Home లైఫ్ స్టైల్ చదువులు బాగుపడాలంటే…

చదువులు బాగుపడాలంటే…

మనదేశంలో కేజీ నుంచి పీజీ, పరిశోధనా రంగం వరకు విద్యారంగం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. కేటాయించే నిధులు సరిపోవు. ఉన్న పథకాలు అంచనాలు అందుకోలేవు. ఏం చేస్తే నాణ్యమైన విద్య అందరికీ అందుబాటులోకి వస్తుందో నిపుణులు ఇలా చెప్తున్నారు.

School-Students-Education

ఆరు దశాబ్దాలుగా విద్య మీద మనదేశం పెట్టే ఖర్చు స్థూల జాతీయోత్పత్తిలో దాదాపు 4 శాతంగానే ఉంటూ వస్తోంది. ఇంకా పెంచాలని ఉన్నా వివిధ కారణాల వలన ఈ రంగానికి ప్రభుత్వం ఎక్కువగా కేటాయించలేకపోతుంది. కాని ప్రస్తుత అవసరాలు, ఈ రంగంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి కనీసం 6 శాతం కేటాయించాలి. రానున్న రెండు సంవత్సరాల్లో అది 8 శాతానికి పెరగాల్సిన అవసరం కూడా ఉంది. అలా జరగడం వలన తల్లిదండ్రులకు ఫీజుల భారం తగ్గుతుంది. అభివృద్ది చెందిన దేశాల మాదిరిగానే విద్యారంగంలో ప్రభుత్వ భాగస్వామ్యం పెరుగుతుంది. ప్రభుత్వ సంస్థలు సరిగా పనిచేయని కారణంగా 70 శాతం విద్యార్థులు ప్రైవేటు యూనివర్శిటీల్లో లేదా రాష్ట్రవర్శిటీలు అందించే అన్‌ఎయిడెడ్ కోర్సుల్లో చదువుతున్నారు.

మనదేశంలో విద్యాప్రమాణాలు పెరగడానికి విద్యావేత్తల దగ్గర చాలా ఆలోచనలు, వ్యూహాలు ఉన్నాయి. ‘రాష్ట్ర నిధులతో నడిచే విద్యా సంస్థలకు ప్రభుత్వం మరింతగా నిధులివ్వాలి. అప్పుడే ఉన్నతవిద్య మధ్య, దిగువ తరగతి వారికి అందుబాటులో ఉంటుంది. మనదేశంలో స్థూలంగా ఉన్నతవిద్యకు ఎన్‌రోల్ చేసుకునేవారి శాతం ప్రస్తుతం 23 ఉంది. అది ప్రపంచ సరాసరి కన్నా పదిశాతం తక్కువ. ఆ తేడాను భర్తీ చేయడానికి మనకి ఇంకా చాలా సమయమే పట్టేట్లు ఉంది. ఉన్నతవిద్యకు కేటాయించే బడ్జెట్ పెంచడం అంటే దేశానికి ఉన్నతమైన, నాణ్యవంతమైన మానవ వనరులను అందించడమే. ప్రపంచంలో ఎక్కడైనా పనిచేయగలిగే స్థాయి వ్యక్తులను సమాజానికి అందించడమే.’ అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఉన్నత విద్యారంగం వ్యాప్తి జరగాలంటే ఏం చేయాలనేదానిపై పలు అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి.‘వాస్తవానికి మనదేశంలో కార్మిక మార్కెట్ సమాచార వ్యవస్థ అత్యవసరంగా ఏర్పడాలి. దానివలన రాబోయే మూడు నాలుగేళ్లకు సరిపడ ఎంతమంది ఉపాధ్యాయులు, సాంకేతిక పనివారు కావాలి అనేదాని మీద విద్యాసంస్థలకు అవగా హన ఏర్పడుతుంది. మన విధానాలు కూడా దానికి తగ్గట్టుగా తయారవ్వాలి.’ అని విద్యా రంగ వ్యూహకర్త రిషి కపాల్ అంటారు. పారిశ్రామిక శిక్షణ సంస్థ(ఐటిఐ)ను ఆధునీకరించాలని స్కిల్ ఎడ్యుకేషన్ నిపుణులు అంటారు. వ్యవసాయం, దాని సంబంధిత రంగాలతో పాటు ఇతర రంగాల్లో ప్రత్యేకించి తయారు చేసిన కోర్సులను పెట్టాలని అభిప్రాయపడ్డారొక ఐఎఎస్ ఆఫీసర్. ‘ఇన్సెంటివ్‌లు, సబ్సిడీలతో విద్యారుణాలుండాలి స్కూళ్లను డిజిటలైజేషన్ చేయాలి. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో తరగతి గదులు పెంచాలి. టీచర్ల కొరత తీర్చి మరింతమంది ఉపాధ్యాయుల్ని నియమించాలి. బడ్జెట్‌లో దానికి తగినట్టు నిధులు కేటాయించాలి’ అని విద్యా సాంకేతిక స్టార్టప్ ఔత్సాహిక వ్యాపారవేత్తలు డిమాండ్ చేస్తున్నారు. ప్రపంచ వాణిజ్య సంస్థ, వ్యాపార సేవలకు సంబంధించిన ఒప్పందం గురించి చర్చలు జరుగుతున్నాయి. ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుని అంగీకరిస్తే విదేశీ వర్శిటీలు మనదేశంలోకి వస్తాయనేది విద్యావేత్తల వాదన.

