Home ఎడిటోరియల్ ప్రతిపక్షాలు ఒక పని చేయాలి

ప్రతిపక్షాలు ఒక పని చేయాలి

Manifestos of all political parties release for 2018 assembly election

రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రతిపక్షాలు తమ మేనిఫెస్టోలను విడుదల చేయటంతోపాటు మరొక పని చేయాలి. ప్రభుత్వం తాను గత నాలుగేళ్లుగా చేసినట్లు చెప్తున్న పనులపై తమ అభిప్రాయమేమిటో అంశాల వారీగా ఒక పత్రం లో వివరించాలి. అందువల్ల ప్రజలు పరిస్థితిని మరింత బాగా అంచనా వేసుకునేందుకు వీలు కలుగుతుంది.

ప్రభుత్వం చేశామంటున్న కార్యక్రమాలపై ప్రతిపక్షాలు ప్రస్తుతం తమ పద్ధతిలో వ్యాఖ్యానిస్తున్నాయి. కాని అవి రెండు మూడు మాటల వ్యాఖ్యానాలు, విమర్శల పద్ధతిలో మాత్రమే ఉంటున్నాయి. కొన్ని అంశాలకు సంబంధించి అట్లా క్లుప్తమైన వ్యాఖ్యానాలు సరిపోతాయేమో తెలియదుగాని, అత్యధిక విషయాలకు సంబంధించి వివరమైన వ్యాఖ్యలు అవసరం. అప్పుడే ప్రజలకు ప్రతిపక్షాలు ఆలోచనలు ఏమిటో వివరంగా తెలుస్తాయి. ప్రభుత్వం చెప్పే వాటితో ప్రతిపక్షాల వ్యాఖ్యానాలను పోల్చి చూసుకుని ఒక అభిప్రాయానికి రాగలుగుతారు. లేనపుడు అయోమయం, శూన్యం మిగులుతాయి. ప్రతిపక్షాల పట్ల విశ్వసనీయత ఏర్పడదు.

ఇంతకాలం జరుగుతున్నదేమిటి? ఎవరి విమర్శలు వారు ఎదుటి వారిపైన మాటల రూపంలో చేస్తారు. తమ హామీలను లిఖిత రూపంలో మేనిఫెస్టోగా ప్రకటిస్తారు. ఈ సంప్రదాయాన్ని తెలంగాణా ప్రతిపక్షాలు మార్చగలిగితే బాగుంటుంది. ఇపుడు వివరాలలోకి పోదాము. తాను చేసినట్లుగా ప్రభుత్వం చెప్తున్న అతి ముఖ్యమైన పని విద్యుత్ సమస్యను పరిష్కరించటం. ఉమ్మడి రాష్ట్రంలో ఈ రంగం పరిస్థితి ఎట్లా ఉండేదో ఇంకా ఎవరూ మరచిపోలేదు. వ్యవసాయానికి నాలుగైదు గంటలకు మించి కరెంటు సరఫరా ఉండేది కాదు. అది ఎపుడు వచ్చేదీ తెలియదు.

