Search
Thursday 15 November 2018
  • :
  • :

మణిరత్నం, పూరీ జగన్నాథ్‌లు నిజమైన క్రియేటర్లు

ROGUE-Puri

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇషాన్ హీరోగా మన్నారా చోప్రా, ఏంజెలినా హీరోయిన్‌లుగా తెరకెక్కుతున్న రొమాంటిక్ ప్రేమకథా చిత్రం ‘రోగ్’. తాన్వి ఫిలింస్ పతాకంపై జయాదిత్య సమర్పణలో సి.ఆర్.మనోహర్, సి.ఆర్. గోపి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సునీల్ కశ్యప్ సంగీతం అందిం చిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో పూరి జగన్నాథ్, వి.వి.వినాయక్, ఇషాన్, ఏంజెలినా,మన్నారా చోప్రా, సునీల్ కశ్యప్, భాస్కరభట్ల, క్రిష్, సాయిరాం శంకర్, ఆకాష్ పూరి, రోష న్, అర్బాజ్ ఖాన్, కషిష్ వోరా, నికిత, అలీ, ప్రసాద్ వి.పొట్లూరి, సుబ్బరాజు, ఎ.ఎం.రత్నం, ఎజాజ్‌ఖాన్, సత్యానంద్, సంజన, వి.ఆనంద్ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు. బిగ్ సీడీని వి.వి.వినాయక్ విడుదల చేశారు. ఆడియో సీడీలను బాలీవుడ్ నటుడు, దర్శకనిర్మాత అర్బాజ్ ఖాన్ విడుదల చేయగా… తొలి సీడీని వి.వి.వినాయక్ అందుకున్నారు. ఈ సందర్భంగా అర్బాజ్ ఖాన్ మాట్లాడుతూ “పూరి జగన్నాథ్ డైరెక్షన్ వర్క్‌ను నేను చాలా ఇష్టపడతాను. ఆయన దర్శకత్వంలో వస్తోన్న మరో సూపర్ మూవీ ‘రోగ్’. ఇషాన్ చూడటానికి కొత్త హీరోలా కాకుండా అనుభవం ఉన్న హీరోలా కనపడుతున్నాడు. సినిమా చూడాలని చాలా ఆసక్తిగా ఉంది”అని అన్నారు. వి.వి.వినాయక్ మాట్లాడుతూ “కొత్త హీరో ఇషాన్ చాలా బాగున్నాడు. భవిష్యత్‌లో ఇషాన్ అగ్ర కథానాయకుడిగా ఎదుగుతాడు. పూరి జగన్నాథ్ ఒక కొత్త దర్శకుడిలా సిని మాను తెరకెక్కించినట్టు అనిపిస్తుంది. పూరి వయసు తగ్గుతూ ఉంటుంది తప్ప పెరగడం లేదు. దక్షిణాదిలో మణిరత్నం తర్వాత అంతటి గ్రేట్ డైరెక్టర్ పూరీనే. నిజమైన క్రియేటర్లు వాళ్లు. ఈ సినిమా ఘన విజయం సాధించాలి”అని చెప్పారు. పూరి జగన్నాథ్ మాట్లాడుతూ “చాలా రోజుల తర్వాత తీసిన సరదాగా సాగే లవ్ స్టోరీ ఇది. ఈ సినిమాకు ఆడియో బెస్ట్‌గా నిలుస్తుంది. సునీల్ కశ్యప్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. నా తొలి సినిమా బద్రి చేస్తున్నప్పుడు మా నిర్మాత ఫస్ట్ డే షూటింగ్ ముగిసిన తర్వాత నా దగ్గరకు వచ్చి 50 సినిమాలు తీస్తావు పో అని అన్నారు. ఆరోజున ఆ నిర్మాత ఏ నమ్మకంతో ఆ మాట అన్నారో… అలాంటి నమ్మకంతో నేను ఓ మాట చెబుతున్నాను. ఇషాన్ 50 సినిమాలు చేస్తాడు. అన్ని సినిమాలు చేయాలంటే 20 ఏళ్లు పడుతుంది. ఆ సత్తా ఇషాన్‌కు ఉందని దర్శకుడిగా నేను నమ్ముతున్నాను”అని చెప్పారు. నిర్మాత సి.ఆర్.మనోహర్ మాట్లాడుతూ “రోగ్ సినిమాతో ఇషాన్‌ను హీరోగా పరిచయం  చేయడంతో నా డ్రీమ్ నిజమైంది. పూరి జగన్నాథ్ చేతిలో పడటం ఇషాన్ అదృష్టం. ఇషాన్‌ను చూడగానే పూరి సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. సునీల్ కశ్యప్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు”అని తెలిపారు. ఇషాన్ మాట్లాడుతూ “పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా చేయడమే కాదు. పూరి వంటి మంచి ఫ్యామిలీ నాకు దొరికింది. ఆయన ప్రేమ, నమ్మకంతో సినిమా చక్కగా చేయగలిగాను. ముఖేష్ చాలా బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చారు. సునీల్ కశ్యప్ అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చారు. భాస్కరభట్ల చాలా మంచి సాహిత్యాన్ని అందించారు”అని అన్నారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ తార సన్నీలియాన్ ఆటాపాట ఆహుతులను అలరించింది.

Comments

comments