Search
Wednesday 21 November 2018
  • :
  • :

ఎంఎస్‌పి ఉపశమనమే!

fields14 పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) పెంచిన కేంద్ర మంత్రివర్గ నిర్ణయం వ్యవసాయ దుస్థితిని ఉపశమింపజేయటానికి, రైతుల పరిస్థితిని మెరుగుపరుస్తామన్న హామీని నెరవేర్చటానికీ ఉద్దేశించింది. రైతులకు వ్యవసాయ ఖర్చులపై 1.5 రెట్లు లభిస్తుంది. ఇది మంచి ప్రయత్నం. రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేసే దిశలో తీసుకున్న చర్యగా వ్యవసాయ మంత్రిత్వ శాఖ చెబుతోంది. ప్రస్తుతం 23 పంటలు ఎంఎస్‌పి కింద ఉన్నాయి. అయితే వ్యవసాయోత్పత్తులను పూర్తిగా ఆ ధరకు కొనుగోలు చేస్తారని దాని అర్థం కాదు. అదొక ప్రాతిపదిక కల్పిస్తుంది; ధరలు ఆ స్థాయికన్నా దిగజారితే ఆ రేటుకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్న హామీ. పంటల్లో అత్యధిక భాగాన్ని తక్కువ ధరలకు వ్యాపారులు కొంటున్నప్పటికీ, వ్యవసాయ మార్కెట్‌లో కనీస స్థాయిని అది నెలకొల్పుతుంది.
వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్ (సిఎసిపి) మూడు నిర్వచనాలను ఉపయోగించి పంటల ఉత్పత్తి వ్యయాన్ని నిర్ణయిస్తుంది: ఒకటి, ఎ2 అది రైతులు ప్రతి ఒక్క సీజన్‌లో పైర్లు పెంచి పంటలు పండించటానికయ్యే వాస్తవ ఖర్చు. విత్తనాలు, ఎరువులు, క్రిమి సంహారక మందులు కొనుగోలు ఖర్చు, వ్యవసాయ కార్మికులకు చెల్లించే కూలీ అందులో ఉంటుంది. రెండు, ఎ2 ప్లస్ ఎఫ్‌ఎల్ అనగా ఉపకరణల వాస్తవ ఖర్చు, భూమిపై పని చేసే కుటుంబ సభ్యులు వెచ్చించే శ్రమ ఆర్థిక విలువ (వారు పని చేయకపోతే వ్యవసాయ కార్మికుల చేత పనులు చేయించుకుని వేతనం చెల్లించాలి కదా), సూక్ష్మంగా కుటుంబ శ్రమ. మూడు, సి2 దీనిలో ఎ2 ప్లస్ ఎఫ్‌ఎల్‌తోపాటు మక్తా సొమ్ము, భూమి విలువపై వడ్డీ సహా పెట్టుబడి ఆస్తుల విలువ.
ఈ సంవత్సరం ఎంఎస్‌పి పెంపుదల ఎ2 ప్లస్ ఎఫ్‌ఎల్‌కు పరిమితం చేయబడింది. దీనిలో దిద్దుబాటు అవసరమని అనేక రైతు సంఘాలు చెబుతున్నాయి. వాస్తవానికి, ఎంఎస్‌పిలు, రుణ మాఫీలు వ్యవసాయ రంగం దుస్థితిని తొలగించే అభిమాన చర్యలు. అయితే ఎంఎస్‌పి వల్ల ధరలు పెరుగుతాయి (ద్రవ్యోల్బణం) కాబట్టి కొత్త ఎంఎస్‌పిలు రైతులకు ఏమంత సహాయకారి కావు. ఎ2 ప్లస్ ఎఫ్‌ఎల్ ప్రకారం వరి ఇతర పంటలకు ఎంఎస్‌పి పెంపుదల సుమారు 50 శాతం, ముతక ధాన్యం సజ్జలకు 97 శాతం అదనపు ఎంఎస్‌పి లభిస్తుంది. ఇది ఎన్నికలు జరగనున్న రాజస్థాన్ రైతులకు లాభిస్తుంది. వరి ఎంఎస్‌పి పెంపు దాని సాగు విస్తీర్ణం పెంపుదలకు దోహదకారి అవుతుంది. సి2 ప్రకారం చూస్తే, ఎక్కువ పంటలకు 14 శాతం అదనపు ఎంఎస్‌పి, సజ్జలకు మాత్రం సుమారు 50 శాతం అదనపు ఎంఎస్‌పి లభిస్తుంది.
అయితే రైతుల్లో 6 శాతం మందికి మాత్రమే ఎంఎస్‌పి పెంపుదల వల్ల గరిష్ఠ లబ్ధి చేకూరుతున్నట్లు శాంతాకుమార్ కమిటీ 2015లో కనుగొన్నది. భారత ఆహార కార్పొరేషన్ కొనుగోలు చేయటం లోపభూయిష్టంగా ఉన్నట్లు కూడా కనుగొన్నది. 201213 సంవత్సరానికి ఎన్.ఎస్.ఎస్.ఒ (70వ రౌండ్)గణాంక సమాచారం ప్రకారం, 2012 జూలై డిసెంబర్ మధ్య వరి ధాన్యం విక్రయించిన రైతుల్లో 13.5 శాతం మాత్రమే ధాన్య సేకరణ ఏజన్సీలకు విక్రయించారు. 2013 జనవరి జూన్ కాలంలో అటువంటి రైతుల శాతం 10 మాత్రమే. కాగా గోధుమ పండించిన రైతుల విషయంలో (జనవరి జూన్ 2013) కూడా అది 16.2 శాతమే.
2016లో నీతి ఆయోగ్ అధ్యయనం కూడా ఎన్‌ఎస్‌ఎస్‌ఒ అధ్యయనాన్ని ధృవీకరించింది. అనేక ప్రాంతాల్లో ఎఫ్‌సిఐ ధాన్య సేకరణ కార్యక్రమం లేదు, అటువంటిది ఉన్నట్లు కూడా చాలా మంది రైతులకు తెలియదు. ఈ లోపాలు కొనసాగుతున్నట్లు నీతి ఆయోగ్ అధ్యయనం సూచిస్తున్నది. అయితే ఎంఎస్‌పి పెంపుదల ఆంధ్రప్రదేశ్, అసోం, మహారాష్ట్ర, రాజస్థాన్‌ల్లో, బీహార్‌లోని కొన్ని భాగాల్లో వరి సాగు విస్తర్ణం పెరుగుదలకు దోహదం చేసినట్లు అది కనుగొన్నది. ఉత్తరప్రదేశ్‌లో సాగు విస్తీర్ణం 1.4 శాతం పెరగ్గా, ఒడిసాలో స్వల్పంగా తగ్గింది. ఉత్తరాఖండ్‌లో స్థూలంగా పంటలు వేసే విస్తీర్ణం 14 శాతం పడిపోయింది. గుజరాత్‌లో అత్యధిక పంటలు ఎంఎస్‌పి ఎన్నా ఎక్కువకు అమ్ముడవుతాయి కాబట్టి అక్కడ దాని ప్రభావం లేదు.
సి2 ప్రకారం ఉత్పత్తి వ్యయంపై 50 శాతం రాబడి ఇచ్చే విధంగా ఎంఎస్‌పిని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇంకనూ నెరవేరాల్సి ఉంది. అందరికీ తెలిసినా విస్మరించబడిన మరో అంశం మధ్యదళారులు. అత్యధిక పంటలు కొని మార్కెటింగ్ చేసేది వీరే. తమ ఉత్పత్తిని మార్కెట్‌కు రవాణా చేసే సామర్థం అత్యధిక రైతులకు ఉండదు. అంతేగాక ఎఫ్‌సిఐ చిక్కులమారి నిర్దేశనలు వారిని గందరగోళపరుస్తున్నాయి. వ్యాపారులు దీన్ని అనువుగా తీసుకుని తక్కువ ధరలకు కొనుగోలు చేసి అధిక లాభాలు ఆర్జిస్తుంటారు. రైతుల నష్టం వారికి లాభం. అయితే వారు రైతులకు ఆర్థిక సహాయం అందించి అదనపు భారం నుంచి వారిని కాపాడుతున్నందున వారిని రక్షకులుగా రైతులు చూస్తున్నారు.
శాంతా కుమార్ కమిటీ, నీతి ఆయోగ్ అధ్యయనాలు పరిశీలించదగినవి. వ్యవసాయ మార్కెటింగ్ వ్యూహాన్ని లోతుగా పరిశీలించటం, రైతులకు మేలు చేకూర్చే విధంగా మొత్తం వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థను పునర్నిర్మాణం చేయటం ఆ నివేదికల ముఖ్య సారాంశం. తద్వారా రైతులకు కొంత భద్రత ఒన గూరుతుంది.
వ్యవసాయ రంగంలో ప్రైవేటు పెట్టుబడులు పెంచాలని ఆలోచిస్తున్నట్లు ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. భారీ కార్పొరేట్ సంస్థలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలన్నది ఆ ఆలోచన. వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పెట్టుబడి అతి తక్కువగా ఉంది. కాగా గ్రామీణ జనాభాలో అత్యధికులు వ్యవసాయ కార్యకలాపాలపై ఆధారపడి ఉన్నట్లు శాంతా కుమార్ కమిటీ, నీతి ఆయోగ్ అధ్యయనాలు, ఎన్‌ఎస్‌ఎస్‌ఒ గమనించాయి. అందువల్ల కార్పొరేట్‌లు రంగంలో దిగి పెట్టుబడులు పెడితే చాలా మంది ఆ రంగం నుంచి వైదొలగాల్సి వస్తుంది. ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయి. వ్యవసాయ రంగం చాలా సంక్లిష్టమైంది, సవివరమైన అధ్యయనాలు, ప్రాంతాల వారీ వ్యూహాలు అవసరం. ప్రభుత్వం స్థాయిలో ఇప్పుడిది గుర్తించబడింది. కాని ఆమోదయోగ్యమైన వ్యూహం ఇంకనూ రూపొందలేదు. అయితే ఎంఎస్‌పిలు, రుణ మాఫీలు అంతిమ పరిష్కారం కాదు. రైతులను, ఆహార భద్రతను పటిష్టం చేయటానికి కొత్త ఆలోచనలు, పద్ధతులు అవసరం.

*  శివాజీ సర్కార్ 

Comments

comments