Home తాజా వార్తలు నాలుగోసారి ఉత్పత్తిని తగ్గించిన మారుతీ

నాలుగోసారి ఉత్పత్తిని తగ్గించిన మారుతీ

Maruti Suzuki

 

న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద కారు తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా వరుసగా నాలుగోసారి వాహనాల ఉత్పత్తిని తగ్గించింది. మే నెలలో 18 శాతానికి పైగా వాహనాల ఉత్పత్తిని తగ్గించినట్టు కంపెనీ ప్రకటించింది. మే నెలలో కంపెనీ 1,51,188 యూనిట్ల ఉత్పత్తి చేపట్టింది. అయితే గతేడాదిలో ఇదే సమయంలో 1,84,612 యూనిట్ల ఉత్పత్తితో పోలిస్తే ఈసారి 18.1 శాతం తగ్గింది. ఈమేరకు మారుతీ సుజుకీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. సూపర్ క్యారీ మినహా కంపెనీ ఇతర విభాగాల్లో అన్ని ఉత్పత్తులను తగ్గించింది. ఇందులో భారీగా అమ్ముడుపోయే కాంపాక్ట్, మినీ కార్స్ కూడా ఉన్నాయి. అల్టో, స్విఫ్ట్, డిజైర్ సహా ప్రయాణికుల వాహనాల ఉత్పత్తి 18.88 శాతం తగ్గించింది. 2018 మే నెలలో 1,82,571 యూనిట్లతో పోలిస్తే 1,48,095 యూనిట్లకు చేరింది. అమ్మకాలు ఆశించిన మేరకు లేకపోవడంతో వాహన తయారీ సంస్థలు ఉత్పత్తిని తగ్గించుకున్నాయి. గత వారం మహీంద్రా అండ్ మహీంద్రా కూడా 13 రోజుల వరకు ప్లాంట్లలో ఉత్పత్తిని నిలిపివేసింది. ఈ సంస్థకు ఏప్రిల్‌లో దేశవ్యాప్తంగా సేల్స్ 17 శాతం తగ్గాయి.

Maruti Suzuki cuts production for the fourth time