Home ఆఫ్ బీట్ బావా…. తీసికుంటన్న… తాతా తీసికుంటన్న….

బావా…. తీసికుంటన్న… తాతా తీసికుంటన్న….

Meals1బంతి బోజనంల కూసోని తినేటప్పుడు ఇన్పిచ్చే మర్యాద మాటలు. బావా తీసికుంటన్న… తాతా తీసికుంటున్ననే… పెద్ద మనిషి తీసికుంటన్ననే…. అని అన్నం తినుడు మొదలు పెడుతరు. ఎన్కట పెండ్లిల్లు ప్యారంటాలు పబోజనాలు అయినప్పుడు ఈతసాపల మీద అందరికి బంతి భోజనం వడ్డించేది. ఆ బంతిల ముందుగాల ఇస్తార్లు ఏస్కవస్తరు అటెన్క పొలావు బువ్వ ఏస్క వస్తరు తర్వాత కూడ వడ్డిస్తరు. కూర అంటే యాటకూరనే. మాంసం వడ్డిచ్చేవాల్లు కొల మానంగ ఏసేటోల్లను సూస్తరు మూడు వక్కలు ఇంత సోర్వ పోస్తరు. పోసినంక కలుపుకొని ఎవలదివాల్లే లప్ప లప్ప తినరు. బంతిల బావా బామ్మర్థులు కూకుంటే కచ్చితంగా బామ్మర్ధి బావకు చెప్పి ఆజ్ఞ తీసికొనే తినాలె బావ తీసికుంటన్న అంటే కానీయవోయ్ అంటడు అప్పుడు బుక్క పెడ్డుడు ఒక సంప్రదాయం. అట్లనే తాత మనుమల వరుసలు ఉంటే కూడా మనుమడు మరిశిపోకుండా తాతలకు చెప్పాలె. వీల్లు ఇద్దరే గాకుంట కుల పెద్ద మనిషి ఆ బంతిల కూసుంటే ఆయనకు కూడా తీసికుంటన్న అని చెప్పి తీసుకునుడే రివాజు.
ఈ పద్ధతి ఎక్కువగ అన్ని కులాలల్ల కన్పిస్తది. ఊర్లల్ల అన్ని కులాలోల్లు సుత వరుసలు పెట్టుకొనే లుసుకుంటరు. సంతం బావ బామ్మర్ధులైనా వరుసకు అయినోల్లు అయిన ఇట్లానే అనుకుంటరు. దబ్బున చెప్పక తింటే మాత్రం ఏమోయి నీకు కండ్లకు కానకుంట అయినమా అని పరాశ్కాల మాటలు బావలు అయినా తాతలు అయినా అంటరు. బంతిల కూసోని తినేటప్పుడు కూడా బావ బామ్మర్ధులు వడ్డించే ఆయనతో మా బామ్మర్ధికట పులుగం చొక్క ఎయ్యి. గా తాతకు కార్జపు తునుకలు ఎయ్యి అనే పావురం పంచుకుంటరు. తినే ముందు తీసికుంటన్న అన్న ఆజ్ఞ తీసికోవడడమే కాదు. తిన్న తర్వాత ఎవలకు వాల్లు లేశిపోవుడు ఉండదది అందరు అయినంకనే కడుక్కునేతందుకు లేవాలె. పెద్దోలకన్న చిన్నోల్లు ముందుగాల లేస్తే తప్పకుండ తీస్తరు. ఇది ఎట్ల పుట్టిందోకని ఎన్కట నుంచి నడుస్తంది. బంతిలకెల్లి ముందుక తిన్నాయన వేస్తే ఇస్తార్లు దాటుకుంటపోవాలె అట్లపోతె అన్నం మీదికెల్లి దాటిపోయినట్లు అయితది అందుకని వచ్చిందేమో.
‘తీసికుంటన్న’ అనేది ఒక్క బంతి భోజనంలనే కాదు తాళ్ళల్ల కల్లు తాగే కాడ కూడా ముందుగాల వంచుమనేది బావకే ఆ తర్వాతనే తను అక్కడ కూడా. కల్లుబొట్టు తీసికునేటప్పుడు తీసికుంటన్న అనాల్సిందే ఎక్కడ పబోజనం అయినా అంతే. పబోజనం అంటే ఫంక్షన్ అన్నట్టు. పెద్దోలను గౌరవించే సంద్రాయం తెలంగాణ ఊల్లల్ల నడుస్తుండే రాను రాను అన్ని పోయినట్టు ఇదీ కన్పిస్తలేదు. అసలు బంతి బోజనాలే లేవు అంతా బఫ్ సిస్టం వచ్చింది. ఎవలకు వాల్లు లైన్ కట్టి లేదా ఎగబడి పెట్టుకచ్చుకొని ఎగిర్తంగ తిని పురాగ తినకుంట పార్‌స్తండ్రు. ఇయ్యాల రేపు బంతిల పెట్టవచ్చేటట్టు లేదు బఫ్ అయితేనే పెట్టెట్లోకు, తినేటోల్లకు సుత అల్కగ అన్పిస్తంది.
