Search
Saturday 17 November 2018
  • :
  • :

ట్రంప్ పీఛేముడ్

trump1

వలసదారుల పిల్లలను తల్లిదండ్రుల నుంచి వేరుచేసే విధానం వెనక్కి
వాషింగ్టన్: అక్రమ వలసదారుల పిల్లలను వారి తల్లిదండ్రుల నుంచి వేరు చేయడం పై యావత్ ప్రపంచంతో పాటు స్వయానా తన సతీమణి మెలానియా నుంచి తీవ్ర విమర్శలు రావడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గారు. వలసదారుల పిల్లలను తల్లిదండ్రుల నుంచి వేరు చేసి నిర్బంధ శిబిరాల్లో ఉంచే విధానానికి స్వస్తి పలుకుతూ కార్యనిర్వహక ఉత్తర్వులపై బుధవారంనాడు సంతకం చేశారు. ఇటీవల సుమారు 2500 మంది చిన్నారులను వారి తల్లిదండ్రుల నుంచి వేరు చేసి శిబిరాలకు తరలించడం, పిల్లలు ఏడుస్తున్న ఫోటోలు, వారిని జైలులాంటి ప్రదేశాల్లో నిర్బంధించిన దృశ్యాలు వైరల్ కావడంతో అంతర్జాతీయ సమాజం ట్రంప్‌పై విమర్శలు ఎక్కుపెట్టింది. కుటుంబాలను విడదీయకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని, దీని వల్ల సమస్య పరిష్కారమవుతుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఓవల్ ఆఫీస్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. పిల్లలు, వారి తల్లిదండ్రుల విషయంలో తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నప్పటికీ మెక్సికో సరిహద్దులో వలసదారుల నిబంధనల విషయంలో ఏమాత్రం తగ్గేదిలేదని ట్రంప్ స్పష్టం చేశారు. అక్రమ వలసదారుల పట్ల కఠిన నిబంధనలు కొనసాగుతాయన్నారు. తమ సరిహద్దులు మరింత పటిష్టంగా ఉన్నాయని చెప్పారు. అక్రమ వలసదారులను విచారించే సమయంలో వారి పిల్లలను నిర్బంధ శిబిరాల్లో ఉంచుతున్నారు. అయితే ఇప్పుడు కుటుంబాన్ని కలిపి ఉంచే విచారణ చేపట్టాలని ట్రంప్ ఆదేశించారు.

Comments

comments