Home లైఫ్ స్టైల్ గజల్స్‌తో వర్ణమాల…

గజల్స్‌తో వర్ణమాల…

Jyothirmayi Malla

 

ఆమె రచయిత్రి..చిత్రకారిణి.. తెలుగులో తొలి గజల్ గాయకురాలు..ఇష్టంతో సాధన చేస్తే అభిరుచే నైపుణ్యం అవుతుందని నిరూపించిన మహిళ. ఆమె శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందిన గాయని. అంతటితో ఆగక, తెలుగు గజల్స్ పాడటంలో తనదైన ప్రత్యేక శైలితో అందరినీ ఆకట్టుకుంటోంది ఆమే జ్యోతిర్మయి మళ్ల. అంతర్జాతీయ స్థాయిలో గజల్స్ పాడుతూ తెలుగునాట వాటికి ప్రాచుర్యం కల్పిస్తోంది. తెలుగులో గజల్స్ ప్రాచుర్యం కోసం దశాబ్దాలుగా కృషిచేస్తూ తెలుగు గజల్ అకాడమీ ద్వారా అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ఉత్సాహవంతులైన గజల్స్ పాడే కళాకారులను కూడా ప్రోత్సహిస్తోంది.

తండ్రి స్ఫూర్తితో కవిత్వం, గజల్స్ చేస్తోంది. సంగీతం నేర్చుకుని, ఆరేళ్ల వయసు నుంచే సంగీత కార్యక్రమాల్లో పాడటం మొదలు పెట్టింది. దీంతో ఆరో తరగతిలో ఉన్నప్పుడే చదువు ఆపేసి, విజయనగరం మహారాజా సంగీత కళాశాలలో చేరింది. అక్కడే నాలుగేళ్లు శిక్షణ తీసుకుని, ఆ తరువాతే బీఎస్సీ, ఎంఏ (హిందీ సాహిత్యరత్న) పూర్తి చేసింది. ఆ తర్వాత ప్రభాకరరావుతో పెళ్లి జరిగింది. అటామిక్ పవర్ రిసెర్చ్ సెంటరులో సైంటిఫ్‌క్ ఆఫీసర్‌గా పనిచేసే ఆయన ఉద్యోగరీత్యా ఇరవై ఏళ్లు చైన్నెలో ఉండగా చెన్నై ఆకాశవాణి కేంద్రంలో లలిత సంగీత విభాగంలో గాయనిగా చేరింది. ఆమె ఒకసారి ముంబయి పినాజ్ మసానీ సంగీత కచేరీకి హాజరయినప్పుడు, ఆ గజల్స్ తనని ఎంతగానో ఆకట్టుకున్నాయంటోంది. దాంతో అప్పటి నుంచి తెలుగులో గజల్స్ పాడాలని నిర్ణయించుకుందట. ఇక వాటిని సేకరించి సాధన చేయడం మొదలుపెట్టింది.

జ్యోతిర్మయి భర్త ఉద్యోగరీత్యా కొన్నాళ్లు సౌదీ అరేబియాలోనూ ఉంది. అక్కడ కొన్ని పండగల సందర్భంగా జెద్దాలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో లలిత గీతాలు పాడింది. మొదటిసారిగా ఆమెకు గజల్ కచేరి చేసే అవకాశం 2012లో విశాఖపట్నంలో లభించింది. అప్పుడు ఆమె చేసిన కచేరిలో నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు తన పాటలని మెచ్చుకున్నారు. అలా తన గజల్స్‌కి మంచి ఆదరణ వచ్చింది. ఆమే సొంతంగానే బాణీలు సమకూర్చుకునేవారట.. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ముఖ్య కళావేదికలపైనా, ఇతర రాష్ట్రాల్లోనూ గజల్ కచేరీలు నిర్వహిస్తూ.. అలాగే దక్షిణాఫ్రికా జోహనెస్‌బర్గ్‌లో ఓ సంస్థ ఆధ్వర్యంలో తెలుగులో గజల్స్ పాడింది. 2014లో హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ‘జ్యోతిర్మయి గజల్స్’ పేరుతో పూర్తిస్థాయి కచేరీ నిర్వహించారు. ఆ కచేరీకి హాజరైన ఎంతోమంది రచయితలు, గాయకులు ఆమెను ప్రశంసించారు. హైదరాబాద్‌లో సినారే సమక్షంలో ‘సినారే గజల్ లహరి’ పేరుతో కచేరీ కూడా నిర్వహించారు. ఆ సమయంలో సినారె ఆమెతో ‘నా గజల్స్‌ను నువ్వు పునరుజ్జీవింపజేశావ్’ అంటూ ఆయన మెచ్చుకోవడం ఎప్పటికీ మరిచిపోలేనంటోంది. ఆమె రాసిన ‘ఆడది’, ‘నీతోటి ముడి వేసి’ అనే గజల్స్ బాగా ఆదరణ పొందాయి.

మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ నిర్వహించిన ప్రత్యేక గజల్ కచేరీలో మహాత్ముడిపై ఎన్నో గజల్స్‌ను రాసి పాడారు. ప్రముఖ గుజరాతీ భజన్ ‘వైష్ణవ జనతో’ను తెలుగు గజల్‌గా మార్చానంటోంది. గజల్స్‌తోపాటు తెలుగులో కథలు, కవితలు రాసింది. పిల్లలకు తెలుగు వర్ణమాల నేర్పడానికి బొమ్మలతో అక్షరాలను వేసి ఒక వర్ణమాల పుస్తకం సరికొత్త తరహాలో రూపొందించారు. ఆమె నిర్వహించిన గజల్ కచేరీల్లో గజల్ ఫ్యూజన్ ఒక ప్రయోగం. ప్రఖ్యాత ఉర్దూ గజళ్లను అదే బాణీలో అనువదించి ఒక్కో చరణం రెండు భాషల్లోనూ పాడింది.

గజల్‌ను ప్రోత్సహించడానికి 2014లో ఫేస్‌బుక్‌లో ‘తెలుగు గజల్ గ్రూప్‌ను ఏర్పాటు చేసి, ఇందులోని 25 మంది తెలుగు కవుల గజల్ సంకలనాన్ని పుస్తకంగా ప్రచురించారు. అలాగే తెలుగు గజల్ సాహిత్యాన్ని ప్రోత్సహించడానికి, భావి తరాలకు తెలుగు గజల్ సౌరభాలు అందించాలని కళాభారతి ఆడిటోరియం వేదికగా మూడేళ్లక్రితం ‘జ్యోతిర్మయి తెలుగు గజల్ అకాడమీ’ ఏర్పాటు చేశారు. దీని ద్వారా గజళ్లపై అవగాహన పెంచడం, గజల్ సంపుటాలు ప్రచురించడం, కొత్తవారిని ప్రోత్సహించడం, గజల్ ముషాయిరాలను ఏర్పాటు చేయడం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ అకాడమీ తరపున 50 మంది కవులు రాసిన గజల్స్ సంపుటిని ఇటీవలే ఆంధ్రప్రదేశ్ భాషా సంస్కృతిక శాఖ ప్రచురించింది.

Mana Telangana Special Interview With Jyothirmayi Malla

Telangana Latest News