Home దునియా మంత్రసాని సాయమ్మ

మంత్రసాని సాయమ్మ

                        Taatalu

అవ్వా! పోచవ్వా నువ్వు ముని మనుమలను, మనుమరాండ్లను సూసినవు. ఎన్నో కాన్పులను సూసినవు. కాన్పులను సేసినవు. నీకు సేసుకున్నవు. నీ బిడ్డకు సేసినవు. నీ బిడ్డ బిడ్డకు సేసినవు. నీ బిడ్డ మనుమరాలకు సేసినవు. ఆ పిల్లకు కాన్పు జేసుటానికి ఎంత కష్టమాయె. ఎంతో గోసాయె. ఊళ్ళె సరైన వైద్యుడు లేక కన్నాగురం దాక తీసుకపోవాల్సచ్చె. ఇయ్యాల్ల రేపందరు దవాఖాన్ల ఎంటబడిరి. బస్సులకెల్లి దిగి హాస్పిటల్‌ల సేరిందో లేదో పొల్ల నీల్లాడె. వెయిలు ఖర్సాయె.

ఊళ్ళెకు అందరికంటె పెద్దవయసు దానివి నువ్వు. గిప్పుడే గింత కష్టమయిందంటె గప్పుడెంత కష్టముండెనో. అంది పోచవ్వ మనుమరాలు వయసు పిల్ల లచ్చవ్వ. అవుబిడ్డ. ఎప్పటి కష్టాలప్పటియె. అప్పుడో తీరు కష్టాలుండె. ఇప్పుడో తీరు కష్టాలున్నయి. గప్పుడు ఊళ్ళెనే అన్ని సేసుకునెటోల్లం. దేవుడి మీద భారం. అప్పుడు గిప్పటి పోరగాండ్లకున్నట్టు సుఖముండెనా? లేదు గద! అన్ని ఎవ్వల పనులాల్లు సేసుకుందురు. పొద్దుల్నిండెదాక కైకిలికి పోయెటోల్లు. ఆడోల్లు ఎంత పొద్దుల్నిండినా ఎవ్వల పనులాల్లు సేసుకుందురు. గప్పుడు మీకున్నట్టు పనిమనుషులు గవ్వన్నేడయి. దొరలు, పంతుల్లు, రెడ్లు ఇంట్ల పని మనుషుల పెట్టుకునెటోల్లు. మా మంగలి సాయమ్మే మా ఊరి వైద్యురాలన్నట్టు. అన్ని కాన్పు లామే సేసింది అంది పోచవ్వ.  అవునే పోచవ్వ! నేను గా మంగలి సాయమ్మ గురించి మా ఇన్నగని గామెను సూల్లేదు. సిన్నప్పుడు సూడ చ్చుకని మతికి లేదు. గా సామమ్మ సంగతేందో సెప్ప వా? అంది లచ్చవ్వ.

గప్పు డు పోచవ్వ ఊరి వైద్యుల గురించి, మంత్రసాని మంగలి సాయమ్మ గురించి గిట్ల జెప్పవట్టింది. ఊరిచ్చుకుంటూరిచ్చుకుంట సెప్పవట్టింది. గక్కడడున్నోల్లంత సెవ్వులప్పలించి ఇంటండ్రు. మాది ఎడ్డి కాలమెనాయె. ఏం కాలమో నాకయితె సముజుగాలేదు గని గిప్పటి తీరుగ బస్సులు, రైల్లు, బల్లు, దవాఖానలు ఉండేటియి గాదు. గిప్పటి తీరుగ పగలు, పట్టింపులు గూడ ఉండేటియి గాదు. ఒగలింట్ల పభోజనమైతే ఇంకొగలింట్ల నుంచి మనుషులచ్చి పనిజేత్తురు. కులాలుండేటియిగని గిప్పటికి గూడ ఉన్నయి గని అందరు వరుసలతోనే పిలుసుకునెటోల్లు. ఒగలాపతిల ఒగలు సాయం జేసుకునెటోల్లు. ఊళ్ళెనే అన్ని రకాల వైద్యాలు సేసెటోల్లుందురు. గా గొల్ల గట్టన్నయితే గొర్లకు రొగాలచ్చిన, పశువులకు రోగాలచ్చినా, మనుషులకు రోగాలచ్చినా సూదిగాల్చి వైద్యం జేసెటోడు.

