Home తాజా వార్తలు పథకాలే విజయ పతాకాలు!

పథకాలే విజయ పతాకాలు!

Many welfare schemes implemented by the KCR government

నాలుగున్నర ఏళ్లుగా కెసిఆర్ ప్రభుత్వం అమలు చేసిన పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలే ఘన విజయాన్ని సాధించిపెడతాయని టిఆర్‌ఎస్ శ్రేణుల్లో ధీమా                                                                                                              ‘ సంక్షేమంపై సుమారు రూ. 2 లక్షల కోట్లు వ్యయం, జనాభాలో ఒక్కొక్కరికీ ఒకటి కంటే ఎక్కువ పథకాల ద్వారా లబ్ధి’

సమైక్యపాలనలో ఘర్షణలు, కర్ఫూలే.
టిఆర్‌ఎస్ హయాం లో ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా నిద్రపోతున్నారు.
– మహమూద్ అలీ ఉపముఖ్యమంత్రి

టిఆర్‌ఎస్ అభివృద్ధి, సంక్షేమ పాలన ప్రతి కుటుంబాన్నీ ప్రభావితం చేసింది. ప్రతి ఒక్కరూ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో లబ్ధిపొందుతున్నారు.                                                                                                    – ఈటల రాజేందర్ ఆర్థిక మంత్రి

మన తెలంగాణ / హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఉనికిలోకి వచ్చిన నాలుగున్నరేళ్ళలోనే అనూహ్యమైన ఆర్థిక ప్రగతితో పాటు గతంలో ఎన్నడూ లేనంత స్థాయి లో సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువకావడం రానున్న ఎన్నికల్లో గెలుపుకు ‘శ్రీరామరక్ష’గా పనిచేస్తుందని టిఆర్‌ఎస్ శ్రేణులు ధీమాతో ఉన్నాయి. ముఖ్యమంత్రి కెసిఆర్ సెప్టెంబరు 2న కొంగరకలాన్‌లో నిర్వహించిన ‘ప్రగతి నివేదన’ సభ మొదలు ప్రస్తుతం నియోజకవర్గాల్లో టిఆర్‌ఎస్ అభ్యర్థులు చేస్తున్న ఎన్నికల ప్రచారం వరకు వీటిని ప్రజలకు వివరిస్తున్నారు. సంక్షేమ పథకాలకు తోడు కంటి వెలుగు, అర్చకులకు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో వేతనాలు చెల్లింపు, పదవీ విరమణ వయసును 65 ఏళ్ళకు పెంచడం, తెలంగాణ డయాగ్నస్టిక్స్, హోంగా ర్డులకు, అంగన్‌వాడీ కార్మికులకు, ‘ఆశా’ కార్మికులకు వేతనాలు పెంపు& ఇలా పలు కార్యక్రమాలు టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమైందని, ప్రజల అవసరాల ఆలోచనలోంచి పుట్టుకొచ్చినవని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు.

సమైక్య పాలనలో తరచూ మత ఘర్షణలు జరిగేవని, కర్ఫూలు సాధారణమయ్యేదని, కానీ టిఆర్‌ఎస్ పాలనలో మాత్రం ప్రతీ ఒక్కరూ ప్రశాంతంగా నిద్రపోయే వాతావరణం సాధ్యమైందని ఉప ముఖ్యమంత్రి మహమూద్ ఆలీ వ్యాఖ్యానించారు. స్వరాష్ట్రంలో అభివృద్ధే లక్షంగా, ప్రజల జీవన ప్రమాణాలు పెరగడమే ధ్యేయంగా విద్యుత్ సంక్షోభాన్ని పరిష్కరించడంతో మొదలుపెట్టిన ప్రభుత్వ ప్రయాణం కోటి ఎకరాలకు సాగునీరు అందించే పలు ప్రాజెక్టుల దాకా సాగిందని, ఈ నాలుగన్నరేళ్ళలో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమం రాష్ట్రంలోని ప్రతీ కుటుంబాన్ని తాకిందని, ఏదో ఒక పథకానికి కుటుంబంలోని ప్రతీ ఒక్కరూ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో లబ్ధిదారులుగా ఉన్నారని మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. సాగునీటి ప్రాజెక్టులకు ఏటా పాతికవేల కోట్ల రూపాయలను, సంక్షేమానికి దాదాపు రూ. 45 వేల కోట్లను ప్రతీ ఏటా బడ్జెట్‌లో ప్రభుత్వం ఖర్చు చేస్తోందనన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టకపోయినా అనేకం ఇప్పుడు ప్రజలకు అందుతున్నాయన్నారు.

