Home జిల్లాలు మెడికల్ షాపులపై కొరడా!

మెడికల్ షాపులపై కొరడా!

పది రోజుల పాటు బంద్ చేయాలని ఆదేశం
మందుల చీటీ లేకుంటే కేసులే
ఆందోళన యోచనలో యజమానులు

medak11సంగారెడ్డి : మెడికల్ షాపులపై ఔషధ నియంత్రణ అధికారులు కొరడా ఝుళిపించారు. కొద్ది రోజులుగా ఈ శాఖాధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. నిబంధనల ప్రకారం మందుల షాపులను నడపాలని హెచ్చరిస్తు న్నారు. దీంతో జిల్లాలో మెడికల్(మందుల) షాపుల యజమానులు హడలెత్తు తున్నారు. ఇదెక్కడి గోలరా బాబూ…అని వాపోతున్నారు. మందుల చీటీ (ప్రిస్కిప్షన్) లేకుండా మందులిస్తే చర్యలు తప్పవని నిబంధన పెట్టారు. ఇప్పుడు ఈ నిబంధన సమస్యగా మారిందని మందుల షాపుల యజమానులు వాపోతున్నారు. మందుల చీటీ లేకుండా వినియోగదారులకు మందులు విక్రయించినందుకు గాను గత నెలలో సంగారెడి ప్రధాన రహదారిలో ఉన్న మెడ్‌ప్లస్, అపోలో తదితర షాపుల్ని పది రోజుల పాటు మూసి వేయాలని ఆదేశించారు. ఆ ప్రకారం ఆయా షాపుల వారు 10 రోజుల పాటు తమ షాపులను మూసి వేశారు. వ్యాపారాన్ని నిలిపివేశారు. దీనిపై మెడికల్ షాపుల యజమానులు అభ్యంతరం పెట్టారు. ఇంతలోనే మళ్లీ కొరడా ఝళిపించారు. ఏకంగా ఆరు షాపులను మూసి వేయించారు. పోయిన వారం తనిఖీలు నిర్వహించగా సంగారెడ్డిలోని ఆరు మెడికల్ షాపుల్లో మందుల చీటీలు లేకుండా మందులు విక్రయిస్తున్న సంగతిని కనిపెట్టారు. ఫలితంగా ఈ షాపుల వారికి పది రోజుల పాటు షాపులు మూసి వేయాలని ఆదేశించారు.

ఫలితంగా సంగారెడ్డిలోని ఈ షాపుల వారు ఆదివారం నుంచి తమ షాపులను మూసివేశారు. కొత్త బస్టాండ్ వద్ద ఉన్న సాగర్ మెడికల్ షాపు, లక్ష్మినర్సింహ, దుర్గా భవాని, సాహితీ, గోకుల్‌తదితర షాపులు ఈ జాబితాలో ఉన్నాయి. జోగిపేట, మెదక్, సిద్దిపేట, పటాన్‌చెరు, జహిరాబాద్, నారాయణఖేడ్ ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా ఎవరినో పంపి దుకాణాదారుల నుంచి మందులు కొనుగోలు చేయించి ఆ తర్వాత కేసులు నమోదు చేస్తున్నారని జిల్లా కెమిస్టు, డ్రగ్గిస్టు అసోసియేషన్ అధ్యక్షుడు సతీష్‌రావు ఆరోపించారు. ఈ విధానం తమకు తీవ్ర ఇబ్బందులు సృష్టిస్తోందని పేర్కొన్నారు. తెలంగాణా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తమ కష్టాలు తీరుతాయని భావించగా, కష్టాలు పెరిగాయని ఆయన విమర్శించారు. కొంత మంది అధికారులు తమ కక్ష సాధింపు చర్యలకు పూనుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.దీనిపై హైద్రాబాద్‌లో మీడియా సమావేశంలో వివరించ నున్నామని అన్నారు. ఇలాగైతే తమ దందా బంద్ చేయాల్సిందేనని అన్నారు. చిన్న దుకాణాలు మూసి వేయించి కార్పోరేట్ సంస్థలకే మేలు చేసే విధంగా చేసేందుకు కుట్రజరుగుతోన్నట్టు కనపడుతోందని ఆరోపించారు.