ముప్పయారు రోగాలకు మందుసురుకని అనేటోల్లు. గొడ్డుగొదకు కాళ్ళిరిగినా చెట్ల పసరుపోసి బద్దలేసి కట్లు గట్టెటోడు. మనుషులు కిందవడి కాళ్ళు సేతులిరుగగొట్టుకుంటె బొక్కలు పప్పుపప్పయినా గని గొల్ల రామయ్య బద్దలేసి కట్టుగడితె ఇగ గవ్వి అతికేటియి. పాలు సేపులు రాకుంటె మంత్రమేసెటోల్లు. ఇగ గా గత్తరచ్చిన సమయంల నయితె మంత్రగాల్ల కొగ గిరాకి గాదు. వానలు పడ్డంక మొలిసిన పచ్చి గడ్డితిని గొర్లు సిటుకు రోగమచ్చి సచ్చేటియి. మొదలయితె గా గట్టయ్యే గతిగని అటెనుక గొర్లకు సూదులిచ్చెటోల్లచ్చిండ్రు. ససంత్రమచ్చినంక దండాలు తీసుడు మొదలయింది. గవ్వి చలి జెరాలు గిట్ట రాకుంట ఇత్తురట. కని గా సంగతి మాకేమెరుక? ఊల్లెకు సుదులిచ్చెటోల్లత్తె గాల్లకు దొరుకద్దని ఊరువుతలికి ఉరుకవుచ్చుకునెటోల్లు. దూరం బోయెటోల్లు. గట్లనే బాగ సంతానమద్దని ఆపరేషన్లు సేసుకొమ్మని సర్కారోల్లు సెప్పుతె ఆపరేషన్ జేసుకుంటె మొగతనముండదని పనులు సెయ్యసాతగాదని దొరుకకుండ వోదురు. అటెనుక గవ్వన్ని వట్టియేనని తెల్సింది. ఆపరేషన్ జేసుడు మనకొరకేనని తెలిసి పెయింది. కిర్మి రాకుండ, ఏం రోగాలు రాకుండ కంతలల్ల బొడ్డుకింద బొత్తమీద కాల్సెటోల్లు. కొందరికి సుక్కబొట్టుకాడ కాల్తురు. గప్పటోల్లకు సానమందికి గిట్ల కాల్చిన మరుకలున్నయి సూడుండ్రి. గప్పుడు డాకుటర్లెక్కడ దవాఖానాలేడియి?

ఇగ కాన్పులయితె నయితె ఒగలొల్లిగాదు. మనూరి కంతటికి కాన్పులు జేసేది గా మంగలి సాయమొక్కతే. మంగలోల్లే ఎనుకట గిప్పుడు ఆపరేషన్లు జేత్తుండ్రు సూడు డాక్టర్లు గసోంటి పనులు జేత్తురట. అంటె ఊరికి మంగలయినే సర్జనన్నట్టు. సర్జనంటె గదే గా భూమిరెడ్డి డాక్టరసోంటోడన్నట్టు. మనూరోల్లందరు గయినె దగ్గరికే పోయెటోల్లు గద! మంగలోల్లు గోళ్ళెట్ల తీత్తరో తెలుసుగద. గింతగూడ నొప్పి వెట్టకుంట కిందకుండ కింద మీది కుండ మీదుండంగ నడిమి కుండను తప్పదీసినట్టు మంచి నేర్పుతోని దీత్తరు. గండ్లెంత పనితనముంది? ఒగ రాజట కుర్సీల పండుకొని నిద్రవోతండట. గయినె నిద్రలుండంగనే మంగలయినచ్చి గయినె నిద్రకు భంగం గటుగకుండ, గింతగూడ తెలువకుంట తెలివిరాకుంట గడ్డం గీకిండట.

గది తెలివంటె. తెలివచ్చినంక రాజు గడ్డం పుణుక్కొని గిట్టెట్లయిందని అశ్చెశ్యపెయిండట. గా మంగలయినెకు బంగారు నాణెమిచ్చిండట. ఎంత విషపు గడ్డనయిన మంగలోల్లు కత్తితోని కోసెటోల్లు. గిప్పుడు గా గడ్డకు ఆపరేషన్ చెయ్యన్నంటె వెయ్యిలు, లక్షలు గావట్టె. చేపమందని పోత్తండ్రుగద. గిప్పటికి గూడ గా మందును పట్నంల గౌడయినె పోత్తడట. మనూర్నుంచి గా మందు దాగుటానికి సానమందే పొయ్యచ్చిండ్రు. ఇగ గొర్రె మాంసముంటది గద. గొర్రె మాంసంల గొర్రె ఏ అంగం, అవయవం తింటె అంటే కూరండుకొని తింటే మనిషికి గా అవయవయానికున్న రోగం పోతదట. జీడిగింజతోని కాలిత్తె కిర్మి, నరాల రోగాలు రావందురు.