ప్రజల అవసరాల్లోంచి పుట్టిన ఆలోచన
ప్రజలు కేంద్రంగా రూపొందిన సంక్షేమం ప్రణాళికలు అగ్రవర్ణ బీదవారితో సహా వారూ-వీరూ అనే తేడా లేకుండా, ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీ తదితర అన్ని సెక్షన్ల ప్రజలకు ఉద్దేశించి ఉనికిలోకి వచ్చాయని పేర్కొన్నారు. మరోవైపు కొత్త రాష్ట్రమే అయినా వినూత్న ఆలోచనలు, పకడ్బందీ ఆచరణలో అనేక రంగాలు అభివృద్ధిలో పరుగులు తీస్తున్నాయని, అనతి కాలంలోనే దేశం గర్వించే రాష్ట్రంగా గుర్తింపు పొందిందని గుర్తుచేశారు. ఆర్థిక వృద్ధిరేటు, రాష్ట్ర జిడిపి (జిఎస్‌డిపి) మరే రాష్ట్రంకంటే ఎక్కువగా నమోదవుతూ కేంద్ర ప్రభుత్వం నుంచీ, నీతి ఆయోగ్ నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, పార్లమెంటు సాక్షిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుంచిప్రశంసలు అందుకుందని వివరించారు.

సంక్షేమానికి పెద్ద పీట
గడచిన నాలుగున్నరేళ్ళలో సుమారు రెండు లక్షల కోట్ల రూపాయలను సంక్షేమ రంగానికి ప్రభుత్వం ఖర్చు చేసిందని, వీటి ద్వారా సుమారు ఏడు కోట్ల మందికి పలు విధాలుగా సహాయం అందిందని పేర్కొన్నారు. రాష్ట్ర జనాభా మూడున్నర కోట్లే అయినా లబ్దిదారుల్లో ఒకటికంటే ఎక్కువ పథకాల ద్వారా లబ్ది పొందడంతో ఈ సంఖ్య సుమారు ఏడు కోట్ల మంది అని వివరించారు. కొద్దిమందికి ఐదారు పథకాల ద్వారా లబ్ది కలిగిందని పేర్కొన్నారు. సగటున లెక్కలు తీస్తే సుమారు 1.75 కోట్ల మందికి పైగా ఈ పథకాలు చేరాయన్నారు. ఒక్కో కుటుంబానికి సుమారు రూ. 50,000 నుండి రూ. 2,50,000 వరకు కనీస స్థాయిలో ఈ నాలుగున్నరేళ్ళలో లభించి వుంటాయని ఈటల రాజేందర్ అంచనా వేశారు. టిఆర్‌ఎస్ అధికారంలోకి రావడంతోనే కుటుంబానికి ప్రభుత్వమే భరోసాగా ఉండాలని ఆలోచించిన ముఖ్యమంత్రి కెసిఆర్ దారిద్య్ర రేఖకు దిగువన (బిపిఎల్) ఉండే కుటుంబాల వార్షిక ఆదాయ పరిమితిని గ్రామీణ ప్రాంతాల్లో రూ.60 వేల నుంచి ఒకటిన్నర లక్ష రూపాయలకు, పట్టణ ప్రాంతాల్లో రూ.75 వేల నుంచి రెండు లక్షల రూపాయలకు పెంచారని, దీని ద్వారా ప్రభుత్వ పథకాలకు వారిని లబ్ధిదారులుగా అర్హత కల్పించారని వివరించారు.

కుటుంబాలకు ‘ఆసరా’
రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ. 5,043 కోట్లు ఖర్చు చేస్తూ సుమారు 40 లక్షల మందికి ప్రతీ నెలా ఆసరా పెన్షన్లు అందిస్తున్నదని, వీరిలో 13,36,918 మంది వృద్ధులు, 14,40, 367 మంది వితంతువులు,13,606 మంది బోదకాలు బాధితులు, 1,31,195 మంది ఒంటరి మహిళలు, 62,673 మంది గీత కార్మికులు, 37,165 మంది చేనేత కార్మికులు, 4,08,635 మంది బీడీ కార్మికులు, 19,602 మంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, 4,96,215 మంది దివ్యాంగులు ఉన్నారని వివరించారు. సమైక్య రాష్ట్రంలో పింఛను రూ.200 గా ఉంటే, దాన్ని రూ.1000కి పెంచిందని గుర్తుచేశారు ఇక దివ్యాంగులకు రూ. 1500 పింఛను అమలవుతున్నదని పేర్కొన్నారు. వృద్ధ కళాకారుల పింఛన్‌ను రూ.500 నుంచి రూ.1,500కు పెంచడంతో 417 మంది లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, బోదకాలు వ్యాధి గ్రస్తులకు ప్రతీ నెలా 1000 రూపాయల పెన్షన్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ గుర్తింపు పొందిందన్నారు.

