Home మల్కాజ్‌గిరి (మేడ్చల్) మేడ్చల్‌లో భారీ చోరీ

మేడ్చల్‌లో భారీ చోరీ

పండగకు పల్లెకు పోతే ఇళ్లు గుల్ల
14 తులాల బంగారు ఆభరణాలు,
రూ. 50 వేల నగదు అపహరణ

THEFT-10

మనతెలంగాణ/మేడ్చల్: సంక్రాంతి పండగకు కుటుం బసభ్యులతో ఆనందంగా గడపటానికి పల్లెకు పోతే తాళం పగులగొట్టి ఇళ్లను గుల్లచేసిన సంఘటన సోమ వారం మేడ్చల్‌లో జరిగింది. ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్ పట్టణంలోని ఉమా నగర్‌కాలనీలోని శశిసమ్యగ్ అపార్ట్‌మెంట్‌లో నివాస ముంటున్న ఓరుగంటి ప్రభాకర్‌గౌడ్ ఈ నెల 13వ తేదీ న తాను నివాసముంటున్న ఇంటికి తాళంవేసి తన కుటుంబసభ్యులతో కలిసి స్వగ్రామానికి వెళ్లాడు. కాగా ఆదివారం రాత్రి గుర్తుతెలియని దుండగులు అపార్ట్‌మెం ట్‌లోకి చొరబడి అపార్ట్‌మెంట్‌లోని నాలుగు ఇళ్లల్లో చోరీ కి పాల్పడ్డారు. శశిసమ్యగ్ అపార్ట్‌మెంట్‌లోని ఏ బ్లాక్ లోని 102, 104 బి బ్లాక్‌లోని 101,103లలో చోరీ చేశారు. అందులో 102 ఫ్లాట్ ఓరుగంటి ప్రభాకర్‌గౌడ్ ఇంట్లో 14తులాల బంగారు ఆభరణాలు, 50వేల నగదు అపహరణకు గురైంది. అదేవిధంగా 101 ప్లాట్‌లో నివాసముంటున్న మామిడి వెంకట్రామ్‌రెడ్డి ఇంట్లో 40తులాల వెండి ఆభరణాలు, 103 ఫ్లాట్‌లో నివాసముంటున్న ప్రభుదాస్‌గౌడ్ ఇంట్లో నుండి సుమారు 50తులాల వెండి వస్తువులు అపహరణకు గురైనట్లు తెలిపారు. దీంతో పాటు 104 ఫ్లాట్‌లో దుండ గులు చొరబడినప్పటికీ అందులో ఏం పోలేదని వస్తువులు చిందరవందరగా పడేశారని తెలిపారు. బాధి తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు.
సంఘటన స్థలంలో క్లూస్ సేకరించిన క్లూస్ టీమ్
సమాచారం అందుకున్న వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న క్లూస్ టీమ్ సిబ్బంది చోరీ జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. రంగం లోకి దిగిన క్లూస్ టీమ్‌లు చోరీ జరిగిన నాలుగు ఇళ్లల్లో ఆధారాలను సేకరించారు.
సిసి కెమెరాలు లేకపోవడమే దుండగులకు అవకాశం
సిసి కెమెరాలు లేకపోవడంతోనే చోరీకి పాల్పడేందుకు దొంగలకు మంచి అవకాశంగా దొరికింది. చోరీ జరిగిన శశి సమ్యగ్ అపార్ట్‌మెంట్‌లో ఏ, బి బ్లాక్‌లో రెండింటిలో సుమారు 40 గృహాలు ఉన్నప్పటికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకపోవడం దుండగులకు అదునుగా మారిందని స్థానికులు వాపోతున్నారు. 40 కుటుంబాలు నివాసముంటున్న అపార్ట్‌మెంట్‌లకే భద్రత లేకపోతే పట్టణ శివారులోని విడిగా ఉండే ఇళ్లకు రక్షణ ఎలా అని పలువురు భయాందోళనకు గురవుతున్నారు. కొంత నిఘా పెంచి ప్రజలకు రక్షణ కల్పించాలని పలువురు కోరుతున్నారు.
అపార్ట్‌మెంట్‌లలో తప్పనిసరిగా సీసీ కెమెరాలు అమర్చాలి : సిఐ రాజశేఖర్‌రెడ్డి
పండుగలకు ఊర్లలోకి వెళ్లే ముందు పోలీస్‌స్టేషన్‌లో సమాచారం అందించాలని పండుగకు ముందు నుండే నగరంలో ప్రచారం నిర్వహించినప్పటికి ఎవరి నుండి స్పందన రాలేదన్నారు. పట్టణంలోని అపార్ట్‌మెంట్‌లు, దుకాణాల సముదాయాల, ఖరీదైన ఇళ్లకు తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తే చాలా వరకు దొంగతనాలను అరికట్టవచ్చునని తెలిపారు. ఇప్పటికి ప్రజలు అప్రమత్తమై ముందుకు వచ్చి సీసీ కెమెరాల ఏర్పాటుకు పోలీస్‌లకు సహకరించాలని ఆయన కోరారు.