Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

మేథోనైపుణ్యం ప్రగతికి సోపానం

lfe

భవిష్యత్తులో యుద్ధాలు ఆయుధాలతో కాదు.. మానవ మెదళ్లతో జరుగుతాయి. ఎవరైతే మేధో నైపుణ్యాలు పెంపొందించుకుంటారో వారే అత్యధిక ప్రయోజనాలు పొంది చివరికి విజేతలుగా నిలుస్తారు” అని మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు అన్న మాటలు పదేపదే గుర్తు చేసుకోవడం అవసరం.
1995 నవంబర్ 18న కేరళలోని తిరువనంతపురంలో దేశంలోనే మొదటిసారిగా ఎలక్ట్రానిక్ టెక్నో పార్కును ప్రారంభించిన సందర్భంగా ఈ మాటలు అన్నారు. ఇది ముమ్మాటికి వాస్తవం. మన దేశంలో డిగ్రీ పట్టాలు పుచ్చుకున్న విద్యార్థులు లక్షల్లో ఉన్నారు. కానీ వీరిలో ఎంతమందికి నైపుణ్యం ఉందని పరిశీలిస్తే చాలా తక్కువ శాతం కనిపిస్తారు. దీనికి ఉదాహరణగా 2007లో ఐసిఐసిఐ బ్యాంకు సిబ్బంది నియామకాలను ప్రస్తావించవచ్చు. దరఖాస్తు దారులు సుమారు 7.5 లక్షల మందిలో కేవలం 17,500 మంది నైపుణ్యం ఉన్న యువత మాత్రమే ఎంపిక అయ్యారు. అలాగే బయోటెక్నాలజీ రంగానికి సంబంధించి నైపుణ్యం లేని యువతే డిగ్రీ పట్టాలు అధికంగా పొందుతున్నారు. సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ రంగాల్లోనూ ఇదే పరిస్థితి. ఇవన్నీ పరిశీలించి 20102020 దశాబ్దం ఆవిష్కరణల దశాబ్దంగా మనదేశం ప్రకటించింది. యువత సైన్స్, టెక్నాలజీ రంగంలో ఆసక్తితో పరిశోధనలు సాగించడానికి వీలుగా 2010 లో క్యూరీ (కన్సాలిడేషన్ ఆఫ్ యూనివర్శిటీ రీసెర్చి ఇన్నొవేషన్ అండ్ ఎక్స్‌లెన్స్) అన్న పేరుతో పథకం ప్రారంభించారు. అయినా సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధికి పరిశోధనలు చేయడంలో యువత చొరవ తీసుకోవడం లేదు. దీనికి అనేక కారణాలు ఉన్నా యువత ఆలోచనల్లో మార్పు అవసరం. గతంలో ఆనాటి యువత ఇదే విధంగా భయపడి వెనకాడితే ఈ న్యూక్లియర్, స్పేస్ టెక్నాలజీ , ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, కెమికల్ అండ్ మెడికల్ టెక్నాలజీ పరంగా పురోభివృద్ధి ఉండేది కాదు. ఆనాటి యువత శాస్త్రవేత్తలుగా సాగించిన పరిశోధనల కృషిని గమనిస్తే ఎన్నో విశేషాలు తెలుస్తాయి.
జర్మనీకి చెందిన మార్టిన్ క్లా ప్రోత్ 1798 లో యురేనియం మూలకాన్ని కనుగొన్నాడు. అదే దేశానికి చెందిన లివ్ హెల్మ్ కొన్రాడ్ రొంటెజెన్ 1895లో ఎక్స్‌రే కనుగొనగలిగాడు. ఫ్రాన్స్‌కు చెందిన ఆంటోనీ హెన్రీ బెక్వెరెవ్ 1896లో యురేనియం మూలకంలో రేడియో యాక్టివిటీని కనుగొన్నాడు. పోలాండ్ దేశస్తులు క్యూరీ దంపతులు 1898 డిసెంబర్ 26న రేడియం కనుగొన్నారు. వీరిద్దరూ హెన్రిబెక్వెరల్‌తో కలిసి నేచురల్ రేడియో యాక్టివిటీని కనుగొన్నందున 1903లో ఫిజిక్స్‌లో నోబెల్ బహుమతి లభించింది. మేరీక్యూరీ తన భర్త చనిపోయినా అధైర్యపడలేదు. పరిశోధనలు కొనసాగించి పోలోనియం, థోరియం కనుగొనగలిగారు. ఈ కారణంగా ఆమెకు 1911లో కెమెస్ట్రీలో నోబెల్ బహుమతి లభించింది. ఈ విధంగా ఆమె చిన్న వయస్సులోనే 29 సంవత్సరాల వయసులో, అలాగే 44 ఏళ్ల వయసులో కొత్త మూలకాలను పరిశోధించడం, మరికొన్ని పదార్థాలను ఆవిష్కరించి శాస్త్రజ్ఞానంలో ఆదర్శమూర్తిగా నిలిచారు. 1932లో బ్రిటన్ శాస్త్రవేత్త జేమ్స్ చాద్విక్ న్యూట్రాన్‌లను కనుగొన్నారు. 1934 లో మేరీ క్యూరీ కుమార్తె ఐరెనెక్యూరీ, అల్లుడు ఫ్రెడరిక్ క్యూరీ ఆర్టిఫిషియల్ న్యూక్లియర్ ఐసోటోప్‌లను రూపొందించారు. ఈ విధంగా వీరు ఆర్టిఫిషియల్ రేడియో యాక్టివిటీని కనుగొన్నందుకు 1935లో కెమిస్ట్రీలో నోబెల్ లభించింది. ఎన్రికోఫెర్నీ అనే శాస్త్రవేత్త 1942 డిసెంబర్ 2న చికాగో యూనివర్శిటీలో న్యూక్లియర్ రియాక్టర్‌ను డిజైన్ చేసి చైన్ రియాక్షన్‌తో సుమారు 30 నిముషాలు రియాక్టర్‌ను పనిచేయించారు. ఈ సంఘటన న్యూక్లియర్ టెక్నాలజీ అభివృద్ధికి గొప్ప మలుపుగా చరిత్రలో నిలిచింది. ఇలా ఎందరో శాస్త్రవేత్తలు తమ పరిశోధనలతో భవిష్య తరానికి ఆదర్శంగా నిలిచారు. ఇదే బాటలో నేటి యువత శాస్త్రీయ పరిజ్ఞానంపై ఆసక్తి పెంపొందించుకొని పరిశోధనలు సాగించడానికి ముందడుగు వేయడం అవసరం.

Comments

comments