పేద కుటుంబాలకు పెళ్ళి భారం కాకూడదు
పేద కుటుంబాలకు ఆడబిడ్డ పెళ్ళి ఆర్థికంగా భారం కాకూడదన్న ఉద్దేశంతో టిఆర్‌ఎస్ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టకపోయినా అధికారంలోకి వచ్చిన తర్వాత ‘కళ్యాణలక్ష్మి’, ‘షాదీ ముబారక్’ పథకాలను ప్రవేశపెట్టి ఆడబిడ్డ పెండ్లికి లక్షా 116 రూపాయలు అందిస్తున్నదని గుర్తుచేశారు. కళ్యాణలక్ష్మి ద్వారా 3,43,059 మంది, షాదీ ముబారక్ ద్వారా 1,02,934 మంది లబ్ది పొందారని, ఈ రెండు పథకాలకు ఇప్పటిదాకా రూ.3187 కోట్లు ఖర్చు చేసిందని వివరించారు.

సన్నబియ్యం, కోటా లేని రేషను బియ్యం
కుటుంబంలోని ప్రతీ వ్యక్తికీ ఆరు కిలోల చొప్పున రేషను దు కాణాల ద్వారా బియ్యం అందిస్తున్న ప్రభుత్వం కుటుంబం లో ఎంతమంది ఉన్నా వారికి వర్తింపజేసందని వివరించారు. సమైక్య రాష్ట్రంలో ఒక్కో వ్యక్తికి 4 కిలోల చొప్పున మాత్రమే కుటుంబానికి గరిష్టంగా 20 కిలోల బియ్యం అందేదని, కానీ కడుపు నింపడానికి ప్రభుత్వం ఈ ఆంక్షలను సడలించిందని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా సంవత్సరానికి రూ. 5413 కోట్లు ఖర్చు చేస్తోందని, 2,74,00,000 మందికి లబ్ది చేకూరుతోందని అన్నారు. అన్ని ప్రభుత్వ హాస్టళ్లల్లో, పాఠశాలల్లో, అంగన్ వాడీ కేంద్రాల్లోని 44.61 లక్షల మంది విద్యార్థులకు సన్నబియ్యంతో వండిన అన్నం పెడుతున్న ప్రభుత్వం మానవీయ కోణంలో ఈ నిర్ణయం తీసుకుందన్నారు.

ప్రశాంతంగా బతుకుతున్నాం : డిప్యూటీ సిఎం
సమైక్య రాష్ట్రంలో గతంలో ఎన్నో మత ఘర్షణలు జరిగేవని, ఏ సమయంలో కర్ఫూ విధిస్తారో తెలియని భయంతో గడిపేవారమని, ఇంటి నుంచి బైటికెళ్ళినవారు ఎప్పుడు వస్తారో కూడా తెలియని గందరగోళంలో ఉండాల్సి వచ్చేదని, కానీ ఈ నాలుగున్నరేళ్ళలో ఒక్క మత ఘర్షణగానీ, ఒక్క కర్ఫూగానీ లేకుండా ప్రశాంతంగా గడిపామని డిప్యూటీ సిఎం మహమూద్ ఆలీ వ్యాఖ్యానించారు. గతంలో ఏ ప్రభుత్వమూ మైనారిటీల గురించి ఆలోచించలేదని, ఈ నాలుగున్నరేళ్ళ కాలంలో రెండేళ్ళ వ్యవధిలోనే రెండు వందల గురుకుల పాఠశాలలు మైనారిటీల కోసం ప్రారంభించబడ్డాయని గుర్తుచేశారు. ఎక్కువ మంది కుటుంబ సభ్యులు ఉండే ముస్లిం కుటుంబాలకు ప్రతీ ఒక్కరికీ ఆరు కిలోల చొప్పున రేషను బియ్యం అందడం చాలా ఉపయోగపడిందని, షాదీ ముబారక్ ద్వారా ఎంతో మంది పేద ముస్లిం యువతులు పెళ్ళి చేసుకున్నారని, ఆ కుటుంబాలను ఆర్థిక భారం నుంచి ప్రభుత్వం గట్టెక్కించిందన్నారు.

పేదల ముఖాల్లో చిరునవ్వే లక్షంగా
తెలంగాణ రాష్ట్రంలోని ప్రతీ కుటుంబానికీ ప్రభుత్వం అండగా ఉండాలన్న ఉద్దేశంతో అనేక పథకాలను ప్రవేశపెట్టిందని గుర్తుచేసిన ఈటల రాజేందర్ కొన్ని కార్యక్రమాలను ఉదహరించారు.

