Home అంతర్జాతీయ వార్తలు మంచం పట్టిన మసూద్ అజర్?

మంచం పట్టిన మసూద్ అజర్?

ఏడాదిన్నరగా వెన్నుపూస, మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్న జైషే చీఫ్
తమ్ముళ్ల చేతిలో సంస్థ కార్యకలాపాలు, ఇంటెలిజెన్స్ వర్గాల వెల్లడి

Masood

న్యూఢిల్లీ: పాక్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ వ్యవస్థాపకుడు, కరుడుగట్టిన ఉగ్రవాది మసూద్ అజర్ ప్రాణాంతక అనారోగ్యంతో చాలాకాలంగా మంచానికే పరిమితమైనాడని, ఈ నిషేధిత ఉగ్రవాద సంస్థ కార్యకలాపాలు ఇప్పుడు అతని ఇద్దరు తమ్ముళ్లు రసఫ్ అస్గర్, అతర్ ఇబ్రహీంలు చూసుకుంటున్నారని, ఈ రెండు వర్గాలు ఇప్పటికీ భారత్, అఫ్ఘానిస్థాన్‌లపై దాడులను కొనసాగిస్తున్నాయని భారత ఇంటెలిజన్స్ అధికారులు చెబుతున్నారు. 50ఏళ్ల అజర్ వెన్ను పూస, మూత్రపిండాలకు సంబంధించిన జబ్బులతో బాధపడుతున్నాడని చెప్పిన ఆ అధికారులు అంతకు మించి వివరాలు చెప్పడానికి నిరాకరించారు.

రావల్పిండిలోని కంబైండ్ మిలిటరీ ఆస్పత్రిలో అజర్‌కు ఈ వ్యాధులకు సంబంధించి చికిత్స అందిస్తున్నారని, దాదాపు ఏడాదిన్నరగా ఆయన మంచానికే పరిమితమైనాడని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఇంటెలిజన్స్ అధికారులు చెప్పారు. భారత దౌత్య అధికారులు అజర్ అనారోగ్యంతో ఉన్న విషయాన్ని ధ్రువీకరించలేదు కానీ, ఆయన చాలా కాలంగా తన సొంత ఊరు భావల్‌పూర్‌లో కానీ, పాకిస్తాన్‌లో ఎక్కడ కానీ బహిరంగంగా జనానికి కనిపించలేదని అంటున్నారు. ఒక వేళ ఈ వార్తలేగనుక నిజమైతే భారత్ పని సులువవుతుందని, ఎందుకంటే అమెరికా అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించబడిన మసూద్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నట్లయితే అతడ్ని ఐరాస అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించే విషయంలో అడ్డుపడుతున్న చైనాకు భారత్ ఎలాంటి రాయితీలు ఇవ్వాల్సిన అవసరం ఉండదని ఢిల్లీలోని కౌంటర్ టెర్రరిజం విభాగానికి చెందిన సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. అజర్ మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలని ఐక్యరాజ్యసమితిలో ఇటీవల భారత్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని పాక్‌కు మిత్ర దేశమైన చైనా అడ్డుకున్న విషయం తెలిసిందే.

భారతీయ గడ్డపై జరిగిన పలు ఉగ్రవాద దాడులకు కరుడు గట్టిన ఉగ్రవాది అయిన మసూద్ బాధ్యుడని భారతీయ అధికారులు చెప్త్తున్నారు. 2001లో పార్లమెంటుపై జరిగిన దాడి, 2005లో అయోధ్యలో జరిగిన దాడి, 2016లో పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై జరిపిన ఉగ్రవాద దాడి వీటిలో ప్రధానమైనవి. ఈ దాడులన్నీ కూడా పాక్షికంగా విజయవంతమయినప్పటికీ భారత్ పాకిస్తాన్‌పై సాయుధ చర్య తీసుకునేలా చేయడంలో, దేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టడం ఈ దాడుల ప్రధాన లక్షమని కూడా వారంటున్నారు.1999లో ఎయిర్ ఇండియా విమానాన్ని కాందహార్‌కు హైజాక్ చేసినప్పుడు ఆ విమాన ప్రయాణికులను విడిచిపెట్టడం కోసం జైల్లో ఉన్న మసూద్‌ను విడిచిపెట్టి కాందహార్‌కు తీసుకెళ్లి హైజాకర్లకు అప్పగించడం తెలిసిందే.

ఆ హైజాక్‌కు అప్పటి తాలిబన్, అల్‌ఖైదా చీఫ్‌లతో పాటుగా పాక్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ మద్దతు ఉంది. ప్రస్తుతం ఖైబర్ ఫక్తూన్‌ఖ్వా ప్రాంతంనుంచి అఫ్గానిస్థాన్, బలూచిస్థాన్‌లలో ఉగ్రవాద దాడులు కొనసాగిస్తున్న అతర్ ఇబ్రహీం ఆ హైజాక్ కు బాధ్యుడని ఆ అధికారులు అంటున్నారు. మసూద్ మరో సోదరుడు రౌఫ్ అస్గర్ భారత్‌లో ముఖ్యంగా జమ్మూ, కాశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాల బాధ్యతలు చేపట్టినట్లు చెప్తున్నారు. ట్రంప్ ప్రభుత్వంతో పాటుగా ఐక్యరాజ్య సమితికి చెందిన కమిటీ అస్గర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించేలా చేయడానికి తీసుకోవలసిన చర్యలపై భారత్, అమెరికాలు ఇప్పుడు చర్చిస్తునాయని ఇంటెలిజన్స్ అధికారులు చెప్తున్నారు.