Home కలం విప్లవ దీక్షాదినం మేడే

విప్లవ దీక్షాదినం మేడే

May-Day

చికాగో నగరంలో పని గంటల తగ్గింపు కోసం కార్మికులు జరిపిన పోరాటానికన్నా 24 సంవత్సరాల మునుపే భారతదేశం లో 1862 ఏప్రిల్, మే మాసాలలో రైల్వే కార్మికులు పని గంటల తగ్గింపును కోరు తూ హౌరా స్టేషన్ వద్ద సమ్మె చేశారు. లోకమాన్య బాలగంగాధర్ తిలక్‌ను దేశద్రోహ నేరంకింద అరెస్టు చేసినందు కు నిరసనగా 1908లో బొంబాయి నగరంలో కార్మికులు జరిపిన సమ్మె భారతదేశంలో కార్మికులు నిర్వహించిన తొలి రాజకీయ సమ్మె. కార్మిక ఉద్యమా లు దేశ వ్యాప్తంగా జరుగుతూనే ఉన్నా యి. అయితే సరియైన నాయకత్వం క్రమమైన ఆలోచన ధోరణి లేకపోవడం వలన పాలక వర్గాల నిరంకుశ విధానాల వలన ఇవ న్నీ నామమాత్రమైనాయి. ఈ నేపథ్యంలో 1919 సంవత్సరంలో భారతదేశంలో అఖిల భారత కార్మికసంఘాల సమాఖ్య (ఎఐటియుసి) ఏర్పడింది. ఈ సంస్థ నాయకత్వంలో మార్గదర్శ కత్వంలో కార్మిక పోరాటాలు దేశంలో తీవ్రతరమైనాయి. భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ (డిసెంబర్ 1925) కన్నా ముందుగా ఎఐటియుసి ఆవిర్భవించడానిగా కార్మిక వర్గం చైతన్యానికి ప్రతీకగా పేర్కొనవలసి ఉంది. తెలుగు నాట కూడా మే డే 1934న ఆవిర్భవించిన కమ్యూనిస్ట్ పార్టీ దాని అనుబంధ కార్మిక సంఘాల నాయకత్వంలో కార్మికోద్యమా లు బలపడినాయి. శ్రమ జీవుల హక్కుల కోసం, జీవన ప్రమాణాల మెరుగు కోసం కృషి చేశాయి. తెలుగు నాట 1943 ఫిబ్రవరి 13,14 తేదీలలో ఆవిర్భవించిన అభ్యుదయ రచయితల సంఘం కష్ట జీవికి కుడిఎడమల బాసటగా నిలిచింది. కమ్యూనిస్ట్ ఉద్యమ స్ఫూర్తితో, మే డే అందించిన ప్రాపంచిక దృక్పథంతో తెలుగు సాహితీ వేత్తలు విస్తృతంగా సాహిత్యాన్ని సృజించారు.

మే డే సాహిత్యం
ప్రపంచ సాహితీ లోకానికి స్ఫూర్తి నందించిన మే డే మన అభ్యుదయ కవులను ఎంతగానో ప్రభావితం చేసింది. మే డేను కీర్తిస్తూ పులుపుల వెంకట శివయ్య, కె రామశర్మ, సుంకర సత్యనారాయణ, రెంటాల గోపాల క్రిష్ణ, గజ్జెల మల్లారెడ్డి, ఎస్వీ సత్యనారాయణ, అదృష్ట దీపక్ తదితరులు గేయాలను అందించారు.
‘మే దినోత్సవం మేలుకొల్పున మానవ శక్తులు మహాగ్ని శిఖలై
దాస్యం దోపిడి దుఃఖ పూరితము యుద్ధ పీడితము
యూరపు నలమిన కాళరాత్రినీ కబళించినదీ!’
‘ప్రజా రాజ్యమును స్థాపన చేయగ ఎగురవేసినది విజయ పతాకము మే దినోత్సవం’ అని పులుపుల వెంకట శివయ్య మే డేను కీర్తించారు.
‘పీడిత లోకం తాడిత లోకం నూతన మానవ భూతల స్వర్గం నెలకొల్పుటకు నిజ రక్తంలో స్నానం చేసింది ఈనాడే, శంకు స్థాపన ఈనాడే’ అని ప్రజా కవి సుంకర గానం చేశారు.
‘ఆకలిలేని, అశాంతిలేని, పీడనలేని మా నిర్మించే నవయుగ మ్మునకు మా అన్నల, మృత వీరుల రక్తంలో ఆర్ద్రమై, అరుణమై, పునీతమై, ‘మే’ ప్రసవించిన తొలి ప్రభాతమా!’ అని అభ్యుదయ కవి కె. రామశర్మ విజయ దుందుభి మోగించారు.
“కార్మికులంతా ఏకంకండని కదన శంఖమును ఊదింది, విప్లవ మంటే అదిరిన వాళ్లు విదేశీయమని బెదిరిన వాళ్లు శ్రామిక రాజ్యపు అండదండలే చల్లని నీడగ తలచారంటూ – మేడే పండుగ వచ్చింది, ఎర్రని జెండా ఎగిరింది” అని గజ్జెల మల్లారెడ్డి తన గేయంలో వివరించారు.
‘శ్రామిక లోకపు సౌభాగ్యానికి సందేశం ఈ మేడే, సామ్యవాద నవ నిర్మాణానికి సంకేతం ఈనాడే’ అని ఎస్వీ సత్యనారాయణ రాయగా, మరో అభ్యుదయ కవి అదృష్ట దీపక్ ‘లోకానికి శ్రమ విలువను చాటిన రోజు మేడే’ అని కీర్తించారు.
మే డే ఉద్యమంలో చిందించిన రక్తం నుంచి ఆవిర్భవించిన ఎర్ర జెండాపై అరసం నిర్మాత తుమ్మల వెంకట రామయ్య,‘ఎగరాలి ఎగరాలి మన ఎర్ర జెండా, అదురు బెదురూ లేక అడ్డేది యును లేక, సామ్రాజ్య వాదంబు సమసిపోవంగా, ధనిక వాదంబెల్ల దగ్ఢమైపోవ …” అని తొలి ఎర్ర జెండా కవిగా చరిత్రలో నిలిచారు. పెండ్యాల లోకనాథం ‘కూలీ లందరూ ఏకమైతే కూటికి తరుగేమిరా’ అని కార్మికుల పక్షం నిలిచారు. తెలుగులో అభ్యుదయ రచయితలు అన్ని సాహిత్య ప్రక్రియలు శ్రమ జీవుల పక్షాన కలాలు సంధించారు.
“శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనేలేదని …” గానం చేస్తూ, “సహస్ర వృత్తుల సమస్త చిహ్నాల” ను శ్రీశ్రీతోపాటు అందరూ గౌరవించారు. ఆ పథంలో అభ్యుదయ రచయితలు కొనసాగుతూనే ఉన్నారు.మే దినం యొక్క విప్లవ లక్షణాలను గౌరవిస్తూ మే దినోత్సవాన్ని విప్లవ పోరాట దినంగా శ్రమ జీవులు నిర్వహిస్తూ భవిష్యత్తు పోరాటా లకు కార్మిక వర్గం నాయకత్వం వహిస్తుందని దేశం నేడున్న సంక్లిష్ట, సంక్షోభ సమయంలో, సందర్భంలో ఆశించటం సరైనదే కదా!