Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

ప్లాస్టిక్…ప్లాస్టిక్

Manufacture of plastic carry bags in the city

మన తెలంగాణ/ కార్పొ రేషన్ : వరంగల్ నగరం లో ఎక్కడ చూసినా ప్లాస్టిక్ మయమైంది. ప్లాస్టిక్ క్యా రీ బ్యాగుల నిషేధం నీరుకారుతుంది. పర్యావరణ ముప్పు తెచ్చే ప్లాస్టిక్ కవర్ల విక్రయాలను నియంత్రించడంలో అధికారులు నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు పర్యావరణ బాధ్యతలను అధికారులు పరిహాసం చేస్తున్నారు. కళ్లెదుటే ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల విక్రయాల వ్యాపారం జోరుగా సాగుతున్నా అధికారులు మిన్నకుండి పోతున్నారు. ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను నిషేధిస్తున్నట్లు ప్రకటించి ప్లాస్టిక్ నిషేధంపై వ్యాపారులతో సమావేశం నిర్వహించి అనంతరం ఈ విషయాన్నే నగర పాలక సంస్థ అధికారులు మర్చిపోయారు. అధికారుల దాడులతో మొదట కలవర పడ్డ వ్యాపారులు ఆ తరువాత వారితో లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకొని ఎదేశ్చగా ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల విక్రయాలు కొనసాగిస్తున్నారు. నగర పాలక సంస్థ ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను నిషేధించడంతో చాలా మంది ప్రజలు చికెన్, మటన్ షాపులకు, సరుకులకు వెళ్ళే సమయంలో సంచులను ఇంటి నుండి తీసుకెళ్లడానికి కొంత మంది అలవాటు పడ్డారు. అదే సమయంలో షాపుల నిర్వాహకులు సైతం  ప్లాస్ట్టిక్ క్యారీ బ్యాగులు స్థానంలో మట్టిలో కరిగిపోయే పేపరుతో తయారు అయిన బ్యాగులను అందుబాటులోకి తెచ్చి వినియోగదారులకు ఆ బ్యాగులతోనే సరుకులను అందించడం అలవాటు చేశారు. ఇదే సమయంలో గ్రేటర్ అధికారులు క్షేత్రస్థాయిలో ప్లాస్టిక్ నిషేధం పట్ల ప్రజలకు అవగాహన కల్పించకపోవడంతో వ్యాపారులతో కుమ్మకై ప్లాస్టిక్ బ్యాగుల బహిరంగ విక్రయానికి తలుపు తెరిచారు. దీంతో నగరంలో ఎప్పటిలాగే ప్రాణాంతక ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. అధికారులు మాత్రం నగరంలో ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు ఎవరు ఉపయోగించడం లేదని పూర్తిగా నిషేధం అమలవుతుందని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.

నగరంలోనే ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల తయారీ

రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ వాడకంపై నిషేధం విధించడంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి నగరానికి వచ్చే ప్లాస్టిక్ దిగుమతి నిలిచిపోయింది. దీంతో నగరంలోనే కొందరు బడా వ్యాపారులు ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల ఉత్పత్తి యంత్రాలను సమకూర్చుకొని నగరంలోనే తయారు చేస్తున్నట్లు సమాచారం. నగరంలోని ములుగురోడ్డులో గల ఇండెష్ట్రియల్ ఎస్టేట్, ఖమ్మం రోడ్డు, కరీమాబాద్, రాంపూర్ తదితర ప్రాంతాలలో తయారవుతున్నాయని సమాచారం. ఇక్కడి ఉత్పత్తి అయిన ప్లాస్టిక్ బ్యాగులను నగరంలోనే అన్ని ప్లాస్టిక్ షాపులలో ఎద్ధేశ్చగా విక్రయాలు చేస్తున్నట్లు తెలిసింది. ప్రధానంగా బ్రాండీ షాపులలో పళ్లు, కిరాణ షాపులు, కూరగాయల మార్కెట్లు, హోటళ్లు, మటన్, చికెన్, బేకరీలు, బట్టల దుకాణాలు, రెడిమెడ్ షాపులలో విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.
– మాముల్ల మత్తులో ప్రజారోగ్య విభాగం అధికారులు
ప్రధానంగా నిషేధిత ప్లాస్టిక్ అమ్మకాలను అరికట్టాల్సిన నగర పాలకసంస్థ ప్రజారోగ్య విభాగ అధికారులు, సిబ్బందిలో కొందరు ప్లాస్టిక్ విక్రయ వ్యాపారుల నుండి నెలనెల మాముల్లు దండుకోవడం వల్లే ప్లాస్టిక్ నిషేధం నీరు కారుతుంది. బల్దియ కార్మికులు ప్రతిరోజు చెత్త సేకరిస్తున్న క్రమంలో ప్లాస్టిక్ అవర్లు కుప్పలు కుప్పలుగా ఉంటున్నాయి. నిషేధం కఠినంగా అమలవుతే రోడ్లపై చెత్తకుప్పల్లో ప్లాస్టిక్ కవర్లు ఎలా దర్శనమిస్తాయని నగర ప్రజలు ఆరోపిస్తున్నారు. నగరంలోని ప్రధాన కేంద్రంగా సాగుతున్న ప్లాస్టిక్ విక్రయాల వ్యాపారులు ఒకొక్క దుకాణం నుండి అధికారులకు నెలనెల రూ.2వేల నుండి రూ.3 వేల దాకా ముడుపులు అందచేస్తున్నట్లు సమాచారం.
నామమాత్రలు తనిఖీలు మొక్కుబడిగా జరిమానాలు
నగర పాలక సంస్థ ప్రజారోగ్యం విభాగం అధికారులు ప్లాస్టిక్ విక్రయాల షాపులపై తూతూ మత్రంగా తనిఖీలు చేస్తూ మొక్కుబడిగా జరిమానాలు విధిస్తున్నారు. ఇటీవల కాలంలో ప్లాస్టిక్ విక్రయాలపై తనిఖీలు దాడులు లేకపోవడంతో ఎద్ధేశ్చగా విక్రయాలు సాగుతున్నాయి. చిన్నచిన్న షాపులపై దాడులు జరిపే అధికారులు గోధాములపై ఎందుకు దాడులు జరపడం లేదని ప్రజలు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా బల్దియా అధికారులు నగరంలో ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు నిషేధం కఠినంగా అమలయ్యేలా తనిఖీలు చేపట్టాలని నగర ప్రజలు కోరుతున్నారు. ప్లాస్టిక్ నిషేధంపై ప్రజలకు అవగాహన కల్పించి వాటి స్థానంలో పేపర్ బ్యాగులను ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు కృషి చేయాలని నగర పౌరులు కోరుతున్నారు.

Comments

comments