Home జాతీయ వార్తలు ఇండియాకు వెళ్లే ఓపిక లేదంట!

ఇండియాకు వెళ్లే ఓపిక లేదంట!

Mehul Choksiన్యూఢిల్లీ: దేశాన్ని కుదిపేసిన పంజాబ్ నేషనల్ బ్యాంకు(పిఎన్‌బి) కుంభకోణంలో ప్రధాన నిందితులలో ఒకరైన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ విచారణ ఎదుర్కోవడానికి భారతదేశానికి వెళ్లే ఓపిక తనకు లేదని, తాను అంత దూరం ప్రయాణించలేనని చెబుతూ ఈ కేసును కొట్టివేయాలని కోర్టుకు లేఖ రాశాడు. తనను పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడిగా ప్రకటించాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరుపుతున్న ప్రత్యేక కోర్టుకు ఒక లేఖ రాసిన మెహుల్ చోక్సీ భారతదేశంలో దర్యాప్తు తాబేలు వేగంతో నడుస్తోందని, విచారణ ప్రారంభం కావడానికి ఇంకా ఎన్ని ఏళ్లు పడుతుందో చెప్పలేమని అతను కోర్టుకు రాసిన లేఖలో వ్యాఖ్యానించాడు. అనారోగ్య కారణాలతో ఈ ఏడాది ప్రారంభంలో పౌరసత్వం తీసుకున్న ఆంటిగ్వా నుంచి భారతదేశానికి 41 గంటల సుదీర్ఘ విమాన ప్రయాణం చేసేందుకు తన ఆరోగ్యం సహకరించదని కూడా అతను చెప్పుకొచ్చాడు. తన బకాయిలను తీర్చడానికి పంజాబ్ నేషనల్ బ్యాంకుతో సంప్రదింపులు జరుపుతున్నట్లు కూడా అతను ఆ లేఖలో తెలియచేశాడు. ఈ సంప్రదింపుల సంగతిని ఇడి కావాలనే కోర్టు దృష్టికి తీసుకురాలేదని చోక్సీ ఆరోపించాడు.

రూ 13,500 కోట్ల పిఎన్‌బి కుంభకోణంలో గీతాంజలి గ్రూపు చైర్మన్ అయిన చోక్సీతో పాటు అతని బంధువు నీరవ్ మోడీ కూడా ప్రధాన నిందితుడు. ఆంటిగ్వాలో తలదాచుకున్న చోక్సీతోపాటు నీరవ్ మోడీకి కూడా చెందిన రూ 218 కోట్ల ఆస్తులను ఇడి ఈ ఏడాది అక్టోబర్‌లో జప్తు చేసుకుంది. ఈ కుంభకోణంపై సిబిఐ దర్యాప్తు చేపట్టడానికి కొద్ది వారాల ముందే ఈ ఏడాది జనవరిలో వీరిద్దరూ దేశం విడిచి పారిపోయారు.