Search
Thursday 20 September 2018
  • :
  • :

అరుదైన స్టార్ విజయ్ దేవరకొండ

Megastar Chiranjeevi Speech At Geetha Govindam Success

విజయ్ దేవరకొండ, రష్మికా మందన్న జంటగా నటించిన సినిమా ‘గీత గోవిందం’. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమా సక్సెస్‌మీట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ “విజయ్ దేవరకొండ చాలా హుషారైన హీరో. ఇండస్ట్రీకి దొరికిన అరుదైన స్టార్ అతను. ఇలాంటి వేడుకల్లో పాల్గొంటే నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇంత ఆనందం మాకు ప్రేక్షకులే ఇచ్చారు. గత రెండేళ్లుగా తెలుగు చిత్ర పరిశ్రమ చాలా సంతోషంగా, ఉత్సాహంగా ఉంది. సినిమాల్లో చిన్న, పెద్ద తేడా లేకుండా మంచి చిత్రాలు  సక్సెస్‌ను అందుకుంటున్నాయి. విజయ్ దేవరకొండ ‘అర్జున్‌రెడ్డి’లో చాలా ఎనర్జిటిక్‌గా, ఎరాటిక్‌గా చేశాడు. కానీ ‘గీత గోవిందం’లో చాలా సాఫ్ట్‌గా నటించాడు. ఈ చిత్రం విజయ్‌కి పెద్ద విజయాన్ని అందించింది. నాకు కూడా ‘విజేత’ చిత్రం ఇలాగే పెద్ద సక్సెస్‌ను అందించడం జరిగింది. దర్శకుడు పరశురామ్ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. కథకుడిగా, స్క్రీన్‌ప్లే రైటర్‌గా, డైరెక్టర్‌గా అతను సక్సెస్ సాధించాడు.

బన్నీ వాసు నిర్మాతగా పెద్ద విజయాన్ని అందుకున్నందుకు అతన్ని అభినందిస్తున్నాను. వెన్నెల కిశోర్ చివరలో వచ్చినా చమ్మక్ అనిపించాడు. కడుపుబ్బ నవ్వించి ప్రేక్షకులకు మంచి కిక్ ఇచ్చాడు. రాహుల్ రామకృష్ణ కూడా చాలా సరదాగా చేశాడు. ఇక గంటన్నర సినిమా లీక్ అయిందని కొన్నాళ్ల క్రితం అల్లు అరవింద్ నాకు చెప్పారు. సినిమాను ఈవిధంగా లీక్ చేయడం ఎంత వరకు సబబు. చిత్ర పరిశ్రమ ఎంతో మందికి భోజనం పెట్టే తల్లిలాంటిది. సినిమాను లీక్ చేసేవారు తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకాలు”అని అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ “మేం ఏది చేసినా మా విజయంలో పాలుపంచుకుంటారు చిరంజీవి. ఆయన వేసిన బాటలో ఎంతో మంది హీరోలు నడుస్తున్నారు. పరశురామ్ చాలా మంచి రచయిత. అతను సినిమాను చక్కగా తెరకెక్కించాడు. విజయ్ గొప్ప నటుడు అని చెబితే మామూలే. ‘అర్జున్ రెడ్డి’లో అందరూ అతని నటనను చూశారు. చిరంజీవి, విజయ్‌కి కొన్ని పోలికలున్నాయి. విజయ్ ముదురు. అంటే అది నెగటివ్ కాదు. అతను మంచివాడు, తెలివైన వాడు”అని చెప్పారు.

విజయ్ దేవరకొండ మాట్లాడుతూ “ఈ సక్సెస్ వెనుక ముగ్గురు ఉన్నారు. బన్నీ వాసు నాకు కథ చెప్పిన తర్వాత నేను ఆలోచిస్తుంటే.. ‘బాసూ ఇది యూనివర్సల్ సినిమా’ అని అన్నారు. సినిమాలో నా మంచి పర్‌ఫార్మెన్స్‌కు  పరశురామే కారణం.  అల్లు అరవింద్ ఈ సినిమాను ఆగస్టు 15న విడుదల చేయించారు. ఇక మెగాస్టార్ చిరంజీవి సినిమా చూసిన తర్వాత గంట సేపు మాతో కూర్చొని డైలాగులు, యాక్షన్లు, రియాక్షన్లు చెబుతుంటే చాలా ఆనందంగా అనిపించింది”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దిల్‌రాజు, పరశురామ్, బన్నీ వాసు, అన్నపూర్ణమ్మ, సుబ్బరాజు, వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణతో పాటు చిత్ర బృందం పాల్గొంది.

Comments

comments