Home ఆదిలాబాద్ ఆశలపల్లకీలో ఆశావహులు!

ఆశలపల్లకీలో ఆశావహులు!

తేలనున్న మార్కెట్ చైర్మన్ల రిజర్వేషన్లు

ఎటు చూసినా అవే చర్చలు
జనరల్ అభ్యర్థులను పీడిస్తున్న రిజర్వేషన్ల భయం!

chairమంచిర్యాల : ఏడాదిన్నరగా ఎదురు చూపులు…పదవిని పొందేందుకు, అధిష్ఠానం దృష్టిలో పడేందుకు పడ్డ ఆరాటం…ఎట్టకేలకు ఈ ప్రయత్నాలకు ఫలితం తేలే సమయం రానే వస్తోంది. మార్కెట్ కమిటీల సహా నామినేటెడ్ పోస్టులభర్తీ విషయంలో కెసిఆర్ ప్రకటన నేపథ్యంలో ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. మరో వైపు రిజర్వేషన్లు తమ అవకాశాలను ఎక్కడ కొల్లగొడతాయోనని అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
జిల్లాలో 17 మార్కెట్ కమిటీలు :
జిల్లాలో మొత్తం 17 మార్కెట్ కమిటీలు న్నాయి. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌నియోజకవర్గాల్లో కీలకంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో సాధారణంగానే మార్కెట్‌కమిటీల చైర్మన్ స్థానాలకు క్రేజ్ ఎక్కువగా కనబడుతుంది. తాజాగా ఈ పదవులను భర్తీ చేసే ప్రక్రియలో రిజర్వేషన్ల ప్రక్రియను అమలు చేసే యోచనలో ప్రభుత్వం అడుగులు వేస్తున్న నేపథ్యంలో అధికారులు ఆ వివరాలను సిధ్ధం చేసే పనిలో ఉన్నట్లు సమాచారం. జిల్లాలో మొత్తం 17 మార్కెట్ కమిటీలు ఉండగా ఇందులో ఇప్పటికే ఇంద్రవెల్లి,జైనూర్ మార్కెట్ కమిటీల్లోని స్థానాల భర్తీ విషయం న్యాయస్థానం వరకూ వెళ్ళింది. ఈ కమిటీల పరిధిలో గిరిజనులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వీటితో పాటు మరో స్థానాన్ని ఎస్టీలకు,ఒక స్థానాన్ని ఎస్సీలకు కేటాయించే అవకాశాలు కనబడుతున్నాయి.
ఒకవైపు ఆందోళన…మరో వైపు ప్రయత్నాలు :
ఆశావహుల్లో రిజర్వేషన్ల విషయంలో స్పష్టత రాకపోవడంతో తాము కోరుకున్న స్థానం విషయంలో కొంత ఆందోళన కనిపిస్తోంది.మరో వైపు తమవంతు ప్రయత్నాలు ఎవరికి వారు చేస్తూనే ఉన్నారు. ఒక్కో మార్కెట్ కమిటీకి ముగ్గురు నుండి నలుగురి వరకు పెద్ద మార్కెట్ కమిటీలైతే ఆపై ఎక్కువ మందే అభ్యర్థులు ప్రయత్నాల్లో ఉన్నారు. కేసిఆర్ వీటి భర్తీ విషయంలో శాసనసభ్యులకే ప్రాధాన్యమిస్తున్నట్లు తెలియడంతో అభ్యర్థులు అక్కడ తమ పరిస్థితిని బేరీజు వేసుకుంటూనే, మరింత మెరుగ్గా తమనుతాము వారి వద్ద చూయించుకునేందుకు, పార్టీలో తమవారితో ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఒకవైపు స్థానిక శాసన సభ్యుడి వద్ద ప్రయత్నాలను మొదలు పెడుతూనే,మరో వైపు రాష్ట్ర రాజధాని వైపు దృష్టి సారిస్తున్నారు. ఉద్యమ సమయంలో ఉద్యమంలోనూ,పార్టీ కార్యక్రమాల్లోనూ కీలకంగా వ్యవహరించిన వారు ఆ నాటి తమ పనితీరును అధిష్ఠానం వద్ద వివరిస్తూ తమకు అనుకూలంగా ఉన్న పరిస్థితులను వివరించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి ఏడాదిన్నర అనంతరం మార్కెట్ కమీటీల పదవుల నియామకం వ్యవహారం తెరపైకి రావడంతో క్షేత్రస్థాయిలో రాజకీయాలు ఊపందుకున్నాయి.