Home తాజా వార్తలు ఎట్టకేలకు లాభాలు…

ఎట్టకేలకు లాభాలు…

Markets

 

ముంబై : వరుసగా తొమ్మిది రోజులుగా నష్టాల తర్వాత ఎట్టకేలకు మంగళవారం మార్కెట్లు లాభాలను అందించాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 275 పాయింట్ల లాభంతో 37,366 వద్ద స్థిరపడింది. ఇక 92 పాయింట్లతో నిఫ్టీ 11,240 పాయింట్ల వద్ద ముగిసింది. ఇన్వెస్టర్ల కొనుగోళ్లు, కనిష్టాలకు చేరిన కౌంటర్లలో ట్రేడర్ల షార్ట్‌కవరింగ్ మార్కెట్లకు జోష్‌నిచ్చినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. సెన్సెక్స్ ఇంట్రాడేలో 37,873- నుంచి 36,956 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాలు ముదురుతున్న పరిస్థితులతో సోమవారం అమెరికా మార్కెట్లు భారీగా పతనమయ్యాయి.

అయితే తొలుత ఈ ప్రభావం దేశీయ మార్కెట్లపై కనిపించినా ఆఖరి సమయంలో కోలుకుని లాభాల్లో సాగాయి. ఫార్మా కంపెనీల షేర్లు పుంజుకోవడంతో మార్కెట్ కుదుటపడింది. ప్రధానంగా సన్ ఫార్మా, వేదాంతా, ఐసిఐసిఐ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, ఐటిసి షేర్లు అత్యధికంగా లాభపడ్డాయి. యూరోపియన్ కమిషన్ నుంచి ప్రతికూల స్పందన రావడంతో టాటాస్టీల్స్ షేర్లు నష్టపోయాయి. జెట్ ఎయిర్‌వేస్ షేర్లు 10 శాతం డౌన్ అయ్యాయి. బిఎస్‌ఇ మిడ్, స్మాల్ క్యాప్స్ లాభపడ్డాయి. ట్రేడైన మొత్తం షేర్లలో 1,224 లాభపడగా, 1,282 నష్టాలతో ముగిశాయి. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పిఐలు) సోమవారం రూ. 1056 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా, దేశీ ఫండ్స్(డిఐఐలు) రూ.1058 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశాయి.

Markets have made profits