Home లైఫ్ స్టైల్ నావలవుతున్న నగరాలు

నావలవుతున్న నగరాలు

Migration

మొన్న నాలుగు రోజుల పాటు ఆగకుండా కురిసిన వర్షాలు జంట నగరాలని అతలాకుతలం చేశాయి. చెరువులైపోయిన రోడ్లు, ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు, రోడ్లకి అడ్డంగా పడిపోయిన చెట్లు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేయడంతో పాటు కొన్ని విలువైన ప్రాణాలను కూడా బలి తీసుకున్నాయి. హైదరాబాద్ లోనే కాదు దేశం అంతటా ఏ ప్రధాన నగరాన్ని తీసుకున్నా ఇదే పరిస్థితి. చిన్న చినుకు పడితే రోడ్లు చెరువులు గా మారి ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. భారీ వర్షాలు ప్రాణ నష్టాన్నే కాక ఆస్తి నష్టాలను కూడా కలగచేస్తూ నగర ఆర్ధిక వ్యవస్థలను కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి. 2015 లో చెన్నై నగరాన్ని ముంచెత్తిన వాన, వరదలు కలగచేసిన నష్టం దాదాపు 21,381 కోట్ల రూపాయలని ఒక అంచనా. మన నగరాల ఈ దుస్థితికి అసలు కారణం ఏమిటి? పైపైన చూస్తే ప్రకృతి వైపరీత్యంగా కనపడుతుంది. లోతుగా చూస్తే నిజానికిది మానవ తప్పిదమే అని రూఢి అవుతుంది. పారిశ్రామిక విప్లవం, ఆర్థిక ప్రగతి కొత్త ఉద్యోగాలని అందిస్తూ జీవన ప్రమాణాలను మెరుగుపరచడం ఆనందాన్ని కలిగించే అంశం. అయితే ఈ పారిశ్రామిక విస్తరణ తెచ్చిపెట్టిన చిక్కులు తక్కువేమీ కాదు. కాలుష్యం అందులో మొదటిది, అత్యంత ప్రధానమైనది. పారిశ్రామిక వ్యర్థాల వల్ల, నానాటికీ దేశంలో పెరిగిపోతున్న వాహనాల వల్ల ఇంకా అనేకానేక కారణాల వల్ల సంభవిస్తున్న వాతావరణ మార్పుల గురించి అనేక పర్యావరణ సంస్థలు హెచ్చరిస్తూనే వున్నాయి.

బలహీనమవుతున్న ఓజోన్ పొర, పెరుగుతున్న భూతాపం వల్ల గ్లేసియర్లు కరిగి నదులలో సముద్రాలలో నీటి మట్టాలు పెరగడం ఇప్పటికే మొదలయింది. ఈ ప్రక్రియ ఇలాగే కొనసాగితే మరి కొన్ని దశాబ్దాలలో ముంబై, చెన్నై వంటి సముద్ర తీర నగరాలతో పాటు అనేక గ్రామాలు కూడా కనుమరుగైపోయే ప్రమాదం ఉందని వాతావరణ మార్పుల అంతర్ ప్రభుత్వ సంఘం (ఇంటర్ గవర్నమెంటల్ పానెల్ ఆఫ్ క్లైమేట్ చేంజ్) ఏనాడో హెచ్చరించింది. దాని సూచనలు కనిపించడం మొదలయ్యింది. వేసవిలో అత్యంత దారుణమైన ఉష్ణోగ్రతలు, వర్షాకాలంలో అతి భారీ వర్షాలు దాదాపు మామూలైపోయాయి. మరో వైపు అత్యధిక వర్షపాతాన్ని సమర్ధవంతంగా తట్టుకునే శక్తి కానీ, ఆ నీటిని వృథా పోనియ్యకుండా నిల్వ ఉంచుకునే సామర్ధ్యం కానీ మన నగరాలు, పట్టణాలకు లేనే లేవు.

