Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

భారంగా మంజీరా …

 Manjira waters have become a burden to the municipality

మన తెలంగాణ/వికారాబాద్  ః మంజీరా జలాలు వికారాబాద్ మున్సిపాలిటీకి భారంగా మారాయి. కొన్నాళ్లుగా హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్‌కు పన్నుల రూపేణా రూ.5 కోట్ల బకాయిలు పడింది. దీనికోసం మెట్రో పలుమార్లు నీటి సరఫరా నిలిపివేసిన దాఖలాలు ఉన్నాయి. మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ లేఖ ఇవ్వడంతో మెట్రో అధికారులు కాస్త వెనక్కు తగ్గినా మున్ముందు బకాయిలు చెల్లించక తప్పదు. వికారాబాద్ పట్టణానికి రూ.80 కోట్లతో మంజీరా మంచినీటి పథకానికి రెండు వేర్వేరుపైపులైన్లు వేశారు. శంకర్‌పల్లి మండలం సింగాపూర్ నుంచి పైపులైన్లు వేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రూ.35 కోట్ల పనులు చేపట్టారు. కొంతకాలానికే అప్పటి కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి చొరవతో శాటిలైట్ ప్రాజెక్టు కింద మరో 40 కోట్ల రూపాయలను వెచ్చించి అదనపు పైపులైన్లు నిర్మించారు. ఈ రెండింటిలో ఒక పథకం నిరుపయోగంగా మారింది. మార్గమధ్యలో రిజర్వాయర్లు, ట్యాంకులు నిర్మించారు. ప్రస్తుతం ఒకే ఒక్క పైపులైన్ ద్వారా మంజీరా జలాలు అందజేస్తున్నారు. 2015 నుంచి మెట్రోకు వికారాబాద్ మున్సిపల్ అధికారులు పూర్తిస్థాయిలో బకాయిలు చెల్లించడం లేదని సమాచారం.

మున్సిపల్ పాలకవర్గం కాంగ్రెస్ చేతిలో ఉండటం, ప్రభుత్వంతో మంచి సంబంధాలు లేకపోవడం వల్ల బకాయిలు తడిసి మోపెడైనాయి. పలుమార్లు మంచినీటి సరఫరా నిలిపివేసి ప్రజలకు అసౌకర్యం కల్పించారు. మున్సిపల్ పరిధిలో ఉన్న 60 వేల జనాభాకు అనుగుణంగా రోజుకు 5.4 మిలియన్ లీటర్ల (ఎంఎల్‌డి) నీరు సరఫరా చేయాలని మంజీరా పథకం రూపొందించారు. రోజు విడిచి రోజు మంజీరా జలాలు వదులుతున్నారు. పట్టణంలో 9,800 నల్లా కనెక్షన్లు ఉన్నాయి. గతంలో శివసాగర్ జలాశయం నుంచి నీటి సరఫరా చేసేవారు. ప్రస్తుతం అది ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తుంటారు. మెట్రో బకాయిలను మున్సిపల్ సాధారణ నిధుల నుంచి అరకొరగా చెల్లిస్తున్నందున ఏ మూలకూ సరిపోవడం లేదు. గృహ వినియోగదారుల నుంచి ప్రతి నల్లా కనెక్షన్‌కు రూ.200 వసూలు చేస్తున్నారు. మొత్తం రూ.18 లక్షలు కూడా సమకూరడం లేదు. ప్రభుత్వం ప్రత్యేక గ్రాంటు ఇస్తేగానే ఈ బకాయిలు తీరే పరిస్థితి కనిపించడం లేదు. మరో యేడాది కాలంలో మున్సిపల్ పాలకవర్గం గడువు తీరిపోతుంది. ప్రస్తుతం మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ పట్టణాల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. మంజీరా నీటి బకాయిలపై స్థానిక మంత్రి మహేందర్‌రెడ్డి సహకారంతో కేటీఆర్‌ను కలిసి ప్రత్యేక గ్రాంటును పొందాలని కొందరు అధికారపక్ష కౌన్సిలర్లు అంటున్నారు. ఇది వరకు కేటీఆర్ ఓ లేఖ ఇవ్వడం వల్ల మెట్రో అధికారుల నుంచి కాస్త ఉపశమనం లభించింది.

Comments

comments