Home వార్తలు లాహిరి లాహిరి లాహిరిలో… హాయిగ సాగే మెట్రోలో

లాహిరి లాహిరి లాహిరిలో… హాయిగ సాగే మెట్రోలో

ప్రయాణం చేయాలా, షాపింగ్ చేయాలా, సరుకులు కొనుక్కోవాలా, పార్కుకు వెళ్లాలా, అందమైన పచ్చని తోట లో విహారం చేయాలా, ఇవన్నీ ఒక్కచోటే ఉంటాయి. అదే మన హైదరాబాద్ మెట్రో. హైదరాబాదీలు ఎప్పుడెప్పుడా అని ఉత్సుకతతో ఎదురు చూస్తున్న మెట్రో రైలు ఈ ఏడాది  విలాసంగా పట్టాలెక్కనుంరి. మొదటి విడతగా మియాపూర్ నుంచి ఎస్ ఆర్ నగర్, నాగోల్ నుంచి మెట్టుగూడ వరకు మెట్రో సేవలు మొదల వనున్నాయి. ఇతర నగరాల్లో మాదిరి హైదరాబాద్ మెట్రో అండర్ గ్రౌండ్‌లో నడవదు. తల ఎత్తి పైకి చూసేంత ఎత్తులో దూసుకెళ్లబోతోంది. నగరాలంటే డబ్బున్నవారు నడుపుకునే కార్లు, బైకులే కాదు, నిరుపేద వ్యక్తులు కూడా ప్రయాణించగలిగే సౌకర్యమే మెట్రో. నాగరికత పెరుగుతోంది, సాంకేతికతలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. అయితే అవన్నీ కూలి చేసుకునే వారికి, కాయకష్టం చేసుకునేవారికి అందుబాటులో ఉండవు. కాని సరికొత్త సాంకేతికతతో, వినూత్న ఇంజనీరింగ్‌తో నిర్మిస్తున్న మెట్రో మాత్రం అన్ని వర్గాల వారికీ అందే కల. అధునా తన ఏసి కోచ్‌లతో ఉన్న మెట్రో ట్రెయిన్‌లో ప్రయాణం హైదరాబాద వాసులకు సరికొత్త అనుభవం  . వచ్చే ఏడాదికి రోడ్డు స్థాయిలో ఒక హైదరాబాద్, పైన ఎత్తులో ఒక హైదరాబాద్ ఉంటుంది అన్నంత స్థాయిలో తీర్చిదిద్దుతున్న మెట్రో ముచ్చట్లు ఇవిగో.. 

హైదరాబాద్ మెట్రో మేనేజింగ్ డైరెక్టర్, ఎన్ వి ఎస్ రెడ్డి
metroఎన్ వి ఎస్ రెడ్డి, వివిధ ప్రభుత్వ ఉన్నత అధికార పదవులలో 30 ఏళ్ల అనుభవం ఉన్నవారు. భారతీయ రైల్వే వ్యవస్థ అభివృద్ధి కోసం విభిన్న కార్యక్రమాలు చేపట్టి ఎన్నో అవార్డులు పొందారు. భారత ప్రభుత్వ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి డైరెక్టర్‌గా పనిచేసి నష్టాలలో ఉన్న కంపెనీని ఒక్క ఏడాదిలో అభివృద్ధి పథంలో నడిపించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కి అడిషనల్ కమీషనర్‌గా ప్రజల సొమ్ము ఎక్కువ ఖర్చు చేయకుండానే వినూత్న తరహాలో ప్రజలకు సౌకర్యాలు కలగచేశారు. తన ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నాలుగు ప్రముఖ ఫ్లై ఓవర్‌లు కట్టించారు. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో లిమిటెడ్‌కు మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ప్రజా రవాణా వ్యవస్థలో, మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం వినూత్న తరహాలో ఫైనాన్షియల్ ఇంజనీరింగ్ వంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని హైదరాబాద్ మెట్రోను ముందుకు దూసుకు వెళ్తున్నారు. ఆర్థిక విషయాలలో చతురత, వినూత్న ఇంజనీరింగ్ విధానాలు, ఎటు వంటి పరిస్థితినైనా సవాలుగా స్వీకరించగలిగే నైజం, నాయకత్వ లక్షణాలు కలవారు ఎన్ వి ఎస్ రెడ్డి.