పరిశోధనా రంగం పరిస్థితి తెలుసుకోడానికి ఏఏ దేశాలు తమ వార్షిక తలసరి ఆదాయం మీద ఈ రంగానికి ఎంత ఖర్చు పెడుతున్నాయో 2014 లో ప్రపంచ స్థాయి అధ్యయనం జరిగింది. అమెరికా 2.74 శాతం, చైనా 2.10 శాతం, జర్మనీ 2.84 శాతం, దక్షిణ కొరియా 4.29 శాతం ఖర్చుపెడితే మనదేశం కేవలం 0.85 శాతం మాత్రమే ఖర్చు పెడుతోంది.

పరిశోధన మీద మరింతగా దృష్టిపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. దానికోసం ప్రత్యేకంగా రెండు పథకాలు న్నాయి. అవి, రీసెర్చి ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ(IMPRINT), ఉచ్ఛ్‌తార్ ఆవిష్కార్ యోజన(UAY). 2016-17 నుండి మూడేళ్ల వరకు ఉన్నత విద్యా సంస్థలలో పరిశోధన మీద దృష్టి పెట్టడం కోసం ఇంప్రింట్ పథకానికి 487 కోట్ల రూపాయలు కేటాయించారు. ఆ ప్రాజెక్టు ఖర్చులో యాభైశాతం మానవ వనరుల మంత్రిత్వ శాఖ భరిస్తుంది. ఇంకో యాభైశాతం భాగస్వామ్య మంత్రిత్వశాఖ లేదా విభాగం పెట్టుకుంటుంది. యుఎవై పథకం, పరిశ్రమలు స్పాన్సర్ చేసే ప్రాజెక్టులు, ఫలితాలనాశించే పరిశోధనా ప్రాజెక్టుల మీద పనిచేస్తుంది. 2016-17 నుంచి రెండేళ్ల వరకు నడిచే ఈ ప్రాజెక్టుకోసం 475 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. ఈ ప్రాజెక్టు ఖర్చును మానవవనరుల మంత్రిత్వశాఖ 50 శాతం, పరిశ్రమలు 25 శాతం, భాగస్వామ్య మంత్రిత్వశాఖ/విభాగం భరిస్తుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగానికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో పరిశోధన, అభివృద్ధి విషయాలపై పని చేసే స్వచ్ఛంద సంస్థలకు 2015-16 కు 455.512 లక్షలు, 2016-17 కి 453.676 లక్షలు విడుదల చేశారు.