Home తాజా వార్తలు తల్లిపాలు తాగి రొమ్ముగుద్దే రకం వర్మ: అల్లు అరవింద్

తల్లిపాలు తాగి రొమ్ముగుద్దే రకం వర్మ: అల్లు అరవింద్

Mega Producer Allu Aravind Press Meet on Issue of Sri Reddy

హైదరాబాద్: ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇటీవలి పరిణామాలపై నిర్మాత అల్లు అరవింద్ గురువారం ప్రెస్‌మీట్ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఇండస్ట్రీలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు చాలా బాధ కలిగించాయని ఆయన పేర్కొన్నారు. మూడు తరాలుగా సినీ ఇండస్ట్రీనే నమ్ముకుని ఉన్నామని, ఇండస్ట్రీ అంటే మాకు ఎంతో గౌరవం ఉందన్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీ తల్లిలాంటిదని చెప్పారు. ఎన్‌జిఒలు, మహిళలతో కలిసి ఓ కమిటీ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. వేధింపులపై ఫిర్యాదులు వస్తే ఈ కమిటీ విచారించి చర్యలు తీసుకుంటుందన్నారు. రామ్‌గోపాల్ వర్మ ఎలాంటి వ్యక్తో చెప్పడానికే ఇక్కడికి వచ్చానని చెప్పారు. తల్లిపాలు తాగి రొమ్ముగుద్దే రకం వర్మ అని ఆయన పేర్కొన్నారు.

ఈ పరిశ్రమలో పుట్టిపెరిగిన వర్మ ఇప్పుడు తల్లిలాంటి ఇండస్ట్రీని ద్రోహం చేస్తున్నాడని మండిపడ్డారు. శ్రీరెడ్డిని అడ్డం పెట్టుకొని పవన్ కల్యాణ్‌పై ఉన్న కోపాన్ని వర్మ తీర్చుకుంటున్నాడని తెలిపారు. శ్రీరెడ్డితో పవన్‌ను అలా నేనే తిట్టించానని వర్మ ఒప్పుకున్నాడని, ఆమెకు వర్మ రూ.5కోట్లు ఆఫర్ చేశాడని, ఆయనకు అంతడబ్బు ఎక్కడిదని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో వర్మ వెనుక ఎవరున్నారో తెలియాలన్నారు. శ్రీరెడ్డి విషయం బయటకు చెబుతుందని భయపడే హడావుడిగా వర్మ వీడియో రిలీజ్ చేశాడని తెలిపారు. సాఫ్ట్ మర్డర్స్ చేయించే క్రిమినల్ వర్మ అని అరవింద్ దుయ్యబట్టారు. మెగా కుటుంబం అంటే వర్మకు పడదని, నీ బతుక్కి ఇంత నాటకం అవసరమా వర్మ? అంటూ అరవింద్ ఘాటు విమర్శలు చేశారు. ఇలాంటి వాళ్లని ఏం చేయాలో చెప్పాలంటూ తాను పరిశ్రమను అడుగుతున్నట్లు చెప్పుకొచ్చారు.