Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

గోరింట పూచింది…

ఎండల తాపాన్ని వాన చినుకులు చల్లబరచాయి. వేడెక్కిన పుడమిని చిత్తడి జల్లులు పులకరింపచేశాయి. ఆషాఢంలోని ఆనందాలనూ వెంట తెచ్చాయి. ఆషాఢం అంటేనే మహిళల మనసులో ఆనందాన్ని, ముఖంపై చిరునవ్వులు పూస్తాయి. వానలే కాదు, చేతులు, కాళ్లపై ఎర్రగా పండే గోరింటాకును కూడా గుర్తు చేస్తుంది ఆషాఢం.  మహిళల చేతుల్లో అరుణిమను ఆవిష్కరించే గోరింటాకు ఈమాసం ప్రత్యేకం. 

mehandhiఆషాఢమాసం తనతో పాటే పండగలను వెంట తెస్తుందని ఆషాఢ మాసం అంటే ఎంతో ప్రీతి. తర్వాత వచ్చే పండుగలను వేడుకగా తీసుకొచ్చే పర్వదినమే తొలి ఏకాదశి. సువాసనలు వెదజల్లే గోరింటాకు చేతుల్లో దిద్దుకోవడం అంటే ఇష్టపడని మహిళలు ఎవరుం టారు చెప్పండి? పెట్టుకున్న ప్పుడు ఎంత సంబరమో పూచాక చూసుకోవడం అంత కంటే ఎక్కువ సంబరం. అందుకే గోరింటాకు అంటే మోముల్లో ఒక మెరుపు కనిపిస్తుంది. గోరింటా కు మీద మనసు పో తుంది.
పచ్చి గోరింటాకే మంచిది
పెళ్లిళ్లు, శుభకార్యాలలో గోరింటాకు ఎంత సహజమో, ఆషాఢంలో చేతులు, కాళ్లకు ఎర్రని చందమామలు పెట్టుకోవడం అంతే సహజం. తర తరాలుగా సంప్రదాయంగా వస్తున్న ఆచారం. ఆషాఢం వచ్చిందంటే ఆడపిల్లలు చేసే హడావిడి అంతా ఇంతా కాదు. పెళ్లీడుకొచ్చిన ఆడపిల్లలు తమ చేతులు ఎర్రగా పండాలని కోరుకుంటారు. నిజానికి వర్షాకాలంలో మూడుసార్లు గోరింటాకు పెట్టుకోవాలి. గోరింటాకు పొడి కంటే, ఈ మాసంలో పచ్చని గోరింటాకు రుబ్బి పెట్టుకోవడానికే ఎక్కువ ప్రాముఖ్యత. పైగా ఎర్రని రంగుతో అందగా పండుతుంది కాబట్టి సౌందర్య సాధనం అయింది. ఎందుకంటే కోన్ తయారు చేసి చాలా కాలమై ఉంటుంది. కోన్ అయితే త్వరగా పోతుంది. పచ్చి గోరింట అయితే పది పదిహేను రోజులు రంగు నిలిచి ఉంటుంది. పైగా కోన్‌లో రసాయనాలు కలిసి ఉంటాయి. మేలుకు బదులు హాని ఎక్కువ చేస్తుంది. గోళ్ల చుట్టూ పెట్టుకునే ఆకు కాబట్టి గోరింటాకు అయింది.
దివౌషధమే…
మన దేశ సంప్రదాయాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. కొన్ని ఆచారాల వెనక సైంటిఫిక్ కారణాలుంటాయి. గోరింటాకు అలంకారంగానే కాక ఆరోగ్య పరంగానూ పని చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ కలిగి ఉంటుంది. ఇది తొలకరి వానలు పడే కాలం. వానలు పడినప్పుడు బయటికెళ్తారు. తడుస్తారు. పైగా తర్వాత వచ్చే శ్రావణం అంతా వర్షాలే. తడుస్తూ ఇంటెడు చాకిరి చేస్తారు మహిళలు. కాళ్లు, చేతులకు ఇన్ఫెక్షన్లు వస్తాయి. వాటి నుంచి మహిళల కాళ్లు, చేతులను కాపాడే దివ్యౌషధమే గోరింటాకు. గ్రామాల్లో పిల్లలు, పెద్దలు అంతా కలిసి సందడిగా గోరింటాకు పెట్టుకునే పర్వం కనులపండుగగా ఉంటుంది. గోరింటాకుతో చిన్నప్పటి జ్ఞాపకాలు చాలామందికి ఉంటాయి. సాయంత్రం చీకటి పడ్డాక చేతులకు, కాళ్లకు అమ్మ పెట్టిన గోరింటాకు చెదరకుండా జాగ్రత్తగా కాపాడుకోవడం పెద్ద పని.