చండీగఢ్ లాంటి ప్రణాళికా బద్ధంగా నిర్మించిన నగరాలు, జెంషెడ్పూర్, భిలాయ్ వంటి పారిశ్రామిక నగరాలు తప్ప దాదాపుగా మిగిలిన నగరాలన్నీ నానాటికీ పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా పెరుగుతూ పోయినవే. ఆ పెరుగుదల క్రమబద్ధంగా ఉంటే పరవాలేదు. పరిస్థితి అందుకు పూర్తి విరుద్ధం. రోడ్ల విస్తరణ లేదు, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరిచింది లేదు, పెరుగుతున్న జనాభాకి అవసరమైనన్ని ఆవాస ప్రాంతాలు లేవు. ఫలితంగా చాలా నగరాలు, పట్టణాలలో ఒకప్పటి చెరువులన్నీ నివాస ప్రాంతాలుగా మారిపోయాయి. పూడిక తీయకుండా నిర్లక్ష్యంగా వదిలేసిన చెరువులన్నీ నివాస భూములు గా, ఐటి పార్కులుగా, షాపింగ్ మాల్స్ గా, రియల్ ఎస్టేట్ వ్యాపారాలుగా రూపాంతరం చెందాయి. ఫలితంగా భారీ వర్షాలు పడినప్పుడు నీటిని నిల్వ చేసుకునే సదుపాయాలు చాలా వరకు లేకుండా పోయాయి. చెరువులు మన నివాసాలుగా మారిపోయాయని తెలియని వర్షపు నీరు మాత్రం అదే ప్రాంతాలకు చేరుకొని మన ఇళ్ల్లనే చెరువులుగా మారుస్తున్నది.

నగరాలు ఇలా నానాటికీ విస్తరించడానికి ప్రధాన కారణం వ్యవసాయం చితికిపోవడం, అలాగే ఇతర గ్రామీణ జీవనోపాధులు అంతరించడం. పట్టణాలను వానలు, వరదలు ముంచెత్తుతుంటే మన పల్లెలను కరువు, కాటకాలు వెంటాడుతున్నాయి. దీని కారణంగా వ్యవసాయం, దాని అనుబంధ వృత్తులు దెబ్బతినడంతో పాటు చేనేత, కంసాలి, కమ్మరి వంటి అనేక ఇతర గ్రామీణ చేతి వృత్తులు కూడా గిట్టుబాటు కాని పనులుగా మారిపోయాయి. ప్రపంచీకరణ, పట్టణీకరణ, పారిశ్రామికీకరణ గ్రామీణ జీవనోపాధులను కోలుకోలేని దెబ్బ తీశాయి. దీనికి తోడు ఈ నాటి విద్యావంతులైన (నిజానికి పెద్దగా చదువుకోని వారు కూడా) యువత కూడా గ్రామీణ కుల వృత్తుల పట్ల ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదు. పారిశ్రామిక విప్లవం పట్టణాలు, నగరాలకే పరిమితం కావడం వల్ల నూతన జీవనోపాధులు ఏవీ పల్లె ప్రాంత వాసులకి అందుబాటులో లేకుండా పోయాయి. వీటన్నిటి ఫలితంగా ప్రత్యామ్నాయ పనులు వెతుక్కుంటూ ప్రజలు పట్టణాలు, నగరాలకు వలస వెళ్తున్నారు. ఇది ఒక విధంగా గత్యంతరం లేక పోయే నిర్బంధ వలస (push migration).

