Home జాతీయ వార్తలు గనిలో చిక్కుకున్న 15 మంది కార్మికులు

గనిలో చిక్కుకున్న 15 మంది కార్మికులు

వరద నీటితో సహాయానికి అంతరాయం

షిల్లాంగ్ : ఇరుకైన ఒక బొగ్గుగనిలో 13 రోజులుగా చిక్కుకుపోయిన 15 మంది బొగ్గుగని కార్మికులను రక్షించేందుకు సహాయక బృందాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అయితే, వరదనీటితో గని లోపలి భాగం నిండిపోవడంతో లోపలికి వెళ్లేందుకు కష్టమవుతోంది. దాంతో అక్కడ చిక్కుకున్న బొగ్గు గని కార్మికులను రక్షించడం ప్రశ్నార్థకంగా మారుతోంది. మేఘాలయలో ఒక బొగ్గు గనిలో పనిచేసేందుకు ఈనెల 13న 15 మంది కార్మికులు వెళ్లారు. వారింతవరకూ గనిలోపలే ఉండిపోయారు. దేవుడు దయ, ఏదైనా అద్భుతం మాత్రమే వారిని బతికించగలదు అని మేఘాలయ విపత్తు నిర్వహణ మంత్రి కిర్మెన్ షైల్లా చెప్పారు. సమీపంలో ఉన్న నదికి హఠాత్తుగా వరదలు రావడంతో ఆదివారం నుంచి సహాయ కార్యక్రమాలు నిలిపేసినట్టు అధికారులు తెలిపారు. గని ఉన్న ప్రాంతంలో దాదాపు వంద మంది నిపుణులు ఉన్న నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డిఆర్‌ఎఫ్) బృందం గని ప్రాంతంలోనే ఉన్నారు. కానీ అత్యాధునిక పరికరాలు లేకపోవడంతో వారి ఆపరేషన్లు కొనసాగడంలేదని ఎన్‌డిఆర్‌ఎఫ్ కమాండెంట్ ఎస్‌కె శాస్త్రి తెలిపారు. ర్యాట్ హోల్ మైన్ అని పిలిచే ఈ గని చాలా పాతది. అక్రమంగా తవ్విందని, గని ఇరుకుగా ఉన్నందువల్ల ప్రమాదకరంగా మారిందని చెబుతారు.

 

Meghalaya Coal Mine: 15 Trapped Labourers Yet Rescued