ప్రపంచీకరణ జరుగుతోంది. నగరాలు. ప్రైవేటు వాహనాలు పెరుగుతున్నాయి. గణాంకాలు చూస్తే ఒక పదేళ్ల తర్వాతదీనికి కనీసం నడవడానికి కూడా కష్టంగా ఉండే పరిస్థితి ఉంది. దానికి పరిష్కారం మెరుగైన రవాణా వ్యవస్థ ఉండాలి. అది కూడా సౌకర్యవంతంగా,సురక్షితంగా ఉండాలి. ఒకప్పుడు కారు సౌకర్యం. ఇప్పుడు కారు అవసరం. ప్రతి ఇంటికి ఒకటి, అంతకన్నా ఎక్కువ కార్లు ఉంటున్నాయి. ఫలితం కాలుష్యం. వీటన్నిటికీ ప్రత్యామ్నాయమే మెట్రో రైల్. మన దేశంలో ఢిల్లీ మొట్ట మొదటిసారిగా మెట్రోను ప్రవేశపెట్టింది. ఢిల్లీలో మెట్రో ఉన్నప్పుడు మనకెందుకు ఉండకూడదు? మనం కూడా ట్రాఫిక్, జనాభా ఎలా చూసినా ఢిల్లీతో సమానంగా పెరుగుతున్నాం. అందుకే మెట్రో ఎమ్ డి, ఎన్ వి ఎస్ రెడ్డి గారు హైదరాబాద్‌లో మెట్రో ఆలోచనకు శ్రీకారం చుట్టారు. ఢిల్లీ మెట్రో ఏడేళ్లలో కడితే హైదరాబాద్ మెట్రో ఐదేళ్ల నిర్మాణ వ్యవధిలోనే మన దగ్గరకు రాబోతోంది. ఇప్పటి వరకు ఏ ప్రమాదాలు నిర్మాణ సమయంలో జరగలేదు కాబట్టి 2013,14,15 కు గాను గోల్డ్ అవార్డు, గ్లోబల్ ఇంజనీరింగ ప్రాజెక్ట్ ఆఫ్ ద ఇయర్ అవార్డును హైదరాబాద్ మెట్రో పొందింది.
ఢిల్లీ, చెన్నై మెట్రోలు ప్రపంచస్థాయిలో ఉంటాయి. కాని స్టేషన్‌లోకి వచ్చే,పోయే దారులు ఎలా ఉంటున్నాయనేది పట్టించుకోరు. అదే ఇప్పుడు ఆ మెట్రోలకు, మన హైదరాబాద్ మెట్రోలకు ఉండబోయే తేడా. ఉప్పల్, మియాపూర్‌లలో స్టేషన్‌లు ప్రపంచ స్థాయికి దీటుగా కట్టడాలు జరిగాయి. అలాగే పరిస రాలు కూడా అదే ప్రమాణాలతో ఉండబోతున్నాయి. ప్రపంచం మొత్తం మీద ఇదే అతి పెద్ద రవాణా వ్యవస్థగా హైదరాబాద్ మెట్రో నిలవబోతోంది. ఈ ప్రాజెక్ట్‌లో జనం డబ్బు కూడా ఉంది. ట్యాక్సుల రూపంలో కట్టిన డబ్బు. ఈ ప్రాజెక్ట్ ఖర్చు మొత్తం దేశంలోనే ప్రముఖ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టి దే. తొంభై శాతం ఎల్ అండ్ టీది, పది శాతం భారత ప్రభుత్వం పెట్టుబడి పెట్టింది. మొత్తం కలిపి పెట్టుబడి పెట్టింది 20 వేల కోట్లు కాని, 50 వేల రూపాయల పెట్టుబడులకు దారి తీస్తుందని నమ్మకం. కారణం అంతకు రెట్టింపు అభివృద్ధి జరగబోతోంది.
మూడు అత్యధిక రద్దీ ప్రదేశాల్లో ..
