Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

నాలుగో రోజూ లాభాల్లో మార్కెట్లు

STock

 క్యూ1 ఫలితాలతో 5.47శాతం పెరిగిన టిసిఎస్ షేర్లు
ముంబయి: బాంబే స్టాక్ ఎక్స్‌ఛేంజ్ ప్రామాణిక సూచీ సెన్సెక్స్ బుధవారం 26 పాయింట్లు పెరిగి 36,265 వద్ద ముగిసింది. ఐటి దిగ్గజం టిసిఎస్ తొలి త్రైమాసిక ఫలితాలు అనుకున్నదాని కంటే మెరుగ్గా ఉండటంతో దేశీ మార్కెట్లు లాభాల్లోనే ముగిశాయి. దేశం నుంచి సాఫ్ట్‌వేర్‌ను అత్యధికంగా ఎగుమతి చేసే టిసిఎస్ కంపెనీ జూన్ త్రైమాసిక ఫలితాల్లో 23.4 శాతం ఏకీకృత నికర లాభం పెరుగుదలను కనబరిచింది. దీంతో స్టాక్‌మార్కెట్‌లో టిసిఎస్ షేరు 5.47 శాతం పెరిగి జీవితకాల గరిష్ఠం రూ. 1,979.60ను చేరింది. నాలుగో రోజూ లాభాల బాటన స్టాక్ మార్కెట్లు పయనించడంతో 30 ప్రధాన షేర్ల సెన్సెక్స్ సూచీ ఆరంభంలోనే ఆశావాహంతో మొదలయింది. మదుపరులు కొనుగోళ్లకు దిగారు. దాంతో మార్కెట్ ఊపందుకోవడంతో సెన్సెక్స్ సూచీ 36,362.30 గరిష్ఠాన్ని తాకింది. అయితే తర్వాత మదుపరులు లాభాల స్వీకరణకు పాల్పడ్డంతో కొంత పట్టును కోల్పోయి 36,169.70 కనిష్ఠాన్ని తాకింది. చివరికి 26.31 పాయింట్ల పెరుగుదలతో 36,265.93 వద్ద ముగిసింది. కాగా 50 ప్రధాన షేర్ల ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ సైతం కేవలం 1.05 పాయింట్ పెరుగుదలతో 10,948.30 వద్ద ముగిసింది. నిఫ్టీ 10,976.65 నుంచి 10,923 మధ్య కదలాడింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఒకరకమైన స్తబ్ధత మార్కెట్‌లో కనిపించింది. ఇదిలా ఉండగా తాత్కాలిక సమాచారం(ప్రావిజనల్ డేటా) ప్రకారం దేశీ సంస్థాగత మదుపరులు(డిఐఐలు) మంగళవారం 293.96 కోట్ల విలువచేసే ఈక్విటీలు కొనగా, విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపరులు(ఎఫ్‌పిఐలు) రూ. 20.73 కోట్ల షేర్లను అమ్మారు.

Comments

comments