హైదరాబాద్: కొణిదేల శివశంకర వరప్రసాద్ ఈ పేరు చాలా తక్కువ మందికి తెలుసు. అదే చిరంజీవి అన్నా… మెగాస్టార్ అన్నా… సుప్రీం హీరో అన్నా… చిరు అన్నా పరిచయమే అక్కర్లేని పేర్లు. తనదైన నటన చాతుర్యం, నృత్యాలతో దశాబ్దకాలం తెలుగు చిత్రపరిశ్రమ రారాజుగా వెలుగొందారు. టాలీవుడ్ నెం.1 హీరోగా ఉన్నప్పుడే రాజకీయాలోకి వెళ్లారు. దీంతో దాదాపు 9ఏళ్లు చిరు సిల్వర్ స్క్రీన్కు దూరమయ్యారు. ఆ మధ్యలో తనయుడు రామ్‌చరణ్ చిత్రాల్లో అతిథి పాత్రల్లో మెరిశారనుకోండి. అయితే తాజాగా చిరంజీవి భారీ విరామం తర్వాత మళ్లీ చిత్రాల్లో నటించడానికి ఒప్పుకున్నారు. ప్రస్తుతం వివి వినాయక్ దర్శకత్వంలో ఖైదీ నెం. 150 మూవీలో నటిస్తున్నారు. ఇదే సమయంలో బుల్లితెర మీద కూడా చిరు దర్శనమివ్వబోతున్నారు. టాలీవుడ్ మన్మధుడు, కింగ్ నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షో గుర్తుందికదూ. గత మూడు సీజన్లకు నాగ్ హోస్ట్‌గా చేశారు. అయితే నాల్గో సీజన్‌కు మాత్రం వ్యాఖ్యాతగా చిరు రానున్నారు. దీంతో ఎంఇకె ప్రొగ్రామ్‌కు భారీ క్రేజ్ వచ్చేసింది. దీనికోసం మెగాస్టార్ భారీ మొత్తాన్ని అందుకోనున్నారనే పుకారు షికారు చేస్తోంది. దీంట్లో నిజమేంతో తెలియదు కానీ… మీడియా సర్కిల్స్‌లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఒక్కో ఎపిసోడ్‌కు చిరు అక్షరాల 10లక్షల రూపాయలు రెమ్యూనరేషన్‌గా తీసుకోనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఎంఇకె నాల్గో సీజన్ కోసం దసరా సందర్భంగా ఈ నెల 11 నుంచి ఎస్ఎంఎస్ కాంటెస్ట్ ప్రారంభమైంది. కాంటెస్టెంట్ సెలక్షన్ తదితర కార్యక్రమాలు ముగించుకోని డిసెంబర్ 2నుంచి ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ప్రసారం కానుంది. చిరు వ్యాఖ్యాతగా వ్యవహరించనున్న ఎంఇకె షో ఎంతటి విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాల్సిందే.