Home ఎడిటోరియల్ జి.యస్.టి అయోమయం

జి.యస్.టి అయోమయం

వాహెద్

GST-New

కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా తీసు కుంటున్న చర్యలు అయోమయానికి మారుపేరుగా కనబడుతున్నా యంటే తప్పులేదు. నోట్ల రద్దుతో యావత్తు దేశాన్ని అయోమయా వస్థకు గురి చేశారు. నోట్లరద్దు వల్ల గొప్ప ప్రయోజనాలు సాధిస్తామన్నారు. ఇప్పటి వరకు ఆ ప్రయోజనాలేమిటో తెలియలేదు కాని కరెన్సీ కష్టాలు పేదలను వేధిస్తున్నాయి. ఆన్‌లైన్ పేమెంటులు చేయమంటున్నారు, మరోవైపు సర్వీసు ప్రజల జేబుకు చిల్లు పెడుతున్నారు. ఆర్ధికరంగంలో మరో విప్లవంగా చెప్పుకుంటూ ఇప్పుడు జియస్‌టి తీసుకొచ్చారు. ఇది మరో అయోమయానికి ప్రారంభంలా కనబడుతోంది. వ్యాపారవర్గాలే కాదు, ప్రభుత్వాధికారుల్లోను జియస్‌టి విషయంలో అనేక అనుమానాలు, అయోమయాలు కనబడుతున్నాయి. తగిన ఏర్పాట్లు లేకుండా హడావిడిగా ప్రచారం కోసం చర్యలు తీసుకోవడానికి పెట్టింది పేరు బిజెపి అని మరోసారి రుజువైంది.

విభిన్న జియస్‌టి శ్లాబుల విషయంలో అయోమయం, ఎంత అయోమయం అంటే, రెస్టారెంటులో కూర్చుని తింటున్నప్పుడు లోపల తింటే ఒక పన్ను, బయట లాన్ లో కూర్చుని తింటే మరో పన్ను. నానావిధ శ్లాబుల తో వ్యాపారవర్గాలను అయోమయంలో నెట్టడమే కాదు, ప్రభుత్వాధి కారులు వ్యాపారులను వేధించే చక్కని అవకాశాన్ని, అవినీతి పెరిగే మరో అవకాశాన్ని కల్పించారు. ఇందులో యాంటీ ప్రాఫిటరింగ్ రూలొకటి ఉంది. తక్కువ పన్ను ల వల్ల వచ్చే లాభాన్ని కంపెనీలు తీసుకోరాదు, వినియోగదారులకు ఇవ్వాలి. కాని వస్తువుల అమ్మకం ధర ఎలా నిర్ధారించాలన్న వివరణ లేదు. అసలు లాభాలే లేకుండా నష్టాల్లో నడుస్తున్న వ్యాపారాలు ఏం చేయాలన్న వివరణ కూడా లేదు. తక్కువ టాక్స్ శ్లాబ్ ఉన్నప్పుడు ఆ లాభాలను వినియోగదారు లకు పంచలేదని ప్రభుత్వం భావిస్తే ఆ వ్యాపారాన్ని మూయించవచ్చు. ఇది వ్యాపారులకు చావుదెబ్బ అవుతుంది. మలేషియాలో కూడా ఇలాంటి ప్రయత్నాలు తీవ్రమైన సమస్యలకు కారణమయ్యాయన్నది గుర్తుంచుకోవాలి.

జియస్‌టి రిటన్ ఫారముల విషయంలోను అయోమయమే, వ్యాపా రులు 37 రకాల ఫారములు నింపాలి. ప్రతి రాష్ట్రంలోను ఇది తప్పదు. అంటే 20 రాష్ట్రాల్లో బిజినెస్ ఉన్న కంపెనీ ఏటా 740 ఫారములు దాఖలు చేయాలి. మరో వైపు సెంట్రల్ టాక్స్ అధికారులు, స్టేట్ టాక్స్ అధికారులు ఉన్నారు. ఎవరు ఏం చేయాలన్నది కూడా అయోమయమే. మరోసారి అయోమయం సృష్టించి కేంద్రప్రభుత్వం ముఖ్యంగా కార్పోరేట్ సెక్టరుకు ప్రయోజనాలు కట్టబెట్టాలని చూస్తోంది.

