Home తాజా వార్తలు టిఆర్‌ఎస్‌తోనే ప్రతి కుటుంబానికి లబ్ది

టిఆర్‌ఎస్‌తోనే ప్రతి కుటుంబానికి లబ్ది

TRS Candidate Methuku Anand

 

వికారాబాద్: టిఆర్‌ఎస్‌తోనే ప్రతి కుటుంబానికి లబ్ది చేకూరుతుందని శాసన సభ్యుడు డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. కేంద్రంలో బిజేపి, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లేదని, అదే క్రమంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ధారూర్ మండల పరిధిలోని అంతారం, మోమిన్‌కలాన్, మోమిన్‌కుర్దు, రాజాపురం, నాగారం, పిసియం తాండ, గురుదొట్ల, అంపల్లి, దోర్నాల్, కుమ్మర్‌పల్లి, మైలారం, తరిగోపుల, నాగ్‌సాన్‌పల్లి తదితర గ్రామాలలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ ప్రచారానికి మెతుకు ఆనంద్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో సిఎం కెసిఆర్ ప్రవేశ పెట్టిన పలు సంక్షేమ పథకాలు పక్క రాష్ట్రాల వారే కాకుండా ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం కూడా పథకాల పేర్లు మార్చి అమలు చేస్తున్నదని ఆయన ఎద్దేవా చేశారు. రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలను కేంద్ర ప్రభుత్వం కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో అమలు చేస్తున్నదని ఆయన గుర్తు చేశారు. మిషన్ భగీరథ పథకాన్ని పక్క రాష్ట్రాల వారు అమలు పర్చుటకు సాధ్యాసాధ్యాలను పరిశీలించి వెళ్ళారని ఆయన తెలియజేశారు. సియం కెసిఆర్ దూర దృష్టితో ప్రవేశ పెట్టిన ప్రతి పథకం కేంద్ర మంత్రుల ప్రశంసలందుకున్నదన్నారు. రాష్ట్రంలో ప్రవేశ పెట్టిన ప్రతి పథకం దేశానికే ఆదర్శంగా నిలిచాయని ఆనంద్ కొనియాడారు. పుట్టిన బిడ్డ నుంచి కాటికి వెళ్ళే ప్రతి వారికి ఏదో ఒక సంక్షేమ పథకం లబ్ది చేకూరిందని ఆయన అన్నారు.

ప్రతి పథకం పకడ్బందీగా ప్రవేశ పెట్టి సక్రమంగా అమలు పరిచిన ఘనత కేవలం కెసిఆర్‌కే దక్కుతుందని ఆయన అన్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికి తాగు నీరు అందించేందుకు కృషి జరుగుతుందన్నారు. తాగు నీటి కొరకు బిందెలు పట్టుకొని లైన్లలో నిలబడాల్సిన అవసరం రాదన్నారు. ఆడబిడ్డలు అత్తల సూటిపోటి మాటలు ఇక నుంచి భరించాల్సిన అవసరం ఉండదని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎం పార్టీ మండల అధ్యక్షుడు మోయిజ్, వేణుగోపాల్‌రెడ్డి, ధారూర్ పిఏసిఎస్ చైర్మెన్ హన్మంత్‌రెడ్డి, కావలి అంజయ్య, యూనుస్, రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Methuku Anand Election Campaign in Vikarabad