Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

కత్తి పద్మారావు కవిత్వంలో అభివ్యక్తి, వైశిష్టం

                      Katti-Padmarao

ఆయా కాలాల్లో ఖలీల్ జిబ్రాన్, ప్లాబ్లో నెరుడా, జాషూవా తమ స్థలకాలాల్లో దేశీయ, అంతర్జాతీయ పరిణామాలను వస్తువులో, శిల్పంలో భావనల్లో, నూతన అభివ్యక్తితో నేటికీ తమదైన ముద్రవేసి, కోట్లాది ప్రజల హృదయాలపై ముద్ర వేస్తున్నారు. ఇంకా వేస్తూనే ఉంటారు. కత్తి పద్మారావు కవిత్వం వర్తమానంతో పాటు భవిష్యత్తులో మరింత విస్తారంగా స్ఫూర్తి ఇస్తూనే ఉంటుంది. తెలుగు భాషకు, తెలుగులో భావవ్యాప్తికి అనేక పరిమితులున్నాయి. అందువల్ల పలు ప్రపంచ భాషల్లో అనువాదాలు వెలువడినప్పుడు కత్తి పద్మారావు విశ్వకవిగా ప్రపంచం గుర్తిస్తుంది. ఉద్యమకారుడిగా కత్తి పద్మారావు నిత్య పఠనశీలి. రోజుకు ఎనిమిది గంటలు చదవకుండా నిద్రపోలేని వ్యక్తి. ఇలా ప్రపంచ సాహిత్యాన్ని తనలో భాగం చేసుకున్న కత్తి పద్మారావు ప్రతిభా వ్యుత్పత్తుల శక్తి సామర్ధ్యాల అభివ్యక్తి, ప్రతి కవితలో, ప్రతి పదంలో, పాదంలో గమనించ వచ్చు. సూర్యరశ్మిలో వెలుగొక్కటే ప్రధానం. అందులో ఎన్నో రంగులు. మనకు కనపడని అతినీలలోహిత కిరణాలు కూడా ఉంటాయి. విశ్లేషిస్తే ఏడు రంగులు. ఇంకా దగ్గరికి వెళ్తే మండుతున్న అగ్నిగోళం. సూర్యుడు ఒక అగ్నిగోళం.

కత్తి పద్మారావు నిరంతరం జ్వలించే ఒక సూర్యుడు. అది వెలుగునిస్తుంది. నినాదాన్నిస్తుంది. ఉద్యమంలో అనేక దశలు ఉంటాయి. ఉద్యమాన్ని నినాదాలతో ముందుకు నడిపే దశ. నాయకత్వాన్ని, కార్యకర్తలను రూపొందించే దశ. ఉద్యమాన్ని, ఉద్యమ నిర్మాణాన్ని సమీకరించే దశ. కార్యకర్తలను తీర్చిదిద్దే శిక్షణా తరగతుల దశ. ఆటుపోట్లను, వైరుధ్యాలను పరిష్కరించుకునే దశ. ఆగిపోయే, స్తబ్దమయ్యే దశలో ప్రసంగాలు, వ్యాసాలు, కవితా ప్రక్రియల ద్వారా తిరిగి ఉత్తేజాన్ని నింపి, ఉద్యమాన్ని ముందుకు నడిపే దశ. ఈ అన్ని దశలను ఎప్పటికప్పుడు నాలుగు దశాబ్దాలుగా నిర్వహిస్తున్న ఉద్యమకారుడు. కవి, దార్శనికుడు కత్తి పద్మారావు.

ఆయా ఉద్యమాల్లో ప్రపంచ వ్యాప్తంగా చూస్తే, నాయకులకు కొన్నిటిలో ప్రత్యేక నైపుణ్యం ఉంటుంది. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అద్భుతమైన ప్రసంగాలతో అమెరికాలో నల్లజాతి ప్రజల్లో ‘ఐ హావ్ ఏ డ్రీమ్’ అంటూ నా వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలిస్తారు. నా స్వప్నం ఫలిస్తుందన్నారు. అనతి కాలంలోనే ఒబామా అమెరికా అధ్యక్షుడయ్యాడు. అలాగే కత్తి పద్మారావు ఉద్యమాలతో ఉపరాష్ట్రపతులు, రాష్ట్రపతులే మారిపోయారు. శంకర్ దయాళ్ శర్మ రాష్ట్రపతిగా 106 మంది పార్లమెంట్ సభ్యుల బృందాన్ని కలవడానికి నిరాకరించినప్పుడు దళితుడే రాష్ట్రపతి అనే నినాదంతో ముందుకు కదిలిన విప్లవకారుడు కత్తి పద్మారావు. అలా తర్వాతి కాలంలో కె.ఆర్. నారాయణన్ రాష్ట్రపతిగా ఎన్నిక కావడంలో ఆ నినాదం ఎంత గొప్పగా పని చేసిందో చరిత్రకు తెలుసు. ఇలా బహుముఖీన వ్యక్తిత్వాన్ని అభివ్యక్తిని, ప్రాచ్య, పాశ్చాత్య అలంకార శాస్త్రాల ఉదాత్త సంశ్లేషణ కవిత్వంలోకి మలచినప్పుడు దాన్ని ఏక పక్షంగా విశ్లేషించడం అంత సులభం కాదు. దళిత ఉద్యమాల వెంట నడిచి, వెలుగు నీడల్ని శిఖరాలు, లోయలను తరచి చూసి సన్నిహితంగా సాగినప్పుడే బహు పార్శ్వాలు తెలుస్తాయి. ముపె్పై ఏళ్ళ సహచర్యంలో కత్తి పద్మారావుగారిలోని అనేక పార్శ్వాలను సన్నిహితంగా చూసే అవకాశం కలిగింది. అందుకే ఈ మాట చెప్పగలుగుతున్నాను.

సరే తిరిగి కవిత్వంలోకి వద్దాం. ‘కొత్తభాష’లో ఇలా అంటారు కవి. ‘వాక్కు సార్వజనీనమైనది కొండ లోయల్లోనుంచి చిన్న మొక్కలా పుట్టి కొండనే ఛేదిస్తుంది’. ‘ప్రతితల్లీ భాషా శాస్త్రవేత్తే బిడ్డకు నేర్పేటప్పుడు తల్లి భాష సజీవ మవుతుంది’. ‘ప్రతి రుతువులో తల్లిది కొత్త భాష’. ‘చాలామంది స్వీకరించడమే గాని అభివ్యక్తి చేయలేరు’ ‘ఈ యుగం మాది’ వంటి కవితలను చాలామంది స్వీకరిస్తారు. కానీ, ఇందులోని సాంద్రతను, గాఢతను, వైవిధ్యాన్ని, బహుముఖ పార్శ్వాలను అభివ్యక్తీకరించలేరు. ‘సహచర్యంలోని భాష మనిషిని ప్రజ్వలింపజేస్తుంది’ ఇంత గొప్ప విషయం చెప్పిన తర్వాత వెంటనే మరో గొప్ప విషయం ప్రవహిస్తుంది. ‘సమకాలీనమైంది ప్రతిదీ రాగబంధమైందే’ ఇలా ప్రతి రెండు మూడు లైనులు కోట్ చేయాల్సిందే. ప్రతి రెండు మూడు లైన్లు వేమన పద్యంలా, నేటి కొత్త ప్రక్రియ నానీల్లా, ముక్తకాలుగా కొనసాగుతుంటాయి. అన్నిటిమధ్యా మళ్ళీ అంతస్సూత్రంగా ‘వస్తువు, శైలి, శిల్పం ఏకసూత్రత’ కొనసాగుతూనే ఉంటుంది. దీన్ని సాధించలేక ఖలీల్ జిబ్రాన్ ఎక్కడికక్కడ చిన్న చిన్న వాక్యాలుగా, సూక్తులుగా, తాత్విక ప్రవచనాలుగా మార్చాడు. ప్రపంచ చరిత్రలో వందేళ్ళు గతించాయి. ఎన్నో పరిణామాలు సంభవించాయి.

సమాజంలో, సాహిత్యంలో ఎన్నో ఉద్యమాలు వచ్చాయి. ప్రపంచమే సమూలంగా మారుతూ వస్తున్నది. ఈ నూతన పరిణామాల పర్యవసానంగా కత్తి పద్మారావు వేమన పద్యాల్లా, ఖలీల్ జిబ్రాన్‌లా ఎక్కడికక్కడ విడి పోకుండా పాటలోని చరణాల్లా, కవితా పాదాలు గజల్స్‌లోలా కంటిన్యూ అవుతుంటాయి. అంతర్లీనంగా పల్లవి మళ్ళీ మళ్ళీ కొనసాగుతూనే ఉంటుంది. అదీ కత్తి పద్మారావు కవిత్వంలోని విశిష్ఠత. ఈ ప్రత్యేకత, ఈ విశిష్ఠత ఊరికే రాలేదు. అనేక ప్రక్రియల, అధ్యయనాల, అనుభవాలను జీర్ణించుకున్న శక్తి సామర్ధ్యాలతో కవిత్వంలోని బరువు, లోతు, విస్తృతి పెరుగుుతూ వచ్చింది. తెలంగాణవాదిగా కత్తి పద్మారావు అభివ్యక్తి తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని సమర్ధిస్తూ కవి అనేక కవితలు రాశారు. ప్రసంగాలు చేశారు. కరపత్రాలు అచ్చువేశారు. వ్యాసాలు రాశారు. ఆ క్రమంలో ‘సమాంతర ధ్వని’ కవితలో దళిత దృష్టితో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును ఎలా సమర్ధిస్తారో, మూలాల్లోకి వెల్లి వ్యక్తీకరిస్తాడు. ‘ఒక గ్రామంలో వూరు, వాడ ఎంతవరకు కలిశాయి. మీ రోడ్లు వెడల్పయినంతమాత్రాన మీ మనస్సులు విశాలమైనయా… కుండల కెన్ని నీళ్ళు? మీ సమైక్యతలోని కరచాలనాలు, చిరునవ్వులు ఎర్రబస్సులో వున్నాయా?… ప్రాంతం చీలితే గుండెలు బాదుకున్నారే, మా మంచి నీళ్ళ చెరువును మీరు స్విమ్మింగ్ ఫూల్ చేసినపుడు మా గుండె చెరువు అవ్వలేదా…! అందరూ కలిసి వుండటమంటే మీకు బానిసలుగా వుండటమే!…’

వివరణ అక్కరలేని కవితా శిల్పం ఇది. కత్తి పద్మారావు కవిత్వంలో జీవిత సత్యాలు, అనుభవాలు సూక్తులుగా, కవితా పంక్తులుగా ఈ కవిత్వంలో ఒదిగిపోయాయి. కష్టాల్లో ఆదుకునేవారే స్నేహితులు. కాని వారి సుఖ సంతోషాల్లో భాగస్వామ్యం లేనప్పుడు వారి మధ్య సంబంధాలు యజమాని, బానిస సంబంధాలవుతాయి. వివక్ష, అసమానతలు కొనసాగుతున్నట్టు. ఇలాంటి సత్యాలెన్నో కత్తి పద్మారావు కవిత్వీకరించారు. ఉదాహరణకు ‘అంకిత యాత్ర’లో ఆత్మ గౌరవం గురించి ఎంత గొప్పగా చెప్పారో చూద్దాం. ‘విజయ పతాక’ కవితలో ‘వాళ్ళు కళ్ళకు గంతలు కట్టుకునే వున్నారు సూర్యుడు వారికి కనిపించటంలేదు’. పాత విషయమైనప్పటికీ ఎంత కొత్త అభివ్యక్తి!. ‘యజమాని పువ్వులను చిదిమినప్పుడల్లా అతడు వ్యధ చెందుతాడు’. ‘సమన్వయం లోపించినప్పుడల్లా వైవిధ్యం బద్ధలౌతుంది’ ‘మనో శిల్పం ఎక్కడ?’ కవితలో ‘మన చెయ్యిపట్టుకునేవారు ఊతం కోసం పట్టుకున్నారా! ఆత్మీయతతో పట్టుకున్నారా!

అనేది మనకు పల్లం వచ్చినపుడే అర్థమవుతుంది’ ‘మనుషులను మనమేదన్నా కోరితే వారు రాళ్ళతో మనల్ని మోదుతారు’. ‘కోరికేదైనా అది బానిసత్వానికే దారి తీస్తుంది’, ‘కిరీటం పెట్టుకున్నవాడైనా ఎవరి పాదాల వంకయినా చూస్తే ఆ కిరీటం నేలవారుతుంది’. ‘మనల్ని అనేక ఆధిపత్యాలు నడిపిస్తాయి. మనల్ని మనం నడిపించుకునేది ఎప్పుడు’ అని ప్రశ్నిస్తూ కవి స్వస్వరూప జ్ఞానాన్ని సాధించుకోవాల్సిన ఆవశ్యకతని నొక్కి చెప్తారు. ‘సమాజాన్నంతా మనం గెలిచామనుకుంటాము. గానీ దాన్ని నడిబొడ్డులో దాని కొలతలు భిన్నంగా ఉంటాయి’. ఆత్మగౌరవం, ఆత్మ విశ్వాసం అహంకారంగా మారకుండా వినయం ఆవశ్యకత ఏమిటో ఇలా గుర్తు చేస్తారు. ఇలా కత్తి పద్మారావు ప్రతి కవితలో అనేక సూక్తుల్లాంటి వాక్యాలు, నూతన నిర్వచనాలు, దార్శనికత సెంటు సీసా మూత తీస్తే గుభాళించినట్లుగా గుభాళిస్తుంటాయి. ఇంకా వాటిని రాసుకుని, పూసుకుని హృదయంలోకి తీసుకుంటే ఇంకెన్ని నూతన భావాలు వికసిస్తాయో! నేటి కవులు ఈ కవితా సంపుటిని చదవడం ద్వారా అభివ్యక్తి, భాష, వస్తువు, శిల్పం బహుముఖాలుగా విస్తరిస్తుంది. వారి కవిత్వంలో సాంధ్రత, సరళత, స్పష్టత పెరుగుతుంది. అంతా తెలిసినట్టుగానే ఉంటూనే మరింత తెలుసుకోవాల్సిన విధంగా నూతన వచన కవితా ప్రక్రియలను అభివృద్ధి పరుస్తున్న నూతన అభివ్యక్తి కత్తి పద్మారావు కవిత్వం.

బి.ఎస్.రాములు
8331966987

Comments

comments