ఈ ప్రాజెక్ట్ డిజైన్ బిల్ట్ పైనాన్స్ ఆపరేట్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అనే పద్ధతి మీద నిర్మాణం జరిగింది. అంటే, మొదట్లో 35 ఏళ్లలో ఎల్ అండ్ టీ తన డబ్బు తాను తిరిగి పొందుతుంది అనేది అంచనా. దానికి ఇంకో పాతిక సంవత్సరాలు పొడిగింపు జరిగితే అరవై ఏళ్లలో మళ్లీ తిరిగి డబ్బు పొందుతుంది. అందులో 50 శాతం టికెట్ ధరల నుంచి పొందుతుంది. రియల్ ఎస్టేట్ ద్వారా 45 శాతం, 5 శాతం

హైదరాబాద్ మెట్రో ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్. నేను ఇది కేవలం ఒక రవాణా సౌకర్యం లాగా చూడటం లేదు. మన నగరాన్ని పచ్చని నగరంగా చేయడం కోసం పనిచేయడం నాకు ఒక అవకాశంగా భావిస్తున్నాను. మన నగరం పేదల కోసం, ప్రజల కోసం, మహిళల కోసం, పిల్లల కోసం, ముసలివారి కోసం, శారీరక వైకల్యం కలవారి కోసం. ఇది నా కాన్సెప్ట్. మెట్రో ఒక సామాజిక, ఆర్థిక ఎజెండా. సాధారణంగా ఇంజీనీరింగ్ ప్రాజెక్ట్‌లను ఇంజనీర్లు సాంకేతిక కోణంలోనే చూస్తారు. కాని ఇంజనీరింగ్ అనేటువంటిది, సామాజిక,ఆర్థిక సమస్యలకు ఉపయోగపడే ఒక సాంకేతిక అవసరం. ఈ విషయం నేను మా ఇంజనీర్లకు కూడా ఎప్పుడూ చెప్తుంటాను.
సిటీలో క్రైమ్ రేట్ ఎందుకు పెరుగుతుంది? కూలీల పిల్లలు మురికివాడల్లో పెరుగుతారు. వాళ్లు కూలి పనులు చేసుకోడానికి వెళ్తారు. పిల్లలను పట్టించుకోరు. ఫలితంగా, వారికి వినోదం, ఆనందం ఉండవు. వారు నెమ్మదిగా చెడు అలవాట్లకు లోనవుతారు. అలాగే డబ్బున్నవారి పిల్లలు కూడా భార్య, భర్త డబ్బు సంపాదించడంలో బిజీ అయిపోతారు. వారి స్తోమతకు తగ్గట్టు పిల్లలను పబ్లిక్ స్కూల్‌లో పెట్టాలనుకుంటారు. కాని పక్కనుంచి ఆ పిల్లలు పాడవుతుంటారు. అందుకే అందరూ కొద్దిసేపు ఆనందంగా గడపడానికి అనువుగా ఉండే బహిరంగ ప్రదేశం అనేది చాలా అవసరం. ప్రభుత్వం కూడా పార్కులు,బహిరంగ ప్రదేశాల మీద, పిల్లల అభివృద్ధి మీద దృష్టి కేంద్రీకరించవలసిన అవసరం ఉంది. పల్లెల్లో చూస్తే పిల్లలకు కావలసినంత ఖాళీ ప్రదేశం ఉంటుంది. చెట్లు ఎక్కుతుంటారు. అల్లరి చేస్తుంటారు. అది బాల్యం. ఇక్కడ సిటీలలో అంతా మూసిపెట్టిన జీవితం. తరగతి గదులలో ఉండి. ఇంటికొచ్చి టీవీ ముందు గంటలు కూర్చుని ఊబకాయం బారిన పడుతుంటారు. అందుకే డెమోక్రసీ అండ్ పబ్లిక్ ప్లేస్ చాలా ముఖ్యం. పిల్లలకు వారి బాల్యం వారికి ఇవ్వాలి. మెట్రో స్టేషన్‌లు పిల్లలకు ఆ సౌకర్యం కల్పిస్తాయి.
మెట్రో నిర్మాణ సమయంలో 2 వేల మంది ఉద్యోగులు పనిలో ఉన్నారు. ఆపరేషన్స్ టైమ్‌లో ఒక ఐదు వేల మంది ప్రత్యక్షంగా పనిలో ఉంటారు. 20000 మంది ఇండైరెక్ట్ ఎంప్లాయీస్ ఉంటారు. మిగతా కార్మికుల్లాగా కాకుండా మెట్రో లేబర్ టర్మ్ చాలా బావుంటాయి. ఉప్పల్‌లో,మియాపూర్‌లో,కూకట్‌పల్లిలో వారికి ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో వైద్య సదుపాయాలు కల్పించారు. వేతనాలు కూడా సాధారణ వేతనాల కంటే చాలా ఎక్కువ వస్తాయి. వాళ్లందరికీ ముందుగానే శిక్షణ ఇచ్చి తీసుకువస్తారు. జడ్చర్ల దగ్గర పోలపల్లిలో కార్మికులకు శిక్షణా కేంద్రం ఉంది. ఎనిమిది, తొమ్మిది తరగతి చదివితే చాలు. వెల్డర్‌గా కాని, కార్పెంటర్‌గా కాని మూడు నెలల ముందు శిక్షణ ఇస్తారు. వారికి పని ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. కాంటాక్ట్ బేస్డ్‌గా కాదు. తెలంగాణ నుంచి మాకు కార్మికులు దొరికితే తీసుకోవడానికి మేము తయారే. కాని దొరకట్లేదు. ఎక్కువగా ఒరిస్సా, ఝార్ఖండ్ నుంచి వస్తున్నారు. ఎందుకంటే ఇది కష్టమైన పని. చాలామందికి ఏంటంటే ఏసీ రూమ్ బయట మాకు అటెండర్ పని కావాలంటారు. మేం ఉచితంగా శిక్షణ ఇస్తాం. శిక్షణలో స్టైఫండ్ కూడా ఉంటుంది.
