Home ఎడిటోరియల్ కొత్త ధాన్యసేకరణ విధానం

కొత్త ధాన్యసేకరణ విధానం

Minimum support price for 23 crops

కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా 23 పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) ప్రకటిస్తుంది. అయితే ప్రభుత్వ ఏజన్సీలు సేకరించే పరిమిత ఉత్పత్తికి మాత్రమే ఈ ధర లభిస్తోంది. ఉత్పత్తులు మార్కెట్‌కు వచ్చినపుడు ధర పడిపోవటం సహజ లక్షణం గనుక ప్రైవేటు వ్యాపారులు ఏదోక పేరుతో ధర దిగ్గోసి కొంటుంటారు. దిక్కుతోచని రైతులు అమ్ముకోక తప్పని పరిస్థితి. అందువల్ల నూనె గింజలు, పప్పు ధాన్యాలు, కొబ్బరి విషయంలో ప్రకటించిన మద్దతు ధర తప్పనిసరిగా రైతులకు అందేటట్లు చేసే కొత్త ప్రోక్యూర్‌మెంట్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆమోదించింది. ఈ విధానానికి పెట్టిన ముద్దుపేరు పిఎంఆశ (ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్). నూనె గింజల విషయంలో ప్రైవేటు వ్యాపారులు అదనంగా కొనుగోలు చేసేందుకు ఇది వీలు కల్పిస్తుంది. అంతేగాక ఎం.ఎస్.పి కన్నా మార్కెట్ ధర తక్కువ ఉంటే ఆ వ్యత్యాస సొమ్మును ప్రభుత్వం నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో వేస్తుంది. ఇది సక్రమంగా అమలు జరిగితే ఆ పంట ఉత్పత్తిదారులైన రైతులకు మేలు చేస్తుంది. ఇందుకుగాను రెండేళ్ల కాలానికి ప్రభుత్వం రూ. 15,053 కోట్లు కేటాయించింది. అంతేగాక ధాన్య సేకరణ ఏజన్సీలకు రూ. 16,550 కోట్ల మేర అదనపు రుణానికి ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది. నూనెగింజలపై కొత్త విధానం ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌ఘడ్ రైతులకు బుజ్జగింపుగా భావించబడుతున్నది.

అయితే అటువంటిదేమీలేదని, ప్రభుత్వం సమగ్ర దృక్పథంతో ముందుకెళుతున్నట్లు కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్ చెప్పారు. ఎంఎస్‌పి ప్రకటించినంత మాత్రాన సరిపోదు. దాన్ని రైతులకు అందించాలి. ఈ ఏడాది ఎంఎస్‌పి 50 శాతం పెంచాం. అది సక్రమంగా రైతులకు అందితే ఖర్చులుపోను కొంత లాభం ఉంటుందని అధికార ప్రకటన పేర్కొన్నది. మధ్యప్రదేశ్‌లో ప్రాయోగికంగా అమలులో ఉన్న భవాంతర్ పథకం ఆధారంగా కొత్త విధానం రూపొందించారు. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే నూనె గింజల్లో 25 శాతానికి ఆ పథకం వర్తింపజేయబడుతున్నది. నూనె గింజల సేకరణలోకి ఎంపిక చేసిన ప్రైవేటు సంస్థలను తొలిసారి అనుమతిస్తున్న కొత్త విధానం భవిష్యత్‌కు బాట కానుంది. కొద్ది జిల్లాల్లోకి ప్రాయోగికంగా ప్రైవేటు సంస్థలను తీసుకోవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సలహా యిచ్చింది. వివిధ రకాల నూనె గింజలు కొనుగోలు చేసే సంస్థలకు ఎంఎస్‌పిలో 15 శాతం వరకు సర్వీసు ఛార్జీల చెల్లింపు ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది.

ప్రధాన ఆహార ధాన్యాలైన వడ్లు, గోధుమల ఉత్పత్తిలో మూడవ వంతును కేంద్ర ప్రభుత్వం రేషన్ దుకాణాల నిమిత్తం ఎంఎస్‌పికి కొనుగోలు చేస్తున్నది. మిగతా 21 పంట ఉత్పత్తులకు తరచూ ఎంఎస్‌పి కన్నా తక్కువ ధర లభిస్తోంది. ఎందుకంటే ప్రభుత్వ కొనుగోలు పరిమితం, పరిమిత కాలమే కొనుగోళ్లు జరుగుతాయి. అటువంటప్పుడు నూనె గింజలు, పప్పులు, కొబ్బరికే ఎంఎస్‌పి అమలయ్యే విధానాన్ని కేంద్రం ప్రకటించటంలో ఉద్దేశం సంశయాత్మకం కాదా!

నీతి ఆయోగ్ రూపొందించిన పిఎం ఆశ పథకం రాష్ట్రాలకు రెండు మార్గాలు సూచించింది. ఒకటి, పప్పు ధాన్యాలు, ఎండు కొబ్బరికి అమలులో ఉన్న మద్దతు ధర విధానం (పిఎస్‌ఎస్) కొనసాగించటం. రెండు, రెండు కొత్త మార్గాలు ఎంచుకోవటం. ఒకటి, ప్రభుత్వం సేకరణ చేపట్టదు;మార్కెట్‌లో రైతు విక్రయించిన ధరకుఎంఎస్‌పికి మధ్యనున్న వ్యత్యాసాన్ని ప్రభుత్వం నేరుగా రైతు ఖాతాలో జమ చేయటం. రెండు, ప్రభుత్వం బదులుగా ప్రైవేటు సంస్థలు ఎంఎస్‌పికి సరుకు కొనుగోలు చేయటం, వాటికి సర్వీసు ఛార్జి కింద ప్రభుత్వం 15 శాతం చెల్లించటం.

2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయాలన్న సంకల్పంలో ఈ కొత్త విధానం ముఖ్యమైన చర్య అని రాధా మోహన్ సింగ్ చెప్పారు. అయితే నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. “గత రెండేళ్ల సేకరణ నుంచి 40 లక్షల టన్నులకు పైగా పప్పుధాన్యాలు, నూనె గింజలు నాఫెడ్ వద్ద నిల్వ ఉన్నాయి. వాటి పంపిణీకి విధానం లేదు. మార్కెట్ ధరలు ఎంఎస్‌పి కన్నా 30 శాతం తక్కువగా ఉన్నప్పుడు ఆ నష్టం ఎవరు భరిస్తారు” అని ప్రశ్నిస్తున్నారు వ్యవసాయార్థికవేత్త, ఎంఎస్‌పి నిర్ణయించే వ్యవసాయ ఖర్చులు ధరల కమిషన్ మాజీ ఛైర్మన్ అశోక్ గులాతీ. ప్రైవేటు ప్రొక్యూర్‌మెంట్‌కు గతంలో చేసిన ప్రయోగాలు డిమాండ్ పడిపోయినప్పుడు విఫలమైనాయని గుర్తు చేస్తున్నాడు ఆహార విధాన నిపుణుడు దేవేందర్ శర్మ అందువల్ల సేకరణ బాధ్యత నుంచి ప్రభుత్వ ఏజన్సీలు తప్పుకుని ప్రైవేటు ఏజన్సీలకు అప్పగిస్తే ఎంఎస్‌పిని రైతుకు అందించాలన్న ప్రభుత్వ ‘ఆశ’ నిరాశ కాకతప్పదు.