Home ఎడిటోరియల్ అసోం జంట సమస్యలు

అసోం జంట సమస్యలు

Article about Modi china tour

ఈశాన్య భారత్ రాష్ట్రాల్లో పెద్దదైన అసోం ప్రస్తుతం భావోద్వేగం, భయాందోళనతో ముడిపడిన రెండు సమస్యలు ఎదుర్కొంటున్నది. ఒకటి, సుప్రీంకోర్టు ఆదేశంపై జరుగుతున్న ‘నేషనల్ రిజిష్టర్ ఆఫ్ సిటిజన్స్’ తాజాకరణ. రెండు, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ‘పౌరసత్వ (సవరణ) బిల్లు. రాష్ట్రంలో అక్రమంగా నివాసముంటున్న విదేశీ వలస ప్రజలను గుర్తించటానికి మొదటిది ఉద్దేశించబడగా, ఇరుగుపొరుగు దేశాలైన బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్‌లనుంచి వలసవచ్చిన హిందువులకు (హిందువులు, సిక్కులు, జైన్‌లు, పార్శీలు వగైరా) పౌరసత్వమివ్వటానికి సవరణ బిల్లు ఉద్దేశించింది. ఈ బిల్లు ప్రస్తుతం జాయింట్ పార్లమెంటరీ కమిటీ పరిశీలనలో ఉంది.
సరిహద్దు రాష్ట్రమైన అసోంకు వలసల సమస్య దీర్ఘకాలంగా ఉన్నదే. బెంగాల్ నుంచి ఎప్పుడో వలస వచ్చి స్థిరపడిన వారి సమస్య ఒకటైతే, 1971లో బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంతో పెద్ద ఎత్తున వలస వచ్చిన బెంగాలీ ముస్లింల సమస్య అతిపెద్దది. అసోంలో అస్సామీయులు మైనారిటీ అయ్యే ప్రమాదాన్ని శంకించిన విద్యార్థులు అఖిల అసోం విద్యార్థి యూనియన్ సంఘర్ష సమితి పేరుతో తమ భాష, సంస్కృతి, జనాభా పొందిక రక్షణకై 1980 దశకంలో పెద్ద ఎత్తున సంవత్సరాలపాటు ఉద్యమించటం, అటు తర్వాత అసోం గణపరిషత్ (ఎజిపి) పేరుతో ఎన్నికల ద్వారా అధికారానికి రావటం గుర్తు చేసుకోదగింది. 1985 లో రాజీవ్‌గాంధి ప్రభుత్వం ఆ ఉద్యమకారులతో సుదీర్ఘ చర్చల అనంతరం కుదిరిన ప్రసిద్ధ ‘అస్సాం అకార్డ్’ విదేశీయుల గుర్తింపుకు మార్చి 24, 1971ని కటాఫ్ తేదీగా అంగీకరించింది. అంటే ఆ తేదీకి ముందు వలస వచ్చిన వారిని ఇముడ్చుకోటం, ఆ తర్వాత వచ్చిన వారిని వారి స్వదేశానికి తిరిగి పంపటం దాని ఉద్దేశం. ఆ ఒప్పందాన్ని పార్లమెంటు ఆమోదించింది. దాని అమలు ఆశించిన మేరకు జరగలేదు. అయితే పొరుగు దేశాల్లో వేధింపులవల్ల డిసెంబర్ 13, 2014 తేదీ నాటికి భారత్‌లో ప్రవేశించిన హిందువులకు పౌరసత్వం ఇవ్వాలని మోడీ ప్రభుత్వ నిర్ణయించి పౌరసత్వ సవరణ బిల్లు తెచ్చింది. ప్రస్తుతం అసోంలో బిజెపి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న అసోం గణపరిషత్ (ఎజిపి) ఈ బిల్లును వ్యతిరేకిస్తూ రాష్ట్రపతికి మెమొరాండం సమర్పించింది. మత ప్రాతిపదికపై పౌరసత్వం మంజూరును వ్యతిరేకిస్తూ, అది 1971 నాటి అస్సాం ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నదని తెలిపింది. ‘పౌరసత్వ సవరణ చట్టం’తో కేంద్ర ప్రభుత్వం ముందుకెళితే అసోంలోని సంకీర్ణ ప్రభుత్వం నుంచి వైదొలుగుతామని ఎజిపి హెచ్చరించింది. ఈ బిల్లు ప్రస్తుతం జాయింట్ పార్లమెంటరీ కమిటీ పరిశీలనలో ఉంది.
అక్రమంగా నివసిస్తున్న విదేశీయులను గుర్తించే ప్రక్రియగా పౌరుల రిజిష్టర్‌ను తాజా పరిచే పని తుది దశకు చేరింది. సుప్రీంకోర్టు మానీటరింగ్ కింద జరుగుతున్న ఈ కృషిలో భాగంగా గత సంవత్సరం డిసెంబర్ 31న ప్రచురించిన తొలి ముసాయిదాలో 1 కోటి 90 లక్షల పేర్లు లేకపోవటం, వారిలో ఎఐయుడిఎఫ్‌కు చెందిన ఇద్దరు ఎంపిలు, 126 మంది ఎమ్మెల్యేల్లో కనీసం 15 మంది పేర్లు లేకపోవటం అలజడి సృష్టించింది. సవరణలు, ఫిర్యాదులు చేసుకోవచ్చంటూ అప్పటికి ఆగ్రహాన్ని చల్లార్చారు. జూన్ 30న తుది ముసాయిదా ప్రచురించబడాలి. అయితే వరదల వల్ల పని పూర్తికాలేదంటూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును గడువు పొడిగింపు కోరే అవకాశముంది. ఏమైనా తుది జాబితా బెంగాలీ హిందువులకు, బంగ్లాదేశ్ ముస్లింలకు వ్యతిరేకంగా ఉద్దేశించబడిందని బెంగాలీలు ఆందోళన చెందుతున్నారు. మూడు కోట్ల అసోం జనాభాలో 28 శాతం ప్రధానంగా బారక్ లోయ జిల్లాల్లో బెంగాలీలున్నారు.
పొరుగు దేశాల నుంచి, ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన హిందువులకు పౌరసత్వం కల్పిస్తూ, మయన్మార్ నుంచి వలస వచ్చిన ముస్లిం రొహింగ్యాలను కాందీశీకులుగా గుర్తించటానికి కూడా కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది. అందువల్ల అస్సాం ఒప్పందం వెలుగులో వలసల సమస్య పరిష్కారమే ఉత్తమం.