Search
Wednesday 21 November 2018
  • :
  • :

అమీర్‌పేట్ టు ఎల్బీనగర్ మెట్రో పరుగులు

ఈ మార్గంలో ఆగస్టులో ప్రారంభం
అక్టోబర్‌లో అమీర్‌పేట్‌హైటెక్‌సిటీ మార్గం
అన్ని ప్రాంతాల నుంచి ఎయిర్‌పోర్టుకి మెట్రో అనుసంధానం
“స్టాంప్‌” ఛాలెంజ్ కార్యక్రమంలో మెట్రో ఎండి ఎన్వీఎస్ రెడ్డి

rayadurgam to shamshabad metro route work

మన తెలంగాణ/హైదరాబాద్ సిటీబ్యూరో : మెట్రో పను లు శరవేగంగా జరుగుతున్నాయని, ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాన్ని కల్పించడానికి సరికొత్త ఆలోచనలకు శ్రీకారం చుడుతున్నామని మెట్రో ఎండి ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. మెట్రోకు లాస్ట్ కనెక్టివిటీని అభివృద్ధి చేయడంలో భాగంగా స్టాంప్ (స్టేషన్ యాక్సెస్ అండ్ మొబిలిటీ ప్రోగ్రాం) ఛాలెంజ్ కార్యక్రమం శనివారం బంజారాహిల్స్‌లోని ఓ ప్రముఖ హోటల్లో జరిగింది. దీనికి సంబంధించి డబ్లూఆర్‌ఐ ఇండియా, టయోటా మొబిలిటీ ఫౌండేషన్‌తో మెట్రో, ఎల్‌అండ్‌టీ ఎంఓయు కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా ఎన్వీఎస్.రెడ్డి మాట్లాడుతూ అమీర్‌పేట్-ఎల్బీనగర్ మెట్రో మార్గాన్ని ఆగస్టులో ప్రారంభిస్తున్నామని, అక్టోబర్‌లో అమీర్‌పేట్-హైటెక్‌సిటీ మార్గాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల నుంచి సరికొత్త ఆలోచనలను ఆహ్వానించడానికి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. మెట్రో ఫస్ట్ మైల్ టు లాస్ట్ మైల్ కనెక్టివిటీ వరకు ప్రజా రవాణాను అందించేందుకు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలన్నారు.

NVSREDDY

హైదరాబాద్ మెట్రోను ‘గూగుల్’కు అనుసంధానం చేస్తామని ఆయన తెలిపారు. మెట్రో రైలులో రోజుకు 80 వేల మంది ప్రయాణిస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం అమీర్‌పేట్-ఎల్బీనగర్ వరకు ఎలక్ట్రిసిటీ టెస్ట్ రన్ జరుగుతోందని చెప్పారు. జులై చివరి నాటికి ట్రయల్ రన్ పూర్తి చేసి ఆగస్టులో ప్రారంభిస్తామని చెప్పారు. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు మెట్రో మార్గాన్ని 2019 మార్చిలోగా పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. పాతబస్తీలో మెట్రో ఏర్పాటుపై చర్చలు జరుగుతున్నాయని, దానికి సంబంధించిన స్థల సేకరణ పనులు చేపడుతున్నట్లు చెప్పారు. మెట్రో రెండవ దశలో భాగంగా అన్ని ప్రాంతాల నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు మెట్రోను అనుసంధానం చేస్తామని తెలిపారు. నాగోల్ నుంచి ఎల్బీనగర్ మీదుగా ఫలక్ నుమా వరకు మెట్రో పిల్లర్స్‌కు ప్రత్యేక యూనిక్ నంబర్లను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. కారిడార్1కు ‘ఏ’, కారిడార్2కు ‘బి’, కారిడార్3కు ‘సి’ నంబరింగ్ ఇస్తున్నట్లు చెప్పారు. నాగోల్ నుంచి శంషాబాద్ వరకు మెట్రోను అందుబాటులోకి తేనున్నట్లు, రెండవ దశకు సంబంధించి డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టును ఈ నెల చివరి వరకు ఢిల్లీ మెట్రో రైల్ కమీషన్ పూర్తి నివేదికను సమర్పించనున్నట్లు ఆయన చెప్పారు.

మెట్రో స్టేషన్ల నుంచి గమ్య స్థానాలకు చేరుకునే విధంగా రవాణా సౌకర్యాల కల్పనకు అనుగుణంగా సరికొత్త ఐడియాలతో పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని తెలిపారు. ఒక నెల రోజులు వీరికి సమయం ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎవరైతే తమ ఆలోచనలకు దగ్గరగా లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఐడియాలతో వస్తారో వారికి 50వేల డాలర్లు బహుమతిగా ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు. రానున్న రోజుల్లో అన్ని మెట్రో స్టేషన్లలో వెహికిల్ చార్జింగ్ స్టేషన్లు పెడుతున్నామని ఆయన తెలిపారు. ఎలక్ట్రానిక్ వాహనాలు వాడకంతో కాలుష్య రహిత హైదరాబాద్‌గా ముందుకు దూసుకుపోతోందన్నారు. ఈ కార్యక్రమంలో డబ్లూఆర్‌ఐ ఇండియా ప్రతినిధిలు ప్రమోద్ గోడె, సుదీప్ మైతి, టిఎంఎఫ్ ప్రతినిధి ఆయోమా, ఐటీ ప్రిన్సిపాల్ సెక్రటరీ జయేష్ రంజన్, రోడ్‌సేఫ్టీ అథారిటీ ఛైర్మెన్ ఐపిఎస్ క్రిష్ణప్రసాద్, టోక్యో కిర్లోస్కర్ మోటర్స్ శేఖర్, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు.

Comments

comments