Home జాతీయ వార్తలు మావోయిస్టు అగ్రనేత లొంగుబాటు

మావోయిస్టు అగ్రనేత లొంగుబాటు

Maoist Sudhakarహైదరాబాద్‌: మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్‌, ఆయన భార్య నీలిమ బుధవారం పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరి లొంగుబాటుపై  తెలంగాణ డిజిపి ముదిరెడ్డి మహేందర్‌రెడ్డి మీడియాకు వివరించారు. ఏడాదిగా వీరు లొంగిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని డిజిపి తెలిపారు. సుధాకర్‌ అలియాస్‌ సత్వాజీ స్వస్థలం నిర్మల్‌ జిల్లా సారంగాపూర్‌ అని ఆయన పేర్కొన్నారు. ఇంటర్‌ చదివే సమయంలో పీపుల్స్‌ వార్‌ ఉద్యమానికి సుధాకర్‌ ఆకర్షితులయ్యారని, కటకం సుదర్శన్‌ ప్రోద్బలంతో ఆయన ఆ పార్టీలో చేరారని డిజిపి చెప్పారు. తొలుత ఆయుధాలకు సంబంధించిన టెక్నికల్‌ కమిటీలో సుధాకర్‌ పని చేశారని, అనంతరం బెంగళూరు కేంద్రంగా ఆయన పనిచేశారని డిజిపి తెలిపారు. 1986లో సుధాకర్‌ను అరెస్ట్‌ చేసి 11 ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని డిజిపి వెల్లడించారు. 1989లో జైలు నుంచి విడుదలయ్యాక రైతు కూలీ సంఘంలో ఆయన పనిచేశారని , అప్పట్లో విరసం నేత వరవరరావు ఆధ్వర్యంలో రైతు కూలీ సంఘం చురుగ్గా పనిచేసేదని తెలిపారు. 1990 నుంచి ఇప్పటి వరకు అండర్‌ గ్రౌండ్‌లో ఉంటూ పని చేశారని, మావోయిస్టు గ్రూప్‌లో వివిధ హోదాల్లో సుధాకర్‌ పని చేశారని ఆయన తెలిపారు. సుధాకర్ పై కోటి రూపాయల రివార్డు ఉందని, ఆ రివార్డును సుధాకర్ కు అందిస్తామని డిజిపి పేర్కొన్నారు.

Maoist Leader Sudhakar Surrender to Police