Home ఆఫ్ బీట్ స్నేహానికో తీపి గుర్తు

స్నేహానికో తీపి గుర్తు

Friend-ship-day-image

ఆగస్టు  మొదటి ఆదివారం ఆనందోత్సవాల మధ్య స్నేహితుల (ఫ్రెండ్‌షిప్ డే)రోజును జరుపుకుంటారు. ఈ సంస్కృతికి అమెరికా 1935లో శ్రీకారం చుట్టింది. ఇలా దేశవిదేశాలకు ప్రచారం జరిగి ఇప్పుడు ఈ రోజును జరుపుకునే దేశాల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా పెరిగింది. వాటి సరసన భారతదేశం కూడా చేరింది. స్నేహానికి గుర్తుగా తమకు తోచిన బహుమతులను ఇచ్చిపుచ్చుకుంటారు.  వీటిలో ఎక్కువగా.. పుష్పగుచ్చాలు, గ్రీటింగ్ కార్డులు, హ్యాండ్‌బ్యాండ్స్‌లాంటివి ఉంటాయి. ఫ్రెండ్ షిప్ డే అనగానే ఒక్కసారిగా స్కూల్, కాలేజీ ఫ్రెండ్స్ గుర్తుకొస్తారు. ఈ ఒక్కరోజైనా వారికోసం సరదాగా గడపాలనుకుంటారు. అందుకేనేమో ఆదివారం వస్తుందీరోజు.  మార్కెట్‌లో కూడా ఫ్రెండ్‌షిప్‌బ్యాండ్‌ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.  తమ స్నేహాన్ని ఏడాదంతా పదిలపరుచుకోవాలనే తపన ఉంటుంది. టెక్నాలజీ పుణ్యమా అని దూరంగా ఉన్న స్నేహితులకు కూడా మన గిఫ్ట్‌ను అందించే అవకాశం ఉంది.   కానీ అలాంటి గిఫ్ట్ ఏం ఇవ్వాలో తెలియక అయోమయంలో పడేవారుంటారు.  అలాంటివారికోసమే ఈ గిఫ్ట్ ఐడియాలు…

స్లీపింగ్ బుద్ధా…
బుద్ధుడు శయనిస్తున్న విగ్రహం ఇంట్లో ఉంటే భోగభాగ్యాలు వెల్లివిరుస్తాయని కొన్ని దేశాల్లో నమ్ముతారు. అలాగే శాంతికి చిహ్నంగాను భావిస్తారు. కాబట్టే, స్లీపింగ్ బుద్ధా బహుమతుల రేసులో ముందుంది ఇప్పుడు. ప్రతి దానికి టెన్షన్ పడిపోయే స్నేహితుడికి దీన్ని ఇస్తే మరీ బాగుంటుంది. బ్యాంకాక్‌లో అతి పెద్ద స్లీపింగ్ బుద్ధా ఆలయం ఉంది.

చాక్లెట్ బొకే
ప్రేమికుల రోజైనా, పెళ్లి రోజైనా, పుట్టిన రోజైనా శుభాకాంక్షలు చెప్పేందుకు చేతిలో పూలబొకే ప్రత్యక్షమౌతుంది. స్నేహితుల దినోత్సవానికి కూడా మళ్లీ పూలంటే బోర్. అందుకే కొత్తగా చాక్లెట్ బొకేలూ, టెడ్డీబేర్ బొకేలూ వచ్చాయి. పూల స్థానంలో… చాక్లెట్లు, చిన్న టెడ్డీబేర్ బొమ్మలూ అమర్చి బొకేల్ని తయారుచేస్తారు. ‘మంచింగ్ మిక్స్ బొకే’లు కూడా ఉన్నాయి. అందులో చాక్లెట్లు, లాలీపాప్‌లు, కుర్‌కురే, లేస్ వంటి చిప్స్ ప్యాకెట్లు కూడా పెట్టి సిద్ధం చేస్తారు. మీ స్నేహితులలో రుచుల ప్రియులు కనుక ఉంటే … వారికి ఈ మంచింగ్ మిక్స్ బొకే ఇచ్చేయండి..

ఫొటోలతో గ్రీటింగ్స్ 
స్నేహితులతో ఎన్నో అనుభూతులు పంచుకుని ఉంటారు. సినిమాలూ షికార్లూ విహారయాత్రలూ ఇవన్నీ మామూలే. ఫొటోలు, వీడియోల గురించి చెప్పక్కర్లేదు. అవన్నీ ఫ్రేములో ఇమిడిపోతే పదిలంగా ఉంటుంది. అందులోంచి మీకు నచ్చిన ఫొటోని గ్రీటింగ్‌గా మార్చేయండి. ‘ఎలా మార్చాలి’ అంటారా? అందుకు ఆన్‌లైన్‌లో అనేక సంస్థలున్నాయి. మీ ఫొటో పంపించి ఆర్డరిస్తే సరిపోతుంది.. గ్రీటింగు కార్డుని మీ అడ్రసుకు పంపిస్తారు. లేదంటే ఇగ్రీటింగ్ కార్డును మీరే తయారుచేసి… స్నేహితునికి మెయిల్ చేసి శుభాకాంక్షలు చెప్పొచ్చు.

మెరిసే బాటిల్ ల్యాంప్: బెడ్‌లైట్‌లా ఉపయోగపడే బాటిల్ ల్యాంప్‌లు ఇప్పుడు బహుమతులుగానూ మారాయి. బాటిల్‌పై మీ స్నేహాన్ని సూచించే ఫొటోను అచ్చువేయిస్తే .. మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఆ దీపం వెలుగులో బాటిల్‌మీద మీ స్నేహచిత్రం వెలిగిపోతూ కనిపిస్తుంది. ఫొటోకు బదులుగా ఏదైనా మెసేజ్ కూడా రాయచ్చు. ఆన్‌లైన్‌లో ఇవి విరివిరిగా దొరుకుతున్నాయి.

ఓ మందార మొక్క…
మొక్కలు ఇప్పుడు తిరుగులేని బహుమతులు. అలాగని ఏ మొక్క పడితే ఆ మొక్క ఇవ్వమని కాదు. పూలతో ఉన్న మందారం, లేదా వెదురు మొక్కలను బహుమతిగా అందించడం కొత్త ట్రెండ్. పెద్దది కాదండోయ్ కుండీల్లో ఉండి, మొక్కనిండా పూలు ఉన్నవి ఇస్తున్నారు. నర్సరీల్లో లేదా ఆన్‌లైన్‌లో కూడా పూలతో నిండిన ఈ మొక్కలను ప్రత్యేకంగా అమ్ముతున్నారు.

ఫ్రెండ్‌షిప్ బ్యాండ్ వాచ్
ఫ్రెండ్‌షిప్ రోజున మరింత సందడి చేసేది ఫ్రెండ్‌షిప్ బ్యాండ్‌లే. అందరి మణికట్టుకూ ఇవే కనిపిస్తాయి. మరి మీ మనసుకు దగ్గరైన బెస్ట్‌కు కూడా ఇవ్వే అంటే బాగోదు కదా! ‘వెరీ వెరీ స్పెషల్’ ఫ్రెండ్స్ కోసం ‘ఫ్రెండ్‌షిప్ బ్యాండ్ వాచ్’ వచ్చేసింది. ధర కూడా ఎక్కువేం కాదు. రూ. 250 ల నుంచీ మార్కెట్లో దొరుకుతున్నాయి. అమ్మాయిలకి, అబ్బాయిలకు వేర్వేరుగా ఉన్నాయి.