Thursday, April 25, 2024

మున్సిపాల్టీలకు మాస్టర్ ప్లాన్

- Advertisement -
- Advertisement -

Master plan for the development of Municipalities

అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు పురపాలక శాఖ నూతన ప్రణాళికలు
రోడ్లు, డ్రైనేజీలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని అధికారుల నిర్ణయం

రాష్ట్రంలోని పట్టణాల్లో కనీస మౌలిక సదుపాయాలను కల్పించడానికి, రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి వసతులను కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం మాస్టర్‌ప్లాన్‌ను సిద్ధం చేస్తోంది. భారీ వర్షాలు కురిసినప్పటికీ పట్టణాలు, మున్సిపాలిటీలు, నగరాల్లో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆధునిక వసతులతో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు పురపాలక శాఖ అధికారులు సమాయత్తం అవుతున్నారు. రానున్న ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి మున్సిపాలిటీల్లో సకల సదుపాయాలను కల్పించడానికి వీలుగా కార్యాచరణను రూపొందిస్తున్నారు. పట్టణ ప్రగతి కింద ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ.2,062 కోట్లను విడుదల చేయగా పురపాలక శాఖ నగరాలు, పట్టణాల అభివృద్ధికి చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా పలు మున్సిపాలిటీల అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్‌లను రెడీ చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా రూ.858 కోట్ల వ్యయంతో 15 ప్యాకేజీల కింద 49 నాలా అభివృద్ధి ప్రాజెక్టు పనులను చేపట్టగా, 2,067 పట్టణ ప్రకృతి వనాలు, 400 కిలోమీటర్ల మేర రహదార్ల వెంట మల్టీలెవల్ అవెన్యూ ప్లాంటేషన్ పనులను పురపాలక శాఖ చేపట్టింది.

వరంగల్‌లో వ్యర్థాల బయోమైనింగ్ ప్రాజెక్టుతో పాటు పట్టణాల్లో బయోమైనింగ్, ప్రాసెసింగ్ ప్లాంట్లు, ఎఫ్‌ఎస్‌టిపిలు పూర్తి చేయాలన్న దృఢసంకల్పంతో పురపాలకశాఖ ముందుకెళుతోంది. 38 పట్టణాల్లో రూ.1,433 కోట్లతో నీటి సరఫరా పథకాలు రూ.700 కోట్ల వ్యయంతో సమీకృత శాఖాహార, మాంసాహార మార్కెట్లు, ఓఆర్‌ఆర్ వెంట మీడియన్, అవెన్యూలపై ఆటోమేటెడ్ బిందు సేద్యం, రూ.61 కోట్లతో మెహిదీపట్నం, ఉప్పల్‌లో స్కైవాక్ నిర్మాణాలతో పాటు కొత్వాల్‌గూడ సమీపంలో 85 ఎకరాల స్థలంలో ఎకో పార్క్ ఏర్పాటు, కోకాపేట నియోపోలిస్ వద్ద గ్రీన్ ఫీల్డ్ టౌన్‌షిప్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు చేయడానికి పురపాలక శాఖ నిధులను కేటాయించింది.

మౌలిక వసతుల అభివృద్ధి జరగకపోవడంతో..

వీటితోపాటు భారీ వర్షాలకు పలు మున్సిపాటీలు, నగర పాలక సంస్థలు అతలాకుతలం అవుతున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల డ్రైనేజీ వ్యవస్థతో పాటు రోడ్లను అభివృద్ధి చేయడానికి పురపాలక శాఖ మాస్టర్‌ప్లాన్‌లను రూపొందిస్తోంది. అందులో భాగంగా అన్ని మునిసిపాలిటీల్లో జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టం (జీఐఎస్) ఆధారిత మాస్టర్‌ప్లాన్‌లను రూపొందించడానికి పురపాలక శాఖ సమాయత్తం అవుతోంది. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఈ మాస్టర్ ప్లాన్లు రూపొందించేందుకు పురపాలక శాఖ ప్రయత్నాలు ప్రారంభించిందని ఆ శాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. రెండు సంవత్సరాలుగా రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు మునిసిపాలిటీల్లోని డ్రైనేజీలు పొంగిపొర్లుతున్న విషయం తెలిసిందే. దీనికి కారణం ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కువ శాతం పట్టణాల్లో మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి మౌలిక వసతుల అభివృద్ధి జరగకపోవడమే ప్రధాన కారణమని పురపాలకశాఖ అధికారులు గుర్తించారు.

జోన్‌లుగా విభజించి మ్యాపులు..

దీనికిగాను పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో జీఐఎస్ ఆధారిత మాస్టర్‌ప్లాన్లను రూపొందించాలని పురపాలక శాఖ నిర్ణయించింది. పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త మునిసిపాలిటీలు, కార్పొరేషన్లను గుర్తిస్తోంది. అయితే వీటిలో ఒక క్రమపద్ధతిలో అభివృద్ధి జరిగితే భవిష్యత్ తరాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని పురపాలక శాఖ అధికారులు భావించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో పక్కాగా మాస్టర్ ప్లాన్‌ను అమలు చేయాలని పురపాలక శాఖ నిర్ణయించింది. దీనికోసం అత్యాధునిక జీఐఎస్ సాంకేతికతను వాడి పురపాలికలను జోన్‌లుగా విభజించి మ్యాపులు తయారు చేయాలని ఆ శాఖ అధికారులు నిర్ణయించారు.

రెసిడెన్షియల్, వాణిజ్య, బఫర్ లేదా గ్రీన్‌జోన్లుగా..

మాస్టర్‌ప్లాన్ ప్రకారం రెసిడెన్షియల్, వాణిజ్య, బఫర్ లేదా గ్రీన్ జోన్లుగా విభజించి రోడ్లు, డ్రైనేజీలకు సంబంధించి ఆయా ప్రాంతాల అవసరాలకు తగ్గట్లు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని పురపాలక శాఖ నిర్ణయించింది. వీటికి తోడు క్రీడా మైదానాలు, ఎగ్జిబిషన్‌లతో పాటు ప్రజలకు ఉపయోగపడే వాటిని గుర్తిస్తారు. ఈ జోన్లలను జీఐఎస్‌తో అనుసంధానించి భవిష్యత్ అవసరాలకు తగ్గట్లు మునిసిపాలిటీల్లో మౌలిక వసతులు అభివృద్ధి చేయనున్నారు. తొలుత రాష్ట్రంలోని 17 మునిసిపాలిటీల్లో జీఐఎస్ ఆధారిత మాస్టర్ ప్లాన్‌లను తయారు చేయడంతో పురపాలకశాఖ ఇప్పటికే బిజీగా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే స్థానిక ప్రజా ప్రతినిధులతో చర్చించడంతో పాటు సీనియర్ అధికారుల సలహాలు తీసుకున్న తరువాతే తుది మాస్టర్‌ప్లాన్‌కు రూపకల్పన ఉంటుందని ఆ శాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News