జియస్‌టి విషయంలో బిజెపి, కాంగ్రెసు రెండు పార్టీలకు తేడా లేదు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఈ చట్టం అమలులోకి వస్తుంది. ఈ సందర్భంగా పార్లమెంటుకు హాజరు కావడం లేదని కాంగ్రెసు తెలిపింది. వామపక్షాలు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం లేదని కమ్యునిస్టు పార్టీ నాయకుడు డి.రాజా తెలియజేశాడు. దేశంలో చిన్ని వ్యాపారులు, మధ్య స్థాయి వ్యాపారులు నిరసన చేస్తున్నారని అన్నారు. జియస్‌టిలోని వివిధ అంశాలను విమర్శిస్తూ కాంగ్రెసు నాయకుడు వీరప్ప మొయిలీ ఇది ఒక పీడకలగా మారుతుందన్నాడు. యుపిఏ కాలంలోను జియస్‌టి అమలు చేయడానికి తీవ్రంగా ప్రయత్నించారు. అప్పుడు బిజెపి తీవ్రంగా వ్యతిరేకిం చింది.

జియస్‌టి వల్ల పేదలకు నష్టమని వాదించింది. అదే పార్టీ ఇప్పుడు జియస్‌టి పాట పాడుతోంది. ఈ విషయాన్నే మొయిలీ కూడా సభలో చెప్పాడు. ఇప్పుడు బిజెపి హడావిడిగా తీసుకొస్తున్న ఈ చట్టం అయోమయా న్ని సృష్టించడమే కాదు, ఇందులో యాంటీ ప్రాఫిటీరింగ్ నిబంధన వ్యాపారుల పాలిట పీడకలగా మారుతుందన్నాడు. కాంగ్రెసు జియస్‌టి తీసుకురావాలని ఏడెనిమిదేళ్ళ క్రితమే ప్రయత్నించిందని, అప్పుడు బిజెపి వ్యతిరేకత వల్ల దేశానికి ఏటా లక్షన్నర కోట్ల నష్టం వాటిల్లిందని, ఏడెనిమిదేళ్ల మొత్తం నష్టం దాదాపు పన్నెండు లక్షల కోట్లని చెప్పాడు. ప్రస్తుతం మోడీ ప్రభుత్వం జియస్‌టి పేరుతో చేసిన చట్టంలో అనేక పన్నుల శ్లాబులతో అయోమయం సృష్టిస్తున్నారని, యుపిఏ తలపెట్టిన జియస్‌టి ఇది కాదని విమర్శించాడు. ఒకే దేశం ఒకే టాక్స్ అన్నది ఇందులో లేనే లేదని, దేశంలో రియల్ ఎస్టేట్ సెక్టరులో చాలా బ్లాక్ మనీ ఉంటుందనీ, కాని ప్రభుత్వం జియస్‌టిలో రియల్ ఎస్టేట్‌ను చేర్చలేదని విమర్శించాడు. జియస్‌టి అమలయ్యాక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల టాక్స్ అధికారులు, టాక్స్ వ్యవస్థల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడు తుందని కూడా ఆయన జోస్యం చెప్పాడు. ప్రభుత్వం జియస్‌టి తీసుకొచ్చిన పద్ధతిని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించాయి.

కేంద్రం కాని, రాష్ట్రాలు కాని జియస్‌టి అమలుకు పూర్తిగా సిద్ధంగా లేవన్నది స్పష్టం. వివిధ శ్లాబులు, అయోమయాల కారణంగా చిన్నస్థాయి వ్యాపారులు, సర్వీస్ ప్రొవైడర్లకు చావుదెబ్బగా మారవచ్చు. అందుకే వాళ్ళంతా నిరసన తెలియజేస్తున్నారు. ర్యాలీలు తీస్తున్నారు. ఢిల్లీలోను ఇతర నగరాల్లోను మార్కెట్లు మూతబడ్డాయి. నిరసనగా బంద్ పాటిస్తున్నారు. చిన్న వ్యాపారులు, సర్వీస్ ప్రొవైడర్ల ముఖ్యమైన సమస్య జియస్‌టికి అనుగుణంగా వ్యవహరించే ఇన్ ఫ్రాస్టక్చర్ వారి వద్ద లేదు. అంటే అర్ధమేమిటి? ఇది ఆలోచించవలసిన ప్రశ్న. భారతదేశంలో చాలా వరకు రిటైల్ వ్యాపారాలు, సర్వీసులు అవ్యవస్థీకృత రంగంలోనే ఉన్నాయి. దాదాపు పదికోట్ల చిన్న వ్యాపారులు, దుకాణదారులు ఉన్నారు. ఇందులో దాదాపు అరవై శాతం మందికి కంప్యూటరు తెలియదు. అంటే దాదాపు ఆరుకోట్ల మంది చిన్న వ్యాపారులకు కంప్యూటరుపై వ్యవహారాలు నడపడం రాదు. జియస్‌టి కేవలం కంప్యూటరు ద్వారా మాత్రమే అమలవుతుంది. కంప్యూటరును జియస్‌టిఎన్ నెట్‌వర్కుకు అనుసంధానం చేసుకోవాలి. ఆ నెట్‌వర్కులో వ్యాపారులు, దుకాణదారులు రిజిష్టరు చేసుకోవాలి. కంప్యూటరు అంటే తెలియని చిన్న వ్యాపారికి ఇది చాలా సమస్యాత్మకం అవుతుంది.