బువ్వతినే కాన్నే కాదు కల్లు గుడాల కాడ, అట్లనే పెండ్లి ఇండ్లల్ల పొద్దుగాల చాయ పలారం అని పిలుస్తరు అక్కడ కూడా ఈ మర్యాద సంప్రదాయం కొనసాగుతంది.
మాట మర్యాద తప్పితే పాయమాల్ ఏస్తరనే గ్రహింపు కూడా ఉంటది అట్లనిగాకున్న ఇట్లా గౌరవం ఇచ్చుడు పుచ్చుకునుడు కాలానుగుణం వస్తున్న సంప్రదాయం. దానికి ఇద్దరికి ప్రేమ పెంపెందుతది. ఇయ్యాల రేపు అట్లాంటి ప్రేమలు లేవు పైసలు ఎక్కువై అహంకారాలు పెరుగుతన్నయి అది వేరే సంగతి.
ఎన్కట బంతిల అన్నం వడ్డిచ్చేటప్పుడు ఉన్నాల్లు అయినా లేనోల్లు అయినా ఒక పద్దతి ఉండేది. ఇయ్యాల రేపు లెక్క కూర ఎంత పడితే అంత ఎయ్యక పోయేది. మొదటిసారి మాత్రమే కూర ఏస్తరు అదీ మూడు నాలుగు వ్కలు సోర్వ. మల్ల తాపకు పిలుస్తే కూడా కూర ఏసేటాయన అటు మోకాన కనపడడు మల్ల పిలిస్తే ఈ తాపకు డాల్చ తెచ్చి పోస్తరు. డాల్చ అంటే మసులపెట్టిన చారు. ఇప్పుడు చారు అంటండ్రు దాని అసలు పేరు డాల్చ. ఆ తర్వాత పప్పు ఏస్తరు. ఇప్పుడు కూర అన్నం ఎక్కవ తక్కువ ఏసి వృథా చేస్తున్నరు. బఫ్ సిస్టంల తింటాంటే ప్లేట్‌ల కూర వక్కాలను పురాత తినకముందే పారేస్తండ్రు మల్ల తెచ్చుకునుడు మీద మీద తినుడు లేకుంటే ఎక్కువ పెట్టిచ్చుకునుడు మిగిలిచ్చుడు జరుగుతుంది. ఎన్కట అన్నం అంటే దేవునితో సమానం అనుకొని పారేయక పోయేది.
బంతులల్ల కూసోసితింటాంటే కొన్ని ముచ్చట్లు సుత వస్తయి. కొన్ని పరాశ్కం మాటలు వస్తయి. కొన్ని సున్నితమైన నొప్పియ్యని తిట్లు ఇన్పిస్తయి. అదో గమ్మతి కథ. ఆడోల్ల బంతిలల్ల కూడా అట్లనే ఉంటది. అక్కడ తీసికుంటన్న వదినె. తీసికుంటన్న బాపమ్మ అనే పిలుపులు ఉండేయి గనాఇ ఆడోల్లు పిల్లగాండ్లతోని పక్కకు కూసండ బెట్టుకొని మెల్ల మెల్లగ వాల్లకు తినిపిచ్చుకుంట వీల్లు తక్కువనే తింటరు. ఎందుకంటే ఇంత బుక్కనోట్లె పెట్టంగనే పిలగాడు నీళ్లు అంటడు లేకుంటే అమ్మ…. కారం అంటడు ఇన్ని ఏశాల సమాజాయించుడుకు తల్లి తిన్నట్టు చేస్తది. పిలగాండ్లను ఆ కాలంల తండ్రులు పట్టుకొని తిరుగకపోయేది. పిల్లల పెంపకం అంత తల్లులదే అన్నట్టుగ నేర్సుకున్నరు ఈ కాలంలనైతె తండ్రులే పిల్లలకు దోస్తులైతండ్రు తినిపిచ్చుడు తానం చేపిచ్చుడు తింపుకచ్చుడు అంత తండ్రే చేస్తున్నడు.
మర్యాద పలుకులు పరాశ్కాల మాటలు ముచ్చట్లే పల్లెల సంప్రదాయాలు.

అన్నవరం దేవేందర్,
సెల్ :9440763479