1. తెలంగాణలో గుడుంబా మహమ్మారిని తరిమికొట్టింది. గుడుంబా తయారీపై ఆధారపడిన ఒక్కొక్కరికి రూ.2 లక్షల ఆర్థిక సహాయం చేసి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించింది.

2. ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తున్న పేదలకు 125 చదరపు గజాలలోపు స్థలాన్ని ప్రభుత్వం ఉచితంగా క్రమబద్ధీకరించింది. జి.ఓ. నెంబర్ 58 కింద రెగ్యులరైజేషన్ ప్రకారం రాష్ట్రం లక్షా 25 వేల మందికి భూమి పట్టాల పంపిణీ జరిగింది.

3. డ్రైవర్లకు, హోంగార్డులకు, ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి, 5 లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించింది. ఆటోలు, వ్యవసాయ ట్రాక్టర్లపై రవాణా బకాయిలను మాఫీ చేసింది. రవాణా పన్నును రద్దు చేసింది.

4. పేద యువతకు స్వయం ఉపాధి కోసం బ్యాంకులతో సంబంధం లేకుండా, రూ.50 వేల వరకు, వంద శాతం సబ్సిడీతో ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తున్నది. లక్ష రూపాయల రుణం తీసుకునే వారికి 80 శాతం సబ్సిడీ అందిస్తున్నది. రూ.2 లక్షలలోపు యూనిట్ కు 70 శాతం, రూ.5 లక్షలలోపు యూనిట్ కు 60 శాతం సబ్సిడీని అందిస్తున్నది. రూ. 330 కోట్ల ఖర్చుతో రెండు వేల మందికి పైగా విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్‌షిప్ ఇచ్చింది.

5. ఎస్‌సి, ఎస్‌టిలకు జనాభా నిష్పత్తి ప్రకారం నిధులు కేటాయించి, ఆ నిధులను ఆ వర్గాల కోసమే ఖర్చుచేయడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రగతి నిధి చట్టం చేసింది. ఒక ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన నిధులు ఏదేని కారణం వల్ల ఖర్చు కాకుంటే మరుసటి సంవత్సరానికి బదిలీ చేసే విధంగా చట్టంలో స్పష్టమైన నిబంధన పెట్టింది. రాష్ట్రంలో ఇప్పటివరకు రూ.503.53 కోట్లు ఖర్చు చేసింది. 12,975ఎకరాల భూమిని, 5,065 ఎస్‌సి కుటుంబాలకు ప్రభుత్వం పంపిణీ చేసింది.

6. వృత్తి విద్యాకోర్సులు పూర్తిచేసిన 1,20,713 మంది ఎస్‌సి, ఎస్‌టి యువకులకు ప్రభుత్వమే ప్రత్యేక శిక్షణ ఇచ్చి, వివిధ వృత్తుల్లో స్థిరపడేలా ప్రోత్సాహం అందించింది. ఇందుకోసం రూ. 1153 కోట్లు ఖర్చు చేసింది.

7. రాష్ట్రంలోని ఎస్‌సి, ఎస్‌టిలకు గృహ విద్యుత్తు వినియోగంలో 101 యూనిట్ల వరకు ఉచితంగా అందిస్తోంది ప్రభుత్వం. గృహ వినియోగం కేటగిరీలో రూ.70 కోట్లకుపైగా ఉన్న ఎస్‌టిల విద్యుత్ బకాయిలను ప్రభుత్వం రద్దు చేసింది. దీనివల్ల 56,94,000 మంది లబ్ది పొందారు. దీని ద్వారా ప్రభుత్వం మీద రూ. 1141 కోట్ల భారం పడింది.

8. దేశంలో మరెక్కడాలేని విధంగా మసీదుల్లో ప్రార్ధనలు చేసే 8428 ఇమామ్, మౌజమ్‌లకు సాలీనా రూ. 50 కోట్లు ఖర్చు చేస్తూ నెలకు రు. 5000 రూపాయల భృతిని అందిస్తోంది.

9. రాష్ట్రంలోని గొల్ల, కుర్మలకు 75 శాతం సబ్సిడీపై రూ. 5 వేల కోట్లతో 84 లక్షల గొర్రెలు పంపిణీ చేస్తున్నది. లక్షలాది మంది గొల్లకుర్మలు దీని వల్ల లబ్ది పొందారు. మత్స్యకారుల కోసం చెరువులు, ఇతర జలాశయాల్లో పెంచేందుకు ఉచితంగా చేపపిల్లలను సరఫరా చేస్తున్నది.

10. ఆసుపత్రి ప్రసవాలను ప్రోత్సహించేందుకు గర్భిణీకి రూ.12 వేల నగదు, రూ.3 వేల కెసిఆర్ కిట్‌లను ప్రభుత్వం అందిస్తోంది. ఆడపిల్ల పుడితే మరో వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తోంది. ఇప్పటివరకు 3,18,742 మంది ఈ పథకం ద్వారా లబ్ది పొందారు. ప్రభుత్వం రూ. 404 కోట్లు ఖర్చు చేసింది. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలకు, బాలింతలకు, పిల్లలకు ప్రతి రోజూ ఒక పూట పోషకాలతో కూడిన సంపూర్ణ భోజనాన్ని అందించే ఆరోగ్యలక్ష్మి పథకాన్ని ప్రభుత్వం అమలుచేస్తున్నది. కోడిగుడ్లతో పాటు గోధుమలు, పాలపొడి, శనగపప్పు, చక్కెర, నూనెలతో కూడిన రెండున్నర కిలోల ప్యాకెట్‌ను ప్రతీ నెలా అందిస్తున్నది. ఈ పథకం ద్వారా రూ. 278 కోట్లతో 18,05,634 మందికి లబ్ది చేకూరుతోంది.

11. రాష్ట్రంలోని 35.29 లక్షల మంది రైతులకు చెందిన రూ. 16,124.37 కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేసిన ప్రభుత్వం ఎకరానికి 4 వేల చొప్పున రెండు పంటలకు కలిపి ఏడాదికి రూ. 8 వేలను ‘రైతుబంధు’ పేరుతో పంట పెట్టుబడి సాయంగా అందిస్తోంది. 49,49,000 మంది రైతులు లబ్ది పొందారు. 18 నుంచి 60 సంవత్సరాల వయస్సున్న రైతులందరికీ ప్రభుత్వం ఉచిత జీవిత బీమా సౌకర్యం కల్పిస్తోంది. ఒక్కో రైతుకు ఏటా రూ. 2,271 ప్రీమియంను ప్రభుత్వమే చెల్లిస్తోంది. రైతు మరణించిన పది రోజుల్లోగానే నామినీకి 5 లక్షల సొమ్ము అందుతోంది. దీని ద్వారా 28,00,000 మందికి లబ్ది కలుగుతోంది. ప్రీమియం చెల్లింపు కోసం ప్రభుత్వం రూ. 636 కోట్లను ఖర్చు చేసింది.

12. 2009 నుంచి రైతులకు చెల్లించాల్సిన ఇన్ పుట్ సబ్సిడీ పాత బకాయిలను చెల్లించిన ప్రభుత్వం తెలంగాణ ఏర్పడిన తర్వాత నాలుగేండ్లలో 37,45,102 మంది రైతులకు మొత్తం రూ. 1325 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని అందించింది.

13. ‘సాదా బైనామా’ల మీద జరిగిన భూముల క్రయవిక్రయాలకు చట్టబద్ధత కల్పిస్తూ ప్రభుత్వం ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసింది. దీనివల్ల 11,19,111 మంది లబ్ది పొందారు.

14. రైతులకు ఎరువులు, విత్తనాలు కొరత లేకుండా సరఫరా చేస్తున్నది. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను కల్తీచేసే వారిని, అమ్మే వారిని కఠినంగా శిక్షించడం కోసం ఈ నేరాలను పిడి చట్టం పరిధిలోకి తెచ్చింది.

15. ‘కంటి వెలుగు’ పథకం కింద సుమారు 52 లక్షలకు పైగా లాభం పొందారు. ప్రభుత్వమే ఉచితంగా రీడింగ్ గ్లాసెస్‌ను ఇవ్వడంతో పాటు వివిధ ఆపరేషన్లను ప్రభుత్వ ఖర్చుతో ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో చేయిస్తోంది.

16. పారిశ్రామిక సింగిల్ విండో చట్ట కింద 5,50,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించింది.

17. హోంగార్డులు, అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు, ‘ఆశా’ వర్కర్లు, ఐకెపి, సెర్ప్, గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు ఉద్యోగులు, 108 ఆంబులెన్స్ సిబ్బంది, 104 సిబ్బంది, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, విఆర్‌ఎలు, విఎఓలు, కాంట్రాక్టు లెక్చరర్లు, సిఆర్టిలు, అర్చకులు తదితర ఉద్యోగులందరి వేతనాలను పెంచింది.

Many welfare schemes implemented by the KCR government