నాణ్యమైన విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలన్నీ ప్రధాన పట్టణాలు నగరాలకే పరిమితం కావడం కూడా గ్రామీణ ప్రాంతాల ప్రజలు అక్కడకు వలస పోవడానికి మరొక కారణం. పార్కులు, సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్ వంటి అనేక వినోద సాధనాలతో, పెరుగుతున్న వసతులతో మెరుగవుతూ మిరుమిట్లు గొల్పుతున్న నగర జీవన విధానం కూడా గ్రామీణ ప్రాంత ప్రజలను పట్టణాల వైపు ఆకర్షిస్తున్నాయి (pull migration). దీనిని అయస్కాంత వలస అనవచ్చు. వ్యవసాయమే ప్రధాన వృత్తిగా బ్రతికే కొద్దిమంది, ఆ కుల వృత్తులే ఆధారంగా బ్రతికే కొన్ని కుటుంబాలు, ఊరు వదిలిపెట్టి వెళ్ళడానికి మనస్కరించని ముసలి వాళ్ళు తప్ప పల్లెలన్నీ దాదాపుగా నగరాలకు ఎప్పుడో వలసపోయాయి. పల్లెటూళ్లు, వృద్ధాశ్రమాలయ్యాయి. దీని ఫలితమే నానాటికీ పెరిగిపోతున్న నగర జనాభా. పెరుగుతున్న జనాభా వలన భూమి కోసం, నీటి కోసం, ఇతర వనరుల కోసం పోటీ పెరిగిపోతుంది. ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు దొరకడం గగనమైపోతుంది.

ఈ పరిస్థితిని గమనించిన మాజీ రాష్ట్రపతి శ్రీ అబ్దుల్ కలాం PURA (Providing Urban Amenities in Rural Areas) అనే అంశాన్ని తెర మీదకు తెచ్చారు. పట్టణ ప్రాంతాలలో లభించే ఉన్నత విద్య, వైద్య, ఉపాధి అవకాశాలను, అక్కడ దొరికే వివిధ వసతులను పల్లెలలో ఏర్పాటు చేయడం ద్వారా ఈ వలసలను అరికట్టడమే కాక భవిష్యత్తులో పట్టణాలలో భూమి కోసం,నీటి కోసం, ఇతర వనరుల కోసం ఎదురయ్యే ఒత్తిడిని సమర్ధవంతంగా ఎదుర్కోవొచ్చు అనేది వారి ఆలోచన. దీనిని అమలు పరచాల్సిన సమయం ఇదే. గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాలకు వలస పోతున్న వారితో నిండిపోతున్న నగరాలకు వాతావరణ మార్పుల రూపంలో మరో ముప్పు పొంచి ఉంది. నానాటికీ పెరిగిపోతున్న సముద్ర మట్టాలు భవిష్యత్తులో సముద్ర తీర గ్రామాలు, పట్టణాలకు పెను ప్రమాదంగా మారనున్నాయి. అక్కడి నుండి కూడా ప్రజలు మైదాన ప్రాంతాలకు వలస వస్తే నగరాలలో ఉత్పన్నం కానున్న జనాభా విస్ఫోటనం ఊహకు కూడా అందదు.

ఇదంతా ఎప్పుడో ఎన్నో శతాబ్దాల తరువాత జరిగే పరిణామం కాదు. ఇప్పుడే మన కళ్ళ ముందే మన జీవిత కాలంలోనే జరగనున్న పెను మార్పు. ఇప్పటికే పసిఫిక్ మహా సముద్రంలోని ద్వీప దేశమైన కిరిబతి లో జరుగుతున్న పరిణామాలను ప్రపంచ దేశాలన్నీ ఆసక్తిగా గమనిస్తున్నాయి. పెరిగిపోతున్న పసిఫిక్ సముద్ర మట్టం లక్ష కి పైగా జనాభా కలిగిన ఆ చిన్న దేశాన్ని ముంచెయ్యనుందని పర్యావరణ వేత్తలు హెచ్చరించడంతో అక్కడి ప్రభుత్వం ఆ ద్వీపాన్ని ఖాళీ చేయించే పనిలో పడింది. తీరా ప్రమాదం సంభవించాక కట్టు బట్టలతో అక్రమ చొరబాటుదారులుగా, శరణార్థులుగా మిగలకుండా ఆ దేశ ప్రజలు పొరుగున ఉన్న న్యూజిలాండ్, ఆస్ట్రేలియా లలో ఉపాధి సంపాదించుకుని గౌరవప్రదంగా వలస పోయేందుకు తగిన ఏర్పాట్లు చేస్తుంది. ఏదైనా ప్రమాదం ముంచుకొస్తే తమ దేశ ప్రజలు తల దాచుకునేందుకు అక్కడికి దాదాపు 1000 మైళ్ళ అవతల ఫిజి అనే ద్వీపం లో 6000 ఎకరాల భూమి కొనుగోలు చేసి పెట్టుకుంది. లక్ష జనాభా కలిగిన ఒక చిన్న ద్వీప దేశానికే వాతావరణ మార్పుల ప్రభావాల నుండి తమ ప్రజలను కాపాడడం ఇంత కష్టతరమైన విషయం అయితే కోట్ల జనాభా కలిగిన మన దేశానికి ఇటువంటి విపత్తులను ఎదుర్కోవడం ఎంత మాత్రం సాధ్యమయ్యే విషయం కాదు.

అందుకే చేతులు కాలాక ఆకులు పట్టుకునే పరిస్థితి రాక ముందే ఈ అసాధారణ వర్షాలు, ఉష్ణోగ్రతలు మనకిస్తున్న ప్రమాద హెచ్చరికలను గుర్తించి ఇప్పటి నుండే చర్యలు ప్రారంభించండం అత్యవసరం. పట్టణాలలో మౌలిక సదుపాయాలు, డ్రైనేజీ వ్యవస్థలు మెరుగుపరచడం, అధికంగా పడే వర్షాన్ని నిల్వ చేసుకునేందుకు చిన్న పెద్ద చెరువులను పునర్వ్యవస్థీకరించడం, ఇంకుడు గుంతలు వంటి వాటిని విస్తృతంగా నిర్మించడం తో పాటు పర్యావరణానికి హాని చేసే అన్ని వ్యవస్థలపైనా, కార్యక్రమాల పైన దృష్టి పెట్టాల్సి ఉంది. వాహనాల, పరిశ్రమల కాలుష్యాన్ని నియంత్రించడం, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, విరివిగా మొక్కలు పెంచడం, విద్యుత్తు వినియోగాన్ని వీలైనంత వరకు తగ్గించడం, పెట్రోల్ డీజెల్ వంటి వాటికి బదులుగా ప్రత్నామ్యాయ ఇంధన వనరులను వినియోగించడం, వ్యవసాయ వ్యర్ధాలను నియంత్రించడం, రసాయన ఎరువుల వాడకానికి బదులుగా సేంద్రియ సాగు పద్ధతులను ప్రోత్సహించడం వంటివి మనం తీసుకోవాల్సిన చర్యలలో కొన్ని మాత్రమే. గ్రామీణ జీవనోపాధులను పనర్వ్యవస్థీకరించడం, వాటికి గిట్టుబాటు కల్పించడం తో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను కూడా కల్పించాల్సి ఉంది. పర్యావరణ మార్పులు అనేవి కేవలం వాతావరణానికి సంబంధించిన అంశాలు కావు. మన నగరాలకు, పల్లెలకు, జీవితాలకు, జీవనోపాధులకు మొత్తం మానవ సమాజ అభివృద్ధికి, పురోగతికి, ప్రపంచ శాంతికి సంబంధించిన అంశం. 2013 లో ముంబై, కలకత్తా, 2014 లో శ్రీనగర్, 2015 లో చెన్నై, 2016 లో హైదరాబాద్ ఇప్పుడు మళ్ళీ 2017 లో ముంబై హైదరాబాద్ లని ముంచెత్తిన వానలు…. ఇవన్నీ రాబోయే కాలంలో రానున్న పెను ప్రమాదానికి హెచ్చరిక ఘంటికలు మాత్రమే.

-భారతి కోడె, 9440103411