నేనయితె మస్తుసార్ల జీడిగింజతోని కాల్పిచ్చుకున్న. గౌండ్లోల్లు ఆకాశమంతెత్తున్న తాడిసెట్టెక్కి కల్లు గీసుట్ల ఎంత కళుంది. ఎంత పనితనముంది? వట్టిగ మోకు తాడుతోని పాకుతరుగద. ఒక్క సెట్టుకల్లునీర అసోంటిదయితె ఆరోగ్యానికి మంచిదంటరు. కని గా కల్లును కల్తిజేసి నాశినెం జెయ్యవట్టిరి. వట్టి చెట్టు కల్లయితె మంచిదే కని సార, బాంద్రసోంటియచ్చి గదాన్ని నాశినెం జేసె. ఎనుకట నల్లవడ్లని పండేటియి. మేమప్పుడన్ని ఎవుసప్పనులు, ఇంటిపనులు, వడ్లు దంచుడు, గడుక ఇసురుడు, పొలందాక నడ్సుడు, మోట, నాగలి, కలుపు గిసోంటి పనులన్ని జేత్తె తిన్నదరిగేది. కని తిండికి కడుపునిండ దొరికేది గాదు. గిప్పుడేమొ అన్ని మిషన్లేనాయె. పని తక్వ ఆయె. రోగాలు పెరిగె. నలుపయేండ్లన్న రాకముందే శక్కరి బీమారచ్చె. ఎప్పటి తిప్పలప్పుడున్నయనుకోండ్రి. ఇగ గా మంగలి సాయమ్మ గురించి సెప్పన్నంటె గదో పెద్దకతేగద! గది గా కోమండ్లపల్లె నుంచి మనూరికి కోడలయిచ్చింది. ఏడేళ్ళ పోరప్పుడచ్చింది. ఎర్రగ ముద్దుగుండె.

మంగలి పోసాలుకు పెండ్లమాయె పెరిగిన కొద్ది శాంతమ్మ ఎర్రగొర్రెలే లగ్గకు లగ్గయింది. గీ మంగలి పోచాలు వంశపయినే ఎనుకట పెద్దపెల్లి దేశ్‌ముఖ్‌కు రాచపుండు పుడితె కోసి మందేసిండట. గప్పట్ల గా మనిషి బతుకుడు కష్టమేనన్నట్టు. మనూల్లె గా రేచబోయిన గోపాల్‌కు కాలుకు రాచపుండు పుట్టింది. గదాంతోనే గయినె సచ్చిపెయిండు. గదానికి మందే లేదందురు. గసోంటిదాన్ని మంగలి పోషాలు తాత పెద్దపెల్లి దేఖ్‌ముఖ్‌కు పోయేటట్టు జేసి బతికిచ్చిండు. అందరుగ ట్ల బతుకుతరని కాదుగని గా దేశ్‌ముఖ్ బతికిండు రాచపుండంటె గిప్పుడు గదేదో కాన్సరంటరు సూడుండ్రి గసోంటిది. గీ మంగలిసాయమ్మ అత్త ఊళ్ళెమంత్రసానన్నట్టు.

ఇంటి కోడలయినంక సిన్నప్పటికెల్లే అత్తతోని పొయ్యి సాయమ్మ కాన్పులు జేసడన్ని నేర్సుకుంది. తల్లికి, బిడ్డకు ప్రమాదం లేకుండ ఎట్ల కాన్పు జెయ్యాలె, నెలలు నిండినా నొప్పులు రాకుంటె నొప్పులచ్చెటట్టు జేసుటానికేం జెయ్యాలె. గిసోంటి మెలుకువలన్ని చిన్నప్పట్నుంచే నేర్సుకుంది. బొడ్డుకోసుడు, కలిజల్లుడు, కడుపుల పిండముండంగనే ఆడోమొగో ఏర్పాటు జేసుడు గిట్ట అన్ని నేర్సుకుంది. తననుంచి అయితదో కాదో సెప్పేది కాకుంటె కన్నాగురంల తీసుకపొమ్మనేది. కని నూటికి తొంభైతొమ్మిది తనే సేసేది. గప్పుడు ఆపరేషన్లేడియి? గా శాంతమ్మే కాన్పుల డాక్టరన్నట్టు. మల్ల నీల్లాడినంక బాలెంత తనానికి తక్కలాకు, ఇలాలెంత వెచ్చాలు అన్నీ సెప్పేది. బాలెంత నడుముకు బట్ట కట్టుకోవన్ననేది. ఎవ్వలింట్ల కాన్పయినా శాంతమ్మ హాజరు. దొరగానియ్యి దాతగానియ్యి పేదోడు గానియ్యి చిన్నపెద్ద అందరికామె దిక్కు. కాన్పులు సేసే తల్లి. ఆమె సేతి మీద వెయ్యిల కాన్పులయినయి. అత్త చచ్చిపోయినంక గాపని ససంత్రంగ సేతవట్టి నలుపయాభయేండ్లు తానే కాన్పులు జేసింది. మొన్నమొన్ననే ఎనుభయేండ్లు దాటినంక సచ్చిపెయింది. అయితె గామె గిప్పటి డాక్టర్ల లెక్క బంగ్లాలు గట్టలే. భవంతులు గట్టలే. బట్టపొట్టకే బతికింది అంది పోచవ్వ.