద్యావేత్తలకు, విప్లవ యోధులకు పురిటి గడ్డ మానవతకు, మమతకు, మాపాటి వారు లేరనచు నలు దిశలకు చాటుతున్న నల్లని కొండలు ఇవిగో “అంటూ’ ఇదే ఇదే నల్లగొండ’ కవితలో కృష్ణ కౌండిన్య తన భావాలను కురిపించాడు.

‘ధీరుల మొగసాల’ అనే కవితలో వీరులకు నిలయమ్ము రా.. నా నల్లగొండ ధీరులకు మొగసాల రా .. నా నల్లగొండ కవులకు, రచయితలకు గాయకులకు కాణాచిరా … నా నల్లగొండ”.‘ధీరులకు మొగసాల’ కవితలో వర్ధమాన కవి. రచయిత బుచ్చిరెడ్డి జిల్లా గొప్పతనం గురించి ఎరుక జేసిండు. సైసై నల్లగొండ ధీరుడా నల్లగొండ పేరు చెబితే గుండె గుభిల్లుమనాలె’ అని రామాంజనేయులు అనే కవి తెలిపిండు. అదే విధంగా డాక్టర్ దాచేపల్లి దుర్గయ్య ‘నీలగిరి’ అనే కవితలో కమ్యూనిస్టుల కంచుకోట ఇది నిజాంను ఎదిరించిన విప్లవాల గడ్డ యని విశదీకరించిండు. ఇంకా ‘రాజ శౌర్యపు దీప్తి మీ రాచకొండ అనే కవితలో “పద్మ నాయక వంశ పద్మమై వెల్గిన రాజ్యవరేణ్యమా రాచకొండ” అని కావ్యశ్రీ రాచకొండ యొక్క చారిత్రక శోభను కళ్లకు కట్టించింది. “నల్లని కొండలున్ గల్గి నాణ్య గుణంబున వంకలేనిది” అంటూ శ్రీమన్నారాయణ శర్మ ‘మన నల్లగొండ’ అనే పద్యంలో నల్లగొండకు అర్థం చెప్పిండు.

ఆచార్య ఎన్.గోపి ‘చరిత్ర గీతం’ కవితలో నల్లగొండ జిల్లా అంతటా రాళ్లే అంటే ఎలా? రాళ్లకు ఉన్నవి చూడు నోళ్లు ఆ నోళ్లతో పాడుతాను ..చరిత్ర గీతం ఈ తరానికి తెరుస్తా కొత్త కవాటం… అంటూ జిల్లా గురించి తెలియజేసిండు. ఇలాగే బోయ జంగయ్య, భూతం ముత్యాలు, వనం సావిత్రీ నాథ్, బండారు సుజాత శేఖర్, ముకురాల రామిరెడ్డి, డా. కూరెళ్ల విఠలాచార్య, చెరుకు ఉషాగౌడ్, యెన్నం ఉపేందర్, సాగర్ల సత్తయ్య, గజవెల్లి సత్యం, సుంకర రమేష్, కట్టా భగవంతరెడ్డి, వనం వెంకటేశ్వరుల వంటి అనేక మంది కవుల కవితల్లో నల్లగొండ జిల్లా ప్రశస్తి గురించి ‘మన నల్లగొండ’ కవితా సంకలనం పుస్తకంలో వెలువరించనరు. అన్నింటిని పుస్తక రూపేణా తీసుకొచ్చిన పున్న అంజయ్య అభినందనీయుడు.

-కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, 9441561655