గోరింటాకు జ్ఞాపకాలు
బంతి, చేమంతి ఆకులు అరచేతి మధ్యలో పెట్టుకుని పైన గోరింట పూత వేస్తే అదొక డిజైన్. చేతులకి గోరింటాకు ఉంటుంది కాబట్టి అమ్మ నోట్లో అన్నం తినిపిస్తుంది. రాత్రి పక్క మీద గోరింటాకు అంటకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. తెల్లవారి లేచేసరికి మంచం నిండా ఎండిపోయిన గోరింటాకు రాలిపోయి ఉంటుంది. తెల్లవారి చెయ్యి కడుక్కుని ఎవరి చెయ్యి ఎర్రగా పండిందో చూసుకోవడం పిల్లలందరికి ఒక సరదా. నీళ్లతో కాకుండా ముందుగా కొబ్బరి నూనెతో ఎండిన గోరింటాకు వొలిచేస్తే రంగు మరింతగా నిలుస్తుందని అంటారు.
మగవారికి అందుకే పండదు…
గోరింటాకు మన భారతీయ సంప్రదాయమేనేమో అన్నంతగా రంగరించుకుపోయింది కాని ముందుగా దీని పుట్టుక, గుర్తింపు మనదేశంలో కాదు. పాకిస్తాన్, అరబిక్ దేశాల్లో ఎక్కువగా గోరింటాకు వాడేవారు. బుర్ఖాల్లో ఉన్నా అక్కడ మహిళలు గోరింటాకు రంగును చేతులకు పులుముకోవడం వారి సంప్రదాయంలో భాగం. ఎరుపు రంగుకీ, మహిళలకి అవినాభావ సంబంధం ఉంటుంది.
సినిమాల్లో కూడా గోరింటాకుకు పెద్ద పీటనే. ఆ పేరుతో వచ్చిన రెండు సినిమాలు సూపర్ హిట్. గోరింటా పూసింది…అన్న పాట ఆ తరం నుంచి ఈ తరం వరకు మరచిపోలేరు. సింధూరంలా పూస్తే అందాల చందమామ తానే దిగి వస్తాడని చెప్పే అద్భుతమైన సాహిత్యం మరపురానిది. గోరింటాకు ప్రకృతి మనిషికి ప్రసాదించిన వరం. అందులో ఉండే లాసోన్ అనే పదార్థం ఎర్రని రంగునిస్తుంది. చర్మంలోని స్టెమ్ కార్మియం పొరలోని మృత కణాల ద్వారా చర్మంలోకి పోయి ఎరుపు రంగు వస్తుంది. సాధారణంగా మగవారి చేతుల్లో ఈ పొర మందంగా ఉంటుంది. అందుకే వారికి తొందరగా పండదు. మహిళల అరచేతులు సున్నితంగా ఉంటాయి కాబట్టి తర్వగా రంగునిస్తుంది.
తెలుగు ముంగిళ్లలో మురుస్తోంది
భారతీయ సంప్రదాయంలో ఒకటైన గోరింటాకు మనం కనిపెట్టిందేనా అంటే కాదు. 5000 ఏళ్ల కిందట ఈజిప్టులో ఆడ, మగ అందరూ కాళ్లు, చేతులు, జుట్టు, గడ్డానికి కూడా గోరింటాకు పెట్టుకునేవారు. ఉత్తర ఆఫ్రికాలో ఎడారివాసులు వేసవితాపం నుంచి తప్పించుకోడానికి గోరింటాకు ఉపయోగించేవారట. మొరాకోలో గర్భిణులు చీలమండల దగ్గర గోరింటాకు పెట్టుకుంటారు. దాని వలన ప్రసవం సుఖంగా జరిగి తల్లి, బిడ్డ క్షేమంగా ఉంటారని నమ్ముతారు. బిడ్డ జన్మించాక బొడ్డు తాడు కోసిన తర్వాత గోరింటాకు ముద్దను బొడ్డు దగ్గర పెడితే బిడక్డు అందం, ఐశ్వర్యం లభిస్తుందని నమ్ముతారు. మొగల్ చక్రవర్తుల ద్వారా మన దేశంలోకి వచ్చి తెలుగువారి ముంగిళ్లలో విరిసి ఇక్కడి ఆడపడుచుల చేతుల్లో పూసి మురుస్తోంది గోరింటాకు.

Comments

comments