పరిశ్రమలు విద్యుత్ హాలీడేతో కునారిల్లు తుండేవి. వ్యాపారాలకు, ఇళ్లకు సరఫరా చెప్పనక్కర లేదు. ఇది చాలదన్నట్లు విభజన చట్ట ప్రకారం విద్యుత్ సరఫరాలో ఆంధ్రప్రదేశ్ తన బాధ్యతకు కట్టుబడలేదు. అటువంటి విపత్కర పరిస్థితిని కేవలం ఒక సంవత్సరం తిరగకుండా మార్చటమేగాక, త్వరలో మిగులు విద్యుత్ రాష్ట్రంగా మారుతున్నట్లు ప్రభుత్వం చెప్తున్నది. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఈ మాటను ప్రజలు విని ప్రభావితులు అయ్యే అవకాశం ఉన్నందున, ఇందు గురించి తమ ఆలోచనలు ఏమిటో ప్రతిపక్షాలు వివరంగా తెలియజేయాలి. ఇప్పటి వరకు వారి నుంచి ధర ఎక్కువ చెల్లిస్తున్నారని, ముడుపులు తిన్నారని, గతం కన్నా అదనంగా ఉత్పత్తి చేస్తున్నది ఒక్క మెగా వాట్ అయినా లేదని, కొన్ని కొనుగోలు ఒప్పందాలు భవిష్యత్తులో గుదిబండగా మారుతాయని, ఉత్తరాదిన మిగులు ఉత్పత్తి ఉన్నపుడు అది తెచ్చుకోకుండా ఎక్కువ ధరకు ప్రైవేటు ఒప్పందాలు ఎందుకు వంటి విమర్శలు వచ్చాయి. వీటిలో ఏది సమంజసమైన విమర్శ, ఏది కాదు అనేది ఎట్లున్నా, మనకు అర్థంకానివి కొన్నున్నాయి. అసలు విద్యుత్ సమస్యలు తీర్చేందుకు ఆస్కారం అంటూ ఉన్నప్పుడు కాంగ్రెస్, టిడిపి ప్రభుత్వాలు ఇన్ని సంవత్సరాలపాటు వ్యవసాయం, పరిశ్రమలకు ఇంతగా నష్టాన్ని ఎందుకు కలిగించారు? సామాన్యులకు అవసరమైంది విద్యుచ్ఛక్తి తప్ప ఇటువంటి తర్కవితర్కాలు కాదు. అందువల్లనే విద్యుత్తు విషయమై వారు, టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఆ సమస్య పరిష్కరించటాన్ని చూస్తున్నారు గాని, ప్రతిపక్షాల విమర్శలనూ, వాటిలోని సత్యాసత్యాలను కాదు. ప్రజలకు కావలసింది సమస్య పరిష్కారమని ప్రతిపక్షాలకు తెలియనిదా? కనుక, ఇటువంటి విషయాల వివరణతో వారు ఒక పత్రాన్ని తమ మేనిఫెస్టోతోపాటు వేరుగా విడుదల చేయాలి.

కెసిఆర్ ప్రభుత్వం తాను సాధించినవిగా చెప్తున్న వాటిలో మొట్ట మొదటిది విద్యుత్ సమస్య పరిష్కారం కాగా, అన్నింటికన్నా తాజాది కంటి వెలుగు పథకం. ఇప్పటికే నెల రోజులకు పైగా అమలవుతున్న ఈ పథకం కింద మూడున్నర కోట్ల మందికి వారి నివాసాల సమీపంలోనే కళ్ల పరీక్షలు జరిపి, అవసరమైన చికిత్సలన్నీ ఉచితంగా చేయటం లక్షం. దీనిపట్ల ప్రజలంతా సంతోషం వ్యక్తపరుస్తున్నట్లు వార్తలు చెప్తున్నాయి. ఇందు గురించి ప్రతిపక్షాల వ్యాఖ్య లేవిధంగా ఉన్నాయి? కొద్ది చోట్ల కొద్ది మందికి సరిపోయే పాయింట్ల అద్దాలు అందక వాయిదా వేశారని, అద్దాలు నాసిరకంగా ఉన్నాయని, అద్దాల కొనుగోలులో అవినీతి జరిగిందని వగైరా. ఇందులో అవినీతి ఆరోపణ అన్నింటికన్న ముఖ్యం అనుకుంటే, అందు కు సంబంధించి చూపిన ఆధారం ఒక్కటైనా లేదు.

అద్దాలు నాసిరకమని స్వతంత్ర నిపుణులతో నిరూపించింది కూడా లేదు. కొందరికి కొన్ని పాయింట్లవి సకాలంలో అందకపోతే, అటువంటివి తెప్పించి ఇవ్వరని కాదు. మరి సమస్య ఏమిటి? ఇవన్నీ ఇట్లుంచి, తెలంగాణలో పెద్ద సంఖ్యలో పేదవారు దృష్టి సమస్యల్తో బాధపడటం మొదటి నుంచి ఉంది. కాని ఇటువంటి పథకం అందరికీ వర్తించేట్లు సమగ్రమైన స్థాయిలో అమలు పరచాలన్న ఆలోచన కాంగ్రెస్, టిడిపి ప్రభుత్వాలు ఎప్పుడూ చేయలేదన్నది వాస్తవం. సామాన్యులకు కళ్ల ఎదుట కన్పిస్తున్న విషయాలు ఇవన్నీ. ఆ స్థితిలో మొత్తం మీద కంటి వెలుగు పథకం గురించి ప్రతిపక్షాల ఆలోచనలు ఏమిటో మనకు నిర్దిష్టమైన రీతిలో తెలియవు. అందువల్ల ఇటువంటి వాటన్నింటి గురించి తమ అభిప్రాయాలను వారు ప్రజలకు అర్థమయే పద్ధతిలో ఒక ప్రత్యేక పత్రంగా తమ మేనిఫెస్టోలతో పాటు విడుడల చేయాలి.

