Home రాష్ట్ర వార్తలు పాల ప్రోత్సాహకానికి మార్గదర్శకాలు

పాల ప్రోత్సాహకానికి మార్గదర్శకాలు

milk

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర డైరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఫెడరేషన్‌కు పాలు సరఫరా చేసే చిన్న, సన్నకారు పాడిరైతులను ప్రోత్సాహించేందుకు ప్రకటించిన లీటరుకు రూ. 4 ప్రోత్సాహకం అమలునకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మేరకు పశుసంవర్థక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేష్ చందా ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం, రంగారెడ్డికరీంనగర్ పాల ఉత్పత్తిదారుల సంఘం, కరీంనగర్‌ముల్కనూర్ మహిళ స్వయం సహాయక పాల ఉత్పత్తి సహకార సంఘాలలో పాలు పోసే సభ్యులకు లీటరు రూ. 4 చొప్పున పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో పాల ప్రోత్సాహక పథకాన్ని అమలు చేయనున్నారు. ఈ సంఘాలు ప్రభుత్వంతో ఎమ్‌ఓయూ కుదుర్చుకోవాల్సి ఉంటుంది. మార్గదర్శకాల ప్రకారం ప్రతి సభ్యుడు నెలలో 1000 లీటర్ల వరకు అదనపు ప్రోత్సాహాకాన్ని అందిస్తారు. ఇంతకు మించి పాలు పోస్తే అధికార బృందం క్షేత్రస్థాయిలో ఆ పాడి రైతు సొంతంగా ఎన్ని పాడి పశువులను కలిగి ఉన్నారో పరిశీలించనుంది. ఆవుపాలకు 3 శాతం వెన్న, బర్రె పాలకు 5 శాతం వెన్న ఉన్నవాటికి ఇది వర్తిస్తుంది. మధ్య దళారులకు, పాల విక్రయదారులకు ఈ ప్రోత్సాహకం వర్తించదు. ఈ పథకం అమలు పర్యవేక్షించడానికి జిల్లా, రాష్ట్రస్థాయిలో పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయి కమిటీకి జిల్లా కలెక్టర్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. జాయింట్ కలెక్టర్, జిల్లా విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ కమిటీ అధికారి, జిల్లా రిజిస్ట్రార్ కోఆపరేటివ్ అధికారి, జిల్లా వెటర్నరీ సభ్యులుగా జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. అదే విధంగా రాష్ట్రస్థాయి మానిటరింగ్‌లో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఛైర్మన్‌గా, ఆర్థిక శాఖ కార్యదర్శి, పశుసంవర్థక శాఖ సంచాలకులు, తెలంగాణ స్టేట్ డైరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఫెడరేషన్ ఎం.డి, విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిజి, ముల్కనూర్, కరీంనగర్, నల్లగొండరంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాల ఛైర్మన్లు సభ్యులుగా ఉండనున్నారు. అలాగే ప్రభుత్వం రూపొందించిన నమూనా ప్రకారం సంబంధిత సహకార సంఘాలు ప్రోత్సాహక మొత్తం వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగా ప్రభుత్వం నిధులు మంజూరు చేయనుంది.