Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

గోదావరి చెంత…తీరని తాగునీటి చింత

Mancherial town reels under water crisis

మున్సిపాలిటీలో తప్పని పానీ పోరు
నత్తనడకన మిషన్ భగీరథ పనులు
తాగునీరు అందక గొంతెండుతున్న జనం
దినదినానికి పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
మండుటెండలతో అడుగంటుతున్న భూగర్భ జలాలు
 రైల్వే స్టేషన్ సమీపంలో మున్సిపాలిటీ పైపులైన్ వద్ద బారులు తీరిన జనాలు

మంచిర్యాల ప్రతినిధిః కూతవేటు దూరంలో గోదావరి నది ప్రవహిస్తున్నప్పటికీ మున్సిపాలిటీలో తాగునీటి కోసం ఇబ్బందులు తప్పడం లేదు. తాగునీరు అందక గొంతులు ఎండిపోతుండగా గోదావరి నది గుక్కెడు నీరు అందించని పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు ఇంటింటికి నల్లా కనెక్షన్ అందించేందుకు గాను ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ పనులు నత్తనడకన సాగుతుండం వలన మున్సిపాలిటీలో తీవ్ర తాగునీటి ఎద్దడి పరిస్థితులు కనిపిస్తున్నాయి. వివిధ పార్టీల నాయకులు పోటాపోటీగా ట్యాంకర్ల ద్వారా మున్సిపాలిటీల్లోని వార్డుల్లో తాగునీటిని సరఫరా చేస్తున్నప్పటికీ గంటల తరబడి ట్యాంకర్ల వద్ద వేచి చూడాల్సి వస్తుంది. కోట్లాది రూపాయలు వెచ్చించి ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద మంచినీటి పథకాలను చేపట్టినప్పటికీ ప్రయోజనం చేకూరడం లేదు. దీంతో తాగునీటి కోసం ప్రజలు అల్లాడుతున్నారు. మంచిర్యాల జిల్లాలోని ముల్కల్ల వద్ద నీటి శుద్ది కేంద్రాన్ని నిర్మించారు. అదే విధంగా ఎల్లంపల్లి పథకానికి సంబంధించి బెల్లంపల్లి రైల్వేస్టేషన్‌లో కూడా వాటర్ ట్యాంక్‌తో పాటు నీటి శుద్ది కేంద్రాన్ని నిర్మించారు. అయితే ఎల్లంపల్లి ప్రాజెక్టుల నుంచి పైపులైన్ లీకేజీల వలన సరిపడ నీరు అందకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పాత పైపులైన్‌లకే మిషన్ భగీరథ నీటి పంపిణీ అనుసందానం చేయడంతో జాప్యం జరుగుతుంది.

బెల్లంపల్లి, మందమర్రి మున్సిపాలిటీలకు గోదావరి నీరు కూడా సక్రమంగా సరఫరా కావడం లేదు. మంచిర్యాల జిల్లాలోని 18 మండలాల్లో 6863 బోర్‌వెల్స్ ఉండగా ఇందులో 6711 మాత్రమే పని చేస్తున్నాయి. ఇందులో 207బోర్‌వెల్‌లను మరమ్మతులు చేయాలని కోరుతున్నప్పటికీ ఇప్పటి వరకు అధికారులు స్పందించడం లేదు. జిల్లాలో ఎనిమిది సమగ్ర మంచినీటి పథకాలు ఉండగా 359 రక్షిత మంచినీటి పథకాలు ఉన్నాయి. ఇటీవలి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు తోడు భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో బోర్‌వెల్‌లు పని చేయడం లేదు. దీంతో ప్రజలు కలుషిత నీటిని తాగి అస్వస్తతకు గురవుతున్నారు. ఇటీవల కన్నెపల్లి మండలంలో కలుషిత నీరు తాగి నలుగురు మృతి చెందగా ఎంతో మంది అస్వస్తతకు గురయ్యారు. కన్నెపల్లిలో బోర్‌వెల్‌లు పని చేయకపోవడం వలన వాగులో చెలిమెలు తవ్వుకొని తాగునీటిని తెచ్చుకుంటున్నారు. భీమిని, హాజీపూర్, నస్పూర్, దండేపల్లి మండలాల్లో కూడా తీవ్ర నీటి ఎద్దడి పరిస్థితులు నెలకొన్నాయి.

అదే విధంగా చెన్నూర్, కోటపల్లి, భీమారం, జైపూర్ మండలాల్లో కూడా రక్షిత మంచినీటి పథకాలు బోర్‌వెల్‌లు పని చేయకపోవడం వలన తాగునీటి కోసం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇదిలా ఉండగా గోదావరి తీరంతో ఉన్న లక్షెట్టిపేట మండల కేంద్రంలో కూడా తాగునీటికి కష్టాలు తప్పడం లేదు. పురాతన పైపులైన్‌లు లీకేజీలతో తరచుగా నీటి సరఫరాకు అంతరాయం కలుగుతోంది. 15 రోజులకు ఒక సారి కూడా నీరు సరఫరా చేయడం లేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మిషన్ భగీరథ పథకం కింద 21 కిలోమీటర్ల దూరంలో కొత్త పైపులైన్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసినప్పటికి అధికారుల నిర్లక్షం వలన పనుల్లో తీవ్రంగా జాప్యం జరుగుతుంది. ఒకవైపు పాత రక్షిత మంచినీటి పథకాలు, బోర్‌వెల్‌లు పని చేయకపోవడం, మిషన్ భగీరథ పథకం నత్తనడకన సాగుతుండడంతో ప్రజలు తాగునీటి కోసం అల్లాడుతున్నారు.

Comments

comments