పైన అన్నట్లు, టిఆర్‌ఎస్ ప్రభుత్వం చెప్తున్న వాటిలో విద్యుత్ సమస్య పరిష్కారం అన్నింటికన్న వెనుకటిది కాగా, కంటి వెలుగు అతి ఇటీవలది. ఈ రెండింటికి మధ్య ఇటువంటివే పెద్దవి, చిన్నవి కలిపి దాదాపు 400 ఉన్నట్లు ప్రభుత్వం చెప్తున్నది. అవి వేర్వేరు రంగాలకు సంబంధించినవి. ఒకటి సంక్షేమం. వేర్వేరు సామాజిక వర్గాల సంక్షేమం. వాటిలో కొన్ని కేవలం వారిని పోషణ రీత్యా నిలిపి ఉంచేవికాగా, కొన్ని దీర్ఘకాలంలో మానవ అభివృద్ధి కోణం నుంచి దోహదం చేసేవి. రెండవది అభివృద్ధి. తిరిగి అందులో వ్యవసాయాభివృద్ధి, పారిశ్రామికాభివృద్ధి, విద్యా ఆరోగ్యాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటివి ఉన్నాయి.

ప్రతిపక్షాల వ్యాఖ్యలలో కన్పించేది అంతా ఫలానాది చేస్తామని చేయలేదు అని తప్ప, ఇంతవరకు చేసిన దానిలో తప్పొప్పులు ఏమిటన్నది వాస్తవికంగా, నిష్పక్షపాతంగా విశ్లేషణలు కన్పించవు. బాధ్యతాయుతమైన, ప్రజాస్వామికమైన ప్రతిపక్షాలుగా నిర్మాణాత్మక సలహాలు ఇవ్వటం కలలోని మాట. ప్రజలకు తమ విశ్లేషణల వల్ల అవగాహనలు పెరగాలి. నిర్మాణాత్మక సూచనలతో “అవును నిజమే కదా” అనిపించాలి. కాని ఇటువంటి తీరు వారి నుంచి ఆవగింజంత అయినా కన్పించదు.

కెసిఆర్ ప్రభుత్వం తమ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన వాటిలో ‘కనీసం ఒక్కటి అయినా” అమలు పరచలేదన్నది ప్రతిపక్షాలు చేసే ఒక నిరంతర విమర్శ. ఇది నిజమా అన్నది ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలియాలి. అందుకోసం ప్రతిపక్షాలు టిఆర్‌ఎస్ మేనిఫెస్టోను ముందుపెట్టుకుని, అందులోని అంశాలను ఒక్కొక్కటిగా విశ్లేషించాలి. ప్రభుత్వం ఏమో దాదాపు అన్ని అమలు పరిచినట్లు చెప్తున్నది. కనుక, వాటి అమలుపై ప్రతిపక్షాలు సాధారణ రూపంలో విమర్శలు చేయటంగాక, ఒక్కొక్క అంశాన్నే తీసుకుంటూ వివరిస్తే విషయాలు తెలుస్తాయి. పోతే, అసలు తమ మేనిఫెస్టోలో హామీ ఇవ్వనివి 76 అంశాలను అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం ఈ నెల మొదటి వారంలో ఒక జాబితా ప్రకటించింది. సంఖ్య రీత్యా 76 తక్కువ కాదు. కనుక అందులోని నిజానిజాలను పరిశీలించేందుకు, ప్రజలకు చెప్పేందుకు ప్రతిపక్షాలకు ఇది మంది అవకాశం.

మన ప్రతిపక్షాలకు సంబంధించి ఒక దయనీయమైన, అవాంఛనీయమైన స్థితి వారు నిర్దిష్టతల కన్నా ఎక్కువగా గాలి మాటలపై ఆధారపడటం. ఈ తరహా విమర్శల ధోరణి ఇపుడు పని చేయగలది కాదు. ప్రజలకు చదువులు, చైతన్యాలు పెరుగుతున్నాయి. వారికి ప్రత్యేకంగా ఒకరిపట్ల, ఒక సిద్ధాంతంపట్ల, పార్టీపట్ల విధేయతలు, అభిమానాలు ఉండే ఒకప్పటి దశ బలహీనపడుతున్నది. అటువంటి ఈ కొత్త దశలో కావలసింది విమర్శకులకు గాలిమాటలు, దాడులు కాదు, నిర్దిష్టతలు, నిర్మాణాత్మకము.                                                                                                                                –  టంకశాల అశోక్