ఈ సమస్యలను ప్రభుత్వం ముందు ఊహించలేదా? అలా ఊహించే అలవాటు ప్రభుత్వానికి లేదని నోట్లరద్దు నిర్ణయంలోనే తెలిసింది. దేశంలో వెయ్యికి పైగా టాక్స్ కట్టే కేంద్రాలను వ్యాపారుల కోసం తెరిచామని కేంద్రం అంటోంది. కాని కోట్లాది జియస్‌టి ఎసెస్‌మెంట్లున్నప్పుడు వెయ్యి కేంద్రాలు ఎక్కడ సరిపోతాయి. మరోసారి డిమానిటైజేషన్ మాదిరి కొల్లేటి చాంతాడు క్యూలు మనం చూడబోతున్నాం. దేశాన్ని క్యూల్లో నిలబెట్టిన ఘనత ఖచ్చితం గా మోడీకే దక్కుతుంది. నెలకు మూడుసార్లు వ్యాపారులు తమ టాక్స్ పత్రాలు దాఖలు చేయడానికి ఈ క్యూల్లో నిలబడాలి. మరో విషయమేమంటే, ఇంత ఆన్‌లైన్ లోడ్ వచ్చినప్పుడు జియస్‌టిఎన్ నెట్‌వర్క్ దాన్ని తట్టుకుంటుందా అన్నది.

అనేక అయోమయాలతో జియస్‌టి మన ముందుకు వచ్చింది. డయాగ్న స్టిట్ సర్వీసు నడిపే వ్యక్తి ప్రతి రాష్ట్రంలోను నేడు దాదాపు 49 ఫారాలు దాఖలు చేయాలి. పది రాష్ట్రాల్లో ఈ వ్యాపారం నిర్వహిస్తుంటే దాదాపు 490 ఫారాలు దాఖలు చేయాలి. ప్రస్తుతం కేవలం రెండు ఫారాలు మాత్రమే దాఖలు చేస్తున్నారు. భారత జిడిపిలో దాదాపు 60 శాతం సర్వీస్ ప్రొవైడర్లే అందిస్తున్నారు. ఇప్పుడ జియస్‌టి వల్ల ఈ సర్వీస్ సెక్టారుపై ఎలాంటి ప్రభావం పడబోతోందో ఆలోచించుకోవచ్చు. కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ ఇంతవరకు జియస్‌టి గురించి అవగాహన ప్రయత్నాలన్నీ పెద్ద పెద్ద వ్యాపార సంస్థలకే నిర్వహించింది. పెద్ద పెద్ద కార్పోరేట్ సంస్థలకు అవసరమైన వనరులు ఉంటాయి.

లాయర్లను, ఎక్కౌంటెంట్లను పెట్టుకుంటాయి. చిన్న వ్యాపారికి ఈ సౌకర్యాలు ఉండవు. చిన్న వ్యాపారాలు మూతపడి కార్పోరేట్ చైన్ షాపులు వృద్ధి చెందుతాయి. అదే మోడీ గారు కోరుకునేది.
మంచి ఆలోచన కూడా అమలులో చెడ్డది కావచ్చు. జియస్‌టి విషయం లో కూడా చాలా మంచిదని చాలా మంది చెప్పారు. కాని ఇప్పుడు అమలు కాబోతున్న తీరు వల్ల ఇది మంచి ఆలోచనగా మిగలలేదు. 0%, 5 %, 12 %, 18 %, 28 % ఇలా వివిధ పన్నుల శ్లాబుల అయోమయం ఒకవైపు ఉంటే, 28% పన్నుల పరిధిలో దాదాపు 19% వస్తువులు, సేవలు వస్తున్నట్లు తెలు స్తోంది. పన్నుల వ్యవస్థ ఏదయినా రిటైల్ రంగంలో వ్యాపారులకు అవగాహన కల్పించడం చాలా ముఖ్యం. ఆ పని ప్రభుత్వం చేయలేదు.