Home వార్తలు తొలిసారిగా క్లాస్ రోల్‌లో మనోజ్

తొలిసారిగా క్లాస్ రోల్‌లో మనోజ్

Shivakumar-Malkapuramమంచు మనోజ్, రెజీనా హీరోహీరోయిన్లుగా బేబి త్రిష సమర్పణలో సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రై.లి. బ్యానర్‌పై దశరథ్ దర్శకత్వంలో శివకుమార్ మల్కాపురం నిర్మిస్తున్న చిత్రం ‘శౌర్య’. ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకొని మార్చి 4న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా నిర్మాత మల్కాపురం శివకుమార్ చెప్పిన సినిమా విశేషాలు…

సత్తా ఉన్న దర్శకుడు : డైరెక్టర్ దశరథ్ ఈ సినిమా స్టోరీ చెప్పగానే నాకెంతో నచ్చి ఈ సినిమాను నిర్మించాను. ఆయన ఏ సినిమాను అయినా డైరెక్ట్ చేయగలిగిన సత్తా ఉన్నవాడు. ‘శౌర్య’ను దశరథ్ అద్భుతంగా తెరకెక్కించాడు. తనకు అవకాశం లభిస్తే ఏ జోనర్‌లో అయినా సినిమా చేయగలడు.
అది నా హాబీ : నా సినిమాలో జూనియర్ ఆర్టిస్టు నుండి హీరో వరకు మొత్తం సెలెక్షన్ అంతా నేనే చేస్తాను. ఈ సినిమాలో పాత్రకు తగ్గ ఆర్టిస్టు, టెక్నీషియన్‌ను ఎంపిక చేసి సినిమాను మొదలుపెట్టాను. ఇదివరకు మా బ్యానర్‌లో డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, హీరోయిన్‌ను పరిచయం చేశాం. ఈ సినిమా ద్వారా మరో మ్యూజిక్ డైరెక్టర్ పరిచయం కాబోతున్నాడు. నా బ్యానర్‌లో వచ్చే ప్రతి సినిమా ద్వారా కొత్త వాళ్లను పరిచయడం నా హాబీ.
మ్యూజిక్‌కు మంచి స్పందన : మ్యూజిక్ డైరెక్టర్ వేదా ఇచ్చిన ట్యూన్స్ విని నచ్చిన తర్వాతే తనను ఎంపికచేసుకున్నాను. వేదాకు ఇది మొదటి సినిమా అయినా మంచి ట్యూన్స్ ఇచ్చాడు. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది.
లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ : ఇదొక లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ. ఈ అంశాలతో పాటు ఓ క్రైమ్ థీమ్ సినిమా అంతా ట్రావెల్ అవుతూ ఉంటుంది. కథే సినిమాకు పెద్ద హైలైట్. సినిమాటోగ్రఫీ సినిమాకు బాగా ప్లస్ అవుతుంది. అలాగే వేదా మ్యూజిక్ మరో హైలైట్ అవుతుంది. ఈ సినిమా క్రెడిట్ మొత్తం డైరెక్టర్‌కే చెందుతుంది. ఇదొక దర్శకుని సినిమా అని చెప్పొచ్చు. ఈ సినిమాలో స్క్రీన్‌ప్లే కథకు ప్రాణం.
మనోజ్ బాగా నచ్చుతాడు : మొదటిసారి ఈ సినిమాలో మనోజ్ సాఫ్ట్ లుక్‌లో కనిపించబోతున్నాడు. ఏ ఆర్టిస్టు అయినా ఒకటే పాత్రకు పరిమితం అవ్వకూడదు. తనను ఎలాగైనా మలుచుకోవచ్చు. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు మనోజ్ బాగా నచ్చుతాడు. పెళ్లికి ముందు మనోజ్ అన్ని మాస్ రోల్స్ చేశాడు. ఇప్పుడు తొలిసారిగా క్లాస్ రోల్‌లో ప్రేక్షకులను అలరించబోతున్నాడు.
1000 థియేటర్లలో రిలీజ్ : ‘శౌర్య’ను రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 700 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాం. ఓవర్సీస్‌లో 300 థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. మొత్తమ్మీద మా సినిమాను ప్రపంచవ్యాప్తంగా 1000 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాం.
కథ నచ్చితే చాలు : నా దగ్గరికి కథలు చెప్పడానికి చాలా మంది దర్శకులు వస్తుంటారు. వాళ్లు ఇంతకుముందు ఎక్కడ పనిచేశారు..? బ్యాక్‌గ్రౌండ్ ఏంటి..? అనే విషయాలను పట్టించుకోను. నాకు కథ నచ్చితే చాలు. పని చేయాలనే తపన దర్శకుడిలో ఉండాలి. టెక్నికల్ వర్క్ మీద గ్రిప్ ఉండాలి. అతనితో మాట్లాడితే తను పనిచేయగలడా, లేదా అనే విషయం నాకు అర్థమవుతుంది.
ఉగాదికి ప్రారంభిస్తా : ఉగాది పండుగన ఓ కొత్త సినిమాను ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నాం. మంచి పేరున్న హీరోతో సినిమా ఉంటుంది. పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తాను.