ఢిల్లీ అత్యాచారం తర్వాత నేను నేను మూడేళ్ల క్రితం నిర్భయ కమ్మూట్ అనే టైటిల్‌తో ప్రత్యేక సెషన్‌లు నడిపాను. అసలు ప్రజలకు ఏం కావాలి? ఒకమ్మాయి బస్టాప్‌లో ఒంటరిగా బస్ కోసం నించుని ఉంటే ఏవిధంగా వేధింపులకు గురవుతుంది. ఆమె ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కుంటుంది? ఆమెకు ఎటువంటి సురక్ష కావాలి? అనేది అధ్యయనం చేసి మహిళలకు రక్షణగా మెట్రోలో పూర్తిగా కెమెరాలు పెట్టాం. ట్రెయిన్‌లోపల, స్టేషన్‌లో, బయటా అన్ని చోట్ల కెమెరాలున్నాయి. ఎవరూ కెమెరాల నుంచి తప్పించుకోలేరు. మహిళలకు పూర్తి సురక్షితమైంది. స్టేషన్ బయటకు వెళ్లిన తర్వాత మళ్లా సమస్య మొదలవుతుంది. అందుకే అక్కడ ఫీడర్ బస్‌లుంటాయి. అవి సురక్షితంగా వారిని వారి గమ్మాలకు చేరుస్తాయి. ఎప్పుడూ చీకట్లో నేరాలు జరుగుతాయి. బయట కూడా పూర్తి లైటింగ్ ఉంటుంది. అలాగే పిల్లలకు, ముసలివారికి ఎటువంటి సౌకర్యాలు కావాలి, అలాగే శరీర వైకల్యం ఉన్నవారికి కూడా పూర్తి స్థాయిలో కేర్ తీసుకునేలా ఏర్పాట్లు ఉంటాయి. హైదరాబాద్‌ని మేము పీపుల్ ఫ్రెండ్లీ గ్రీన్ సిటీ చేయాలనుకుంటున్నాం.

ప్రకటనల ద్వారా పొందుతుంది. ఈ అరవై ఏళ్లలో హైదరాబాద్ మెట్రో, తెలంగాణ తరపున ప్రత్యేక వాహనంగా నాణ్యతా నిర్వహణా కార్యక్రమాలు నిర్వర్తిస్తుంది. హైదరాబాద్‌లో మొత్తం 72 కిలోమీటర్ల దూరం వరకుమెట్రో నిర్మాణం జరుగుతుంది. ఎక్కడ మెట్రో అవసరం ఉంది అనే దాని మీద చాలా అధ్యయనం చేసి నగరంలో 3 అత్యధికంగా ట్రాఫిక్ కారిడార్స్(ప్రదేశాలు) ఎక్కడున్నాయో కనుక్కున్నారు. కారిడార్1-మియాపూర్ నుంచి ఎల్‌బీనగర్-29 కిలోమీటర్లు. ఆ దూరం బస్‌లో వెళితే ఒక గంట నలభై నాలుగు నిమిషాలు పడుతుంది. కారిడార్2-జూబ్లీ బస్ స్టేషన్ నుంచి ఫలక్‌నుమా. ఇది15 కిలోమీటర్లు. కారిడార్3 నాగోల్ నుంచి రాయదుర్గం-28 కిలోమీటర్లు.
గోడలన్నీ తెచ్చి అతికించేయడమే
మెట్రో నిర్మాణం కోసం పది అడుగులు తవ్వుతారు. అయితే మట్టి పరిస్థితిని బట్టి అది పది అడుగులా, ఇరవై అడుగులా అనేది ఉంటుంది. హైదరాబాద్ మెట్రో ప్రత్యేకత ఇంకోటి ఏంటంటే, ఢిల్లీ,చెన్నై మెట్రో చూస్తే కొంత పిల్లర్ మీద, కొంత అండర్ గ్రౌండ్‌లో ఉంటుంది. హైదరాబాద్ మెట్రో పూర్తిగా పైన వెళ్లే మెట్రో. మనకి అండర్‌గ్రౌండ్ లేదు. దీని ఇంకో ప్రత్యేకత, కేవలం రోడ్డు మీద మధ్యలో రెండు మీటర్ల వెడల్పు స్థలం ఉపయోగించి కట్టారు. వేరే నగరాల్లో మెట్రో కట్టేటప్పుడు నెలలపాటు రోడ్లు బ్లాక్ చేస్తారు. కాని హైదరాబాద్‌లో కేవలం పిల్లర్ మాత్రమే అక్కడే కట్టారు. మిగతాదంతా వేరేచోట తయారు చేసి రాత్రిపూట రవాణా చేసి తీసుకువచ్చి అతికిస్తారు. దాన్ని ప్రీ కాస్ట్ యాడ్స్ అంటారు. అవి, ఒకటి ఉప్పల్, కుత్బుల్లాపూర్‌లో ఉన్నాయి. దానివలన ట్రాఫిక్ సమస్య లేదు. గోడల మీద నీళ్లు కొట్టడం లాటివి లేవు. అలా సరికొత్త సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. స్టేషన్‌లు కూడా పూర్తి విభిన్నమైన కాన్సెప్ట్. పక్షికి ఎలాగైతే వెన్ను, రెక్కలు ఉంటాయో అలానే స్టేషన్లకు కూడా మధ్య వెన్నులాగా ఉంటుంది, స్టేషన్ కట్టిన ప్రదేశం ఆధారంగా 140 పొడవు స్టేషన్లు కట్టారు. అవి కూడా ఒక్క పిల్లర్ మీదనే తయారయినవే అలాగే ప్రీ కాస్ట్ కూడా. ప్రతి స్టేషన్‌కి రెండువైపులా ఎస్కలేటర్లు,లిఫ్టులు,మెట్లు ఉంటాయి.
గృహిణుల అవసరాలు తీరుస్తుంది
మెట్రోకి మూడు ఇంటర్ ఛేంజ్ స్టేషన్లు ఉండబోతున్నాయి. ఒకటి అమీర్‌పేట, ఇంకోటి పెరేడ్ గ్రౌండ్స్, ఎమ్ జీ బి ఎస్. ఒకటి సాధారణ స్టేషన్, ఇంకోటి ఇంటర్ ఛేంజ్ స్టేషన్. సాధారణ స్టేషన్ చూస్తేలో రోడ్డు లెవల్, కాన్‌కోర్స్ లెవల్, ప్లాట్‌ఫాం లెవల్ ఉంటుంది. అదే ఇంటర్ చేంజ్‌లో రెండు లెవల్స్ ఉంటాయి. ఉదాహరణకు ఎల్ బీ నగర్ నుంచి హైటెక్ సిటీ వెళ్లాలంటే మధ్యలో అమీర్ పేటలో దిగి ఇంకో ట్రెయిన్ ఎక్కి వెళ్లచ్చు. స్టేషన్ లోపల అన్ని రకాల సదుపాయాలు ఉండబోతున్నాయి. సాధారణంగా ఒక మహిళకు ఏం అవసరమవుతాయో అవన్నీ మెట్రో స్టేషన్‌లో దొరుకుతాయి. గృహిణులకు అవసరమ్యే రోజువారీ సరుకులు, ఫ్యాషన్ సంబందించిన దుకాణాలు, రెస్టారెంట్లు, కియోస్కులు ఇలా అన్ని రకాలైన వర్గాల వారీగా సౌకర్యాలు కల్పించబోతున్నారు. అందులోనూ ఆ ప్రదేశం బట్టి, అంటే హైటెక్ సిటీలో పార్లర్స్, అలా అక్కడి మనుషుల కొనుగోలు స్థాయిని బట్టి స్టాల్స్ ఉంటాయి. ప్లాట్‌ఫాం బయటనే ఉండే ఈ సదుపాయాలన్నీ కేవలం ప్రయాణీకులకే కాకుండా బయటివారికి కూడా అందుబాటులో ఉంటాయి. ఎవరైనా కొనుక్కోవచ్చు. దానికి టికెట్ కొనుక్కోవాల్సిన పనిలేదు.
ఎక్కడ కావాలంటే అక్కడ స్కైవాక్ సిద్ధం
మెట్రో చుట్టు పక్కల కూడా ప్రపంచ స్థాయి మెట్రో స్టేషన్‌లాగా ఉండబోతోంది. స్టేషన్‌లో స్టాల్స్ పెట్టుకోవడానికి చాలా సాధారణ రుసుము ఉంటుంది. ఎల్ అండ్ టి వాళ్లు టెండర్‌లు పిలుస్తారు. వారికి పెట్టిన పెట్టుబడిని తిరిగి పొందేందుకు అదే దారి. స్టేషన్ పరిసరాలు మహిళలు, పిల్లలు, వయోవృద్ధులు,వివిధ రకాల శారీరక వైకల్యం కలవారు ఇలా అందరికీ సదుపాయంగా ఉండబోతోంది. ఉదాహరణకు, ఎవరి సహాయం అవసరం లేకుండా అంధులకు కర్ర తాటించుకుంటూ ప్లాట్‌ఫాం వరకు వెళ్లడానికి ప్రత్యేక మార్గం ఉంటుంది. అదేవిధంగా స్కైవాక్స్ సౌకర్యం మెట్రోకి హైలైట్. బేగంపేట లాటి రద్దీ ప్రాంతంలో రోడ్డు దాటటం కష్టం. హాస్పటళ్లు, స్కూళ్లు లాటివి పరిగణనలోకి తీసుకుని స్కైవాక్స్ అందించబోతున్నారు. దానివలన స్కూలు పిల్లలు ఆ స్టాప్ దగ్గర ట్రెయిన్ దిగితే రోడ్డు దాటక్కర లేకుండా స్కూలు లోకి వెళ్లిపోతారు. ఇప్పుడు ఒక అపార్ట్‌మెంట్ లేదా కమ్యూనిటీ ఉందనుకోండి. మీరు మాకు స్కైవాక్ సౌకర్యం కలగచేయమని అడిగితే మెట్రో వారు చేస్తారు.
భూకంపం వచ్చినా ఏం కాదు
ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో రైల్వే హైదరాబాద్ లిమిటెడ్ కంపెనీతో పాటు ఇంకా కొన్ని కంపెనీలు అసోసియేట్ అయి ఉంటాయి. ఉదాహరణకు, ఎల్ అండ్ టీ నిర్మాణం చేస్తే, కియోలిస్ అనే ఫ్రెంచి కంపెనీ ప్రపంచంలో చాలా మెట్రోల నిర్వహణ చూస్తారు. ట్రైన్ డ్రైవర్‌లు, కార్యాచరణ ఇదంతా వాళ్లు చూసుకుంటారు. ట్రెయిన్ కోచ్‌లు హ్యుండయ్ రాటెర్, సౌత్ కొరియన్ కంపెనీ. అది మెట్రో కోచ్‌లు సరఫరా చేస్తుంది. ప్రతి మెట్రో 8 సిస్మిక్ అరెస్టర్‌ను ప్రతి పిల్లర్‌కు ఏర్పాటు చేస్తారు. ఒకవేళ భూకంపం వచ్చినా అది తట్టుకోగలదు.
ఒక ట్రెయిన్‌తో ఇంకోటి మాట్లాడుతుంది
ముందుగా మూడు కోచ్‌లున్న ట్రెయిన్ అందుబాటులోకి వస్తుంది. అంటే ప్రతి డ్రైవర్‌కి మూడు కోచ్‌లు. రెండు వైపులా డ్రైవర్‌లు ఉంటారు. ఒక ట్రైన్ వెయ్యి మంది పాసింజర్లను రవాణా చేస్తుంది. భారతదేశంలో మొట్టమొదటి సారిగా హైదరాబాద్‌లో కమ్యూనికేషన్ బేస్డ్ కంట్రోల్డ్ ట్రెయిన్‌లను నడపబోతున్నారు. అంటే మెట్రో ట్రెయిన్ల డ్రైవర్లు ఒకళ్లతో ఒకళ్లు మాట్లాడుకుంటారు. ఆ సాంకేతికత వలన ప్రతి రెండు నిమిషాలకు ఒక ట్రెయిన్ నడిచే అవకాశం కలుగుతుంది. కలిగే లాభాలవి. ఉదాహరణకు, సికిందరాబాద్ స్టేషన్ ఉందను కోండి. ఉప్పల్,మియాపూర్ డిపోలలో ఆపరేషన్ కంట్రోల్ సిస్టమ్స్ ఉంటాయి. అక్కడి నుంచి రెండు ట్రెయిన్‌లు మాట్లాడుకోవచ్చు. ఒక ట్రాక్ మీద రెండు ట్రెయిన్లు వెళ్తున్నాయి అంటే అవి ఎంత దూరంలో ఉన్నాయో కనుక్కుంటారు.
పూర్తి వెలుగులో నడుస్తుంది
ఎమ్ ఎమ్ టీ ఎస్ స్టేషన్లు, బస్ డిపోలు, రైల్వేస్టేషన్లతో అనుసంధానం చేస్తున్నారు. మెట్రో రైళ్లు కూడా సాధారణ రైల్వే ప్లాట్ ఫామ్‌ల మీద ఆగుతాయి. మెట్రో స్టేషన్లు పర్యావరణ స్నేహితంగా ఉండనున్నాయి. హైదరాబాద్‌లో అండర్‌గ్రౌండ్ మెట్రో వేయకపోవడానికి కారణం, హైదరాబాద్‌లో భూమిలో రాళ్లు ఉంటాయి. ఒక స్టేషన్ కట్టాలంటే 140 మీటర్ల లోతు తవ్వాలి. దానికి చాలా నెలలు పడుతుంది. దానికి అయ్యే ఖర్చు కూడా అదనం. పైగా అండర్ గ్రౌండ్ అంటే వెలుగు ఉండాలి. మళ్లీ అంత కరెంట్ ఖర్చు. అదే పైన నడిచే మెట్రో అయితే, ఒక టిపికల్ స్టేషన్ చూశారంటే రాత్రి అయితే తప్ప లైటు వేయాల్సిన అవసరం ఉండదు. ఓపెన్ వెంటిలేషన్. మెట్రో కోచ్‌లు కూడా సరికొత్త సాంకేతికతతో తయారయినవి. ట్రెయిన్ నడుస్తున్నప్పుడు 35 శాతం శక్తిని ఇంజన్‌కి తిరిగి పంపేస్తుంది. ఒకటి మియాపూర్,ఒకటి ఉప్పల్‌లో మెట్రో ఆపరేషన్ కంట్రోల్ సెంటర్ ఉంటాయి. ప్రతి ట్రెయిన్‌ని అవి మానిటర్ చేస్తాయి.

అన్ని వర్గాల వారికీ ప్రత్యేక సదుపాయాలు

ముందుగా మెట్రో చుట్టుపక్కల కాలనీలు ఏమున్నాయో అధ్యయనం చేశారు. స్టేషన్‌కి అటువైపు, ఇటువైపు ఎన్ని ప్రాంతాలున్నాయో చూశారు. సాధారణంగా ట్రెయిన్ దిగిన తర్వాత ఆటోనో, లేక మళ్లీ బస్సో ఎక్కి వెళ్లాలి. ఆ అవసరం లేకుండా ఫీడర్ బస్ సేవలను అందిస్తోంది మెట్రో. అవి ఫలానా కాలనీ నుంచి ఫలానా కాలనీకి అంటూ వెళ్తాయి. ఆ బస్‌లతో ఇంటివరకు వెళ్లిపోయే సౌకర్యం ఉంటుంది. అలాగే ప్రతీ స్టేషన్ దగ్గర సైకిళ్లు అందుబాటులో ఉంటాయి. అవి తీసుకుని మీ ఇంటికి వెళ్లిపోవచ్చు. దాని వలన కాలుష్యం తగ్గుతుంది. పర్యావరణానికి కూడా రక్షణ. హైదరాబాద్‌లో కార్బన్ ఉనికిని తగ్గించడమే మెట్రో ధ్యేయం. అదే కాకుండా, పార్కింగ్ ప్రదేశం ఉంటుంది. దానికి కూడా ప్రభుత్వ స్థలాలను వాడుతున్నారు. వాహనాలకే కాదు, కాలి నడకకు కూడా ప్రత్యేక సదుపాయం ఉంటుంది. మెట్రో స్టేషన్ ఎలా ఉండబోతోందంటే మీ ఇంటి నుంచి మీరు సాయంత్రం స్టేషన్ పరిసర ప్రాంతంలో హాయిగా కాసేపు గడిపి వెళ్లచ్చు. పిల్లలు ఆడుకోవడానికి ఏర్పాట్లు ఉంటాయి. ఖాళీ ప్రదేశం, పార్కు అన్నీ ఉంటాయి. ఒక కుటుంబం ఆనందంగా, ఆహ్లాదంగా తమ సమయం గడపడానికి వీలుగా ఉంటుంది.

మెట్రో డ్రైవర్లందరూ మహిళలే
మెట్రో ట్రెయిన్‌లకి అందరూ మహిళా డ్రైవర్లుంటారు. మహిళా సాధికరతే లక్షంగా. వాళ్లకి ప్రతిరోజూ శిక్షణ ఉంటుంది. ఆపరేషన్ కంట్రోల్ సెంటర్ ఉప్పల్ నుంచి ట్రెయిన్‌ని నడపగలుగుతుంది. వాళ్లు కావాలంటే ట్రెయిన్‌ని నడపగలరు, ట్రెయిన్‌ని ఆపగలరు. అది మెయిన్ ఉప్పల్. స్టాండ్‌బై మియాపూర్‌లో ఉంది. మెట్రో స్టేషన్ ఉపయోగించుకునే ఇంకో సరికొత్త సాంకేతికత, ఆటోమేటిక్ టికెట్ డబ్బుల స్వీకరణ. మీరు క్రెడిట్ కార్డు, లేదా డెబిట్ కార్డుతో కాని, డబ్బులు ఇచ్చి కాని ఆ మెషిన్ నుంచి టికెట్ కొనుక్కోవచ్చు. టికెట్ పది రూపాయలనుకోండి. మీరు వంద రూపాయలు ఇస్తే తిరిగి తొంభై రూపాయలు ఇచ్చేస్తుంది. ఇంకోటి స్మార్ట్ కార్డ్ అని స్టేషన్‌లో తీసుకోవచ్చు. ఉదాహరణకు 500 రూపాయలకు చార్జి చేయించుకుంటే మీరు దాని ద్వారా టికెట్ తీసుకోవచ్చు.
ముఖ్యాంశాలు
మొత్తం ప్రాజెక్ట్ ఖర్చు-14,320, కోట్లుభారతప్రభుత్వం-1,458 కోట్లు, ఎల్ అండ్ టీ మెట్రో-12,674 కోట్లు, తెలంగాణ అదనపు ఖర్చు-1,980 కోట్లు
పబ్లిక్,ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రపంచంలోనే అతి పెద్ద మెట్రో రైల్ ప్రాజెక్ట్ హైదరాబాద్ మెట్రో
ప్రతి ఒక కిలోమీటర్‌కు ఒక మెట్రో స్టేషన్ ఉంటుంది. 63 ప్రదేశాలలో మొత్తం 66 స్టేషన్‌లు ఉంటాయి(3 ఇంటర్‌ఛేంజ్ స్టేషన్లతో సహా)
ప్రత్యేక ఉపయోగాలు
మూడు కోచ్‌లున్న ట్రెయిన్‌లో 1000 మంది, ఆరు కోచ్‌లున్న ట్రెయిన్‌లో 2000 మంది, ఈవిధంగా హైదరాబాద్ మెట్రో ప్రతి గంటకూ 50000 మంది ప్యాసింజర్‌లను రవాణా చేస్తుంది.
రద్దీ ఎక్కువగా ఉన్న సమయాల్లో ప్రతి మూడు, ఐదు నిమిషాలకు ఒక ట్రెయిన్.
రక్షణ కోసం కోచ్‌లలో కెమెరాలు, స్టేషన్లలో సీసీటీవీల ఏర్పాట్లు.
అత్యున్నత ప్రమాణాలతో తయారైన తేలికపాటి ఆటోమేటిక్ ట్రెయిన్ తలుపులు. కేవలం స్టేషన్లలో మాత్రమే తెరుచుకుంటాయి.
వెళ్లడానికి,రావడానికి మార్గం అధునాతనం
రోడ్డు మీద వెళ్తే గంటకు 34 కిలోమీటర్ల వేగం, మెట్రో ట్రెయిన్ ప్రతి గంటకు 80 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది.
ఏమాత్రం శబ్ద కాలుష్యం లేకుండా, ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా నిశ్శబ్దంగా గాలిలో నడిచే మెట్రో ట్రెయిన్‌లు.
రోడ్డుతో పోల్చితే 1/5 వ భాగం మాత్రమే శక్తి వినియోగం
కాలుష్యం,కార్బన్ తగ్గించి పర్యావరణ స్నేహితంగా ఉంటాయి.