Home అంతర్జాతీయ వార్తలు రెండు కేజీల బరువు తగ్గారు

రెండు కేజీల బరువు తగ్గారు

thai

12 మందిలో రక్తహీనత లక్షణాలు

 థాయ్ చిన్నారులకు ప్రాణభయం లేదన్న వైద్య బృందం

చియాంగ్ రాయ్ : థాయ్‌లాండ్‌లోని గుహ నుంచి రక్షించి తీసుకువచ్చిన 12 మంది బాలురు ఒక్కొక్కరు రెండు కీలోల బరువుని కోల్పోయారని వైద్య బృందం ప్రకటించింది. రెండు వారాలపాటు గుహలో చిక్కుకు పోవడం వల్ల వారు బలహీనంగా తయారయ్యారని తెలిపింది. అయితే వారికి ప్రాణ హాని లేదని చెప్పింది. ఆందోళన పడాల్సినంతగా ఆరోగ్య సమస్యలు లేవని చియాంగ్ రాయ్ ఆసుపత్రి డాక్టర్ల బృందం ప్రకటించింది. పిల్లల చికిత్స బాధ్యతని థాయ్ ప్రభుత్వం ఈ ఆసుపత్రి డాక్టర్ల బృందానికి అప్పజెప్పింది. కొంతమంది పిల్లల్లో రక్తహీనత లక్షణాలు కనపడుతున్నాయని డాక్టర్ల బృందం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రకటించారు. బాధితుల్లో అల్పోష్ణస్థితి లక్షణాలు ఉన్నాయని, 18 రోజులపాటు గుహలో ఉండటం, గుహలోని నీరు చల్లగా ఉండటం వల్ల ఈ లక్షణాలు వచ్చాయని వైల్డ్ బోర్ యువ సాకర్ టీంకు చికిత్స అందిస్తున్న బృందం తెలిపింది. పిల్లల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉందని, మొదటి బ్యాచ్‌లో రక్షించిన పిల్లలను కలవడానికి వారి తల్లిదండ్రులను అనుమతించామని డాక్టర్లు చెప్పారు. బాధితులందరికి తేలికైన ఆహారం, అన్నం, చికెన్, పలు విటమిన్ మాత్రలు ఇస్తున్నామని తెలిపారు. తమ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పిల్లలతో పాటు వారి కోచ్ కూడా కోలుకుంటున్నాడని చెప్పారు. ఫుట్‌బాల్ టీంకి చెందిన పిల్లలు శిక్షణ కోసం గుహలోకి వెళ్లి చిక్కుకు పోయిన సంగతి తెలిసిందే. వారిని రక్షించే క్రమంలో ఓ నేవీ సిబ్బంది ఆక్సీజన్ అందక ప్రాణం కోల్పోయారు.
థాయ్ ఆపరేసన్‌లో ఇండియన్లు..
పుణె: థాయ్‌లాండ్ గుహ ఆపరేషన్‌లో భారత్‌కు చెందిన ఇద్దరు ఇంజినీర్లు కూడా పాలు పంచుకున్నారు. వారే మహరాష్ట్రకు చెందిన ప్రసాద్ కులకర్ణి, శ్యామ్ శుక్లా. గుహలో చిక్కుకుపోయిన వారిని బయటకు తీసుకురావడానికి చేపట్టిన ఆపరేషన్‌లో భారత్‌కు చెందిన కిర్లోస్కర్ బ్రదర్స్ లిమిటెడ్ సంస్థ సాంకేతిక సాయం అందించిన విషయం తెలిసిందే. గుహలో నీటిమట్టం తగ్గించడానికి అవసరమైన సామగ్రి, సాంకేతికత తమ కంపెనీకి ఉన్నాయని భారతీయ రాయబార కార్యాలయం.. థాయ్‌లాండ్ అధికారులకు సిఫార్సు చేసింది. అందుకు అక్కడి ప్రభుత్వం కూడా అంగీకరించడంతో కిర్లోస్కర్ కంపెనీ భారత్, థాయ్‌లాండ్, యుకెలోని తమ కార్యాలయాల నుంచి నిపుణులను గుహ వద్దకు పంపింది.భారత్ నుంచి ఏడుగురు నిపుణుల బృందం థాయ్ గుహ వద్దకు వెళ్లగా అందులో ప్రసాద్, శ్యామ్ కూడా ఉన్నారు. ఈ ఆపరేషన్‌లో పాలు పంచుకున్న ఇద్దరే ఇద్దరు భారతీయులు వీరు. కిర్లోస్కర్ కంపెనీలో ప్రసాద్ ప్రొడక్షన్ డిజైన్ హెడ్‌గా పనిచేస్తుండగా.. శ్యామ్ శుక్లా కార్పొరేట్ రీసర్చ్ విభాగానికి జనరల్ మేనేజర్‌గా ఉన్నారు.
ఆసుపత్రి బాలలు
ఆ 12 మంది థాయ్ బాలలు తిరిగి వెలుగును కళ్లారా చూస్తున్నారు. లువాంగ్ రాకాసి గుహలోని చిమ్మచీకట్లనుంచి విముక్తి పొంది కొత్త బతుకుల శ్వాస తీసుకుంటున్నారు. ధాయ్‌లాండ్‌లో గుహలో చిక్కిన పన్నెండు మం ది బాలలు వారి కోచ్‌తో పాటు ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రాణరక్షక చర్యలలో ప్రపంచ స్థాయిలో అద్భుతంగా మిగిలిన గుహ ఛేదింపు బాలలకు విముక్తి తరువాత ఈ పిల్లలు ఇప్పుడు తిరిగి సత్తువ కూడకుంటున్నారు. ఆసుపత్రిలో రోగుల దుస్తులతో, ముఖాలకు మాస్క్‌లతో వారు పడకలపై కూర్చుని , వచ్చిపొయ్యే మీడియా ప్రతినిధులను నవ్వు కళ్లతో పలకరిస్తున్నారు. కెమెరా ఫ్లాష్‌లకు స్పందిస్తున్నారు. ఒక బాలుడు సమయస్ఫూర్తితో విజయసంకేతంగా వి సంకే తం ప్రదర్శించారు. తాము గుహనుంచి బయటపడి, చావు నుంచి గెలిచాం అనే ధీమా